ఉగాది పండుగ చేసేద్దాం..!

‘తాతయ్యా..తాతయ్యా! మామిడికాయలు ఇంకా.. పిందెలుగానే ఉన్నాయిగా, ఎందుకు అప్పుడే కోస్తున్నారు?’ దగ్గరకు వస్తూ అడిగాడు వసంత్‌. ‘ఇవాళ ఉగాది పండుగ అని మరిచిపోయావా వసంత్‌?

Published : 09 Apr 2024 00:04 IST

తాతయ్యా..తాతయ్యా! మామిడికాయలు ఇంకా.. పిందెలుగానే ఉన్నాయిగా, ఎందుకు అప్పుడే కోస్తున్నారు?’ దగ్గరకు వస్తూ అడిగాడు వసంత్‌. ‘ఇవాళ ఉగాది పండుగ అని మరిచిపోయావా వసంత్‌? అయినా ఉగాది పచ్చడికి పిందెలుగా ఉంటేనే వగరు రుచి కూడా తోడవుతుంది. ఇదిగో.. ఈ కాయలు అమ్మకు ఇవ్వు’ అన్నారు తాతయ్య. ‘మరి మిగతావి ఎవరికి తాతయ్యా!’ పక్కనే ఉన్న ఇంకొన్ని కాయల వైపు చూపిస్తూ అడిగాడా అబ్బాయి. ‘నా మిత్రుడు పరమేశం వాళ్లకు ఇచ్చి, వాళ్ల దగ్గర నుంచి వేపపువ్వు తెచ్చుకుందాం’ అని బదులిచ్చారాయన. ‘ఆ తాతగారింట్లో వేపచెట్టు ఉందన్నమాట. అయితే నేనూ మీతో వస్తాను’ అన్నాడు వసంత్‌. ‘అలాగే వెళ్దాం! చెల్లి కూడా వస్తానంటే తీసుకెళ్దాం’ అన్నారు తాతయ్య. వెంటనే లోపలికి వెళ్లి.. చెల్లి చైత్రను తీసుకొచ్చాడు వసంత్‌.

ముగ్గురూ కలిసి పరమేశం ఇంటికి బయలుదేరారు. అక్కడికి చేరుకోగానే.. ‘రా విశ్వం!’ అంటూ ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించాడు పరమేశం. వసంత్‌, చైత్రను కూడా ప్రేమగా పలకరించి.. ఆయన మనవడు, మనవరాలు ఆకాశ్‌, అవనిని వాళ్లకు పరిచయం చేశాడు. ఇంతలో లోపలి నుంచి ఆకాశ్‌ వాళ్ల అమ్మ వచ్చి.. అందరికీ నిమ్మరసం అందించింది. కాసేపటికి విశ్వం.. ‘ఇదుగోమ్మా.. మా చెట్టు మామిడికాయలు.  ఉగాది కదా పచ్చడి కోసం తెచ్చాను’ అంటూ వాటిని అందించారు. వాటిని తీసుకున్నాక.. ‘ఆకాశ్‌! వేపపువ్వు కోసి తాతయ్యకు ఇవ్వు. అలాగే మీ కొత్త స్నేహితులకు మన తోట చూపించు’ అందామె.

పిల్లలు పరిగెత్తుకుంటూ తోటలోకి వెళ్లారు. ఎంచక్కా కాసేపు ఆడుకొని.. వేపపువ్వు తీసుకొచ్చారు. ‘అసలు ఉగాదికి ఈ పచ్చడి ఎందుకు చేస్తారో?’ అన్నాడు ఆకాశ్‌. ‘అదే ఉగాది ప్రత్యేకత. ఆరు రుచుల పచ్చడిలో గొప్ప సందేశం ఉంటుంది’ అని బదులిచ్చాడు పరమేశం. ‘సందేశమా?’ అని ఆశ్చర్యంగా అన్నాడు వసంత్‌. ‘అవును పిల్లలూ! తెలుగు నూతన సంవత్సరం.. అదే ఉగాది రోజున చేసుకునే పచ్చడిలో ఆరు రుచులు ఉంటాయి. అవేంటో ఒకసారి చెప్పండి’ అడిగాడు పరమేశం. ‘మామిడి పిందెలు వగరు రుచి అన్నారు మా తాతయ్య.. వేపపువ్వు చేదు అని తెలుసు. బెల్లం తీపి.. అది బాగా తెలుసు’ అని ఉత్సాహంగా చెప్పాడు వసంత్‌. ‘ఆ.. చింతపండు పులుపు’ అన్నాడు ఆకాశ్‌. ‘ఇంకేముంటాయి.. అమ్మ అరటిపండు ముక్కలు కూడా కలుపుతుంది. అది కూడా తీపేగా’ అంది చైత్ర. ‘మా అమ్మ చెరకు ముక్కలు వేస్తుంది. తీయగా ఎంత బాగుంటాయో.. కానీ మిగిలినవి ఏంటబ్బా?’ అంటూ ఆలోచించింది
అవని. సరే నేను చెబుతాలే అంటూ.. ‘ఉప్పు, కారం’ అన్నాడు పరమేశం.

‘ఈ ఆరు రుచులూ ఆరోగ్యానికి అవసరమే. అందుకని మీరు అన్ని రుచుల ఆహారం తినాలి. కాకరకాయ చేదని, ముల్లంగి కారం అని.. ఇలా వంకలు పెడుతూ కొన్ని కూరలను తినమని మొండికేస్తుంటారు కదా.. అలా చేయకూడదు. ఆ కూరలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అన్నాడు విశ్వం. ‘అంతే కాదు పిల్లలూ! ఈ రుచులు కొన్ని గుణాలకు ప్రతీకలు కూడా. తీపి సంతోషానికి, ఉప్పు ఉత్సాహానికి ప్రతీకలు. చేదు బాధకు సంకేతం అయినా.. ఇక్కడ మాత్రం అనారోగ్య సమస్యల్ని దూరం చేసేదిగా అర్థం చేసుకోవాలి. కారం కోపానికి సంకేతం అయినా.. ఆరోగ్యానికి పరిమితంగా ఇది అవసరమే. వగరు కొత్త సవాళ్లకు ప్రతీకగా చెప్పుకోవచ్చు. కరక్కాయ వంటివి ఆరోగ్యానికి మేలు చేసేవే. మితమైన పులుపు కూడా మంచిదే. పరిస్థితులకు తగట్టుగా.. నేర్పునకు గుర్తుగా దీన్ని చెప్పుకోవచ్చు’ అని వివరించాడు పరమేశం. ‘అమ్మో! ఉగాది పచ్చడి వెనుక ఇన్ని విషయాలున్నాయా?’ ఆశ్చర్యంగా అన్నారు పిల్లలంతా.  

‘ఇంతకూ ఈ కొత్త సంవత్సరం పేరేంటో తెలుసా?’ అడిగాడు విశ్వం. ‘ఓ తెలుసు.. క్రోధినామ సంవత్సరం.. మా టీచర్‌ చెప్పారు’ అన్నాడు వసంత్‌. ‘అంటే అందరి మీద ఈ సంవత్సరం కోపం చూపిస్తుందా?’ వెంటనే అడిగాడు ఆకాశ్‌. కాదు.. చెడ్డ వారి మీద క్రోధం చూపిస్తుందని అర్థం చేసుకోవాలి’ అన్నాడు పరమేశం. అప్పుడు పిల్లలంతా అలాగేనంటూ జవాబిచ్చారు. కాసేపు అలా కబుర్లు చెప్పుకున్న తర్వాత.. వేపపువ్వు తీసుకొని విశ్వం, వసంత్‌, చైత్ర అక్కడి నుంచి వాళ్లింటికి బయలుదేరారు.

జె.శ్యామల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని