భలే.. భలే.. భీమయ్యవోయ్‌!

పార్వతీపురం జమీందారు దగ్గర భీమయ్య మేకల కాపరిగా ఎంతో నమ్మకంగా పని చేస్తున్నాడు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మేకలను పచ్చిక బయలుకు తీసుకెళ్లి చీకటి పడక ముందే యజమాని ఇంటికి చేర్చేవాడు.

Updated : 05 Apr 2024 04:08 IST

పార్వతీపురం జమీందారు దగ్గర భీమయ్య మేకల కాపరిగా ఎంతో నమ్మకంగా పని చేస్తున్నాడు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మేకలను పచ్చిక బయలుకు తీసుకెళ్లి చీకటి పడక ముందే యజమాని ఇంటికి చేర్చేవాడు. ఒకరోజు వాటిని సాయంత్రం నాలుగు గంటలకు తీసుకెళ్లి, ఆరు గంటలకల్లా తీసుకొచ్చి పాకలోకి వదులుతూ లెక్కపెట్టాడు. అందులో ఒక మేక తక్కువైంది.

ఇంటికి వెళ్లే ముందు పశువులను చూసుకునే అధికారికి మేకలు సరిగ్గా ఉన్నాయని చెప్పి వెళ్లాలి. అన్నీ సవ్యంగానే ఉన్నాయని, అబద్ధం చెప్పి బయటపడ్డాడు భీమయ్య. కానీ మనసు మనసులో లేదు. ఆ ఒక్క మేకా ఎలా తప్పి పోయిందోనని ఆలోచిస్తూ పచ్చిక బయలు వైపు నడక సాగిస్తున్నాడు.

అప్పుడే.. ఒక పొదల మాటు నుంచి మాటలు వినిపించాయి. ‘మరో అరగంటలో చీకటి పడుతుంది. ఈ బుజ్జి మేకను తీసుకుని దర్జాగా మన ఊరు చేరుకోవచ్చు. రేపు సంతలో దీన్ని అమ్మి ఆ వచ్చిన సొమ్మును సమానంగా పంచుకుందాం’ అన్నాడు ఒకడు. ‘అలాగే’ అన్నాడు మరొకడు.

భీమయ్య మనసు కాస్త కుదుటపడింది. ‘ఆ మేకను దొంగిలించిన వాళ్లు ఇక్కడే ఉన్నారన్నమాట’ అని అనుకున్నాడు. వెంటనే తనకు ఒక ఆలోచన వచ్చింది. మట్టిలో ఏదో వెతుకుతూ బిగ్గరగా ఏడవసాగాడు. ఆ ఇద్దరు దొంగలూ భీమయ్య దగ్గరకు వచ్చి.. ‘ఏమైంది బాబూ!’ అన్నారు. ‘అయ్యలారా! నేను బంగారు అంగడిలో పని చేస్తున్నాను. మా యజమాని, మా పని వాళ్లు తయారు చేసిన ఒక ఉంగరాన్ని, ఈ ఊరి జమీందారుకు ఇచ్చి రమ్మంటే దాన్ని కాగితంలో నుంచి ఇప్పుడే తీసి.. నా వేలికి పెట్టుకున్నాను. అది వదులుగా ఉండడం వల్ల జారి పడిపోయింది. దాని కోసం వెతుకుతున్నాను’ అని చెప్పి మళ్లీ ఏడుపు అందుకున్నాడు.

ఆ ఇద్దరూ పక్కకు వెళ్లి.. ‘ఈ రోజు మన పంట పండింది. ఆ ఉంగరాన్ని వెతికి సొంతం చేసుకుందాం. ఆ పిల్లవాడికి దొరక లేదని చెబుతాం’ అని మాట్లాడుకున్నారు. ‘అబ్బాయీ.. ఏడవొద్దు. ఆ ఉంగరాన్ని మేము వెతికిపెడతాం. నువ్వు ఈ మేకను జాగ్రత్తగా చూస్తుండు’ అని చెప్పారు. భీమయ్యను చూడగానే ఆ మేక ‘మేఁ..మేఁ..’ అని అరిచింది. అప్పుడతను దాని తలను నిమిరి.. ‘అలాగే నేను దీన్ని చూసుకుంటాను.. ఉంగరాన్ని త్వరగా వెతికి పెట్టండి’ అన్నాడు.

వాళ్లు ఉంగరం వెతుకుతుండగా భీమయ్య మెల్లగా ఆ మేకను తీసుకుని పరుగులాంటి నడకతో జమీందారు ఇంటికి చేరుకున్నాడు. అప్పుడు జమీందారు ఆరుబయట కూర్చుని ఉన్నాడు. ‘ఏం భీమయ్యా! ఒక్క మేకను తీసుకొచ్చావేంటి?’ అన్నాడు. దాంతో జరిగిందంతా వివరించాడా అబ్బాయి. జమీందారు ఇద్దరు మనుషులను భీమయ్యతో పంపుతూ.. ‘ఆ దొంగలను తీసుకురండి’ అని చెప్పాడు. వారు పరుగున ఆ ప్రాంతానికి చేరుకున్నారు.

ఆ ఇద్దరూ.. ‘బాబూ.. ఎక్కడ పడేశావో ఏమో!.. ఆ ఉంగరం దొరకనే లేదు’ అన్నారు. భీమయ్యతో వచ్చిన వారు ఆ ఇద్దరినీ రెక్కలు విరిచి పట్టుకుని జమీందారు వద్దకు తీసుకెళ్లారు. ‘ఏ ఊరి దొంగలు మీరు? మేకను దొంగిలించి తీసుకెళ్తారా?’ అని జమీందారు గద్దించి అడిగాడు. ‘అయ్యా! మేము పది గ్రామాల అవతల ఉంటాం. అవకాశం చూసి ఒక చిన్న మేకను ఎత్తుకెళ్లాం’ అని చెప్పారు. ‘ఇంకెప్పుడూ దొంగతనం చేయం’ అనే వరకు వారికి దేహశుద్ధి చేయించి, వదిలిపెట్టాడు జమీందారు.  

‘అయ్యగారూ! నన్ను క్షమించండి.. భోజనం చేశాక ఇతర పశువుల కాపరులతో కాసేపు ఆడుకున్నాను... పొరపాటైంది. అలాగే మేకలను తోలుకొచ్చాక పాతిక ఉన్నాయని అధికారికి అబద్ధం చెప్పాను. అది మరో తప్పు’ అన్నాడు భీమయ్య. ‘తప్పులను ఒప్పుకున్నావు. అయినా తెలివిగా.. ఉంగరం పోయింది.. అని నమ్మించి దొంగలను బురిడీ కొట్టించావు. వాళ్లు ఇక మన ఊరి వైపు రారు. నీ తెలివితేటలను అభినందిస్తున్నాను’ అని వంద రూపాయలు భీమయ్యకు బహుమతిగా ఇచ్చాడు జమీందారు. చిరునవ్వుతో వాటిని తీసుకుని... ‘సంతోషం అయ్యగారూ! ఇక మీదట జాగ్రత్తగా ఉంటాను’ అన్నాడు భీమయ్య.  

యు.విజయశేఖర రెడ్డి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని