శిష్యులకు గురువు నేర్పిన పాఠం!

రంగరాజపురాన్ని ఒకప్పుడు శూరసేన మహారాజు పాలిస్తుండేవాడు. సుకేతుడు ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి పేదలకు ఉచిత వైద్యసేవలు అందించేవాడు. ఇతని హస్తవాసి బాగుండడంతో మహారాజు తమ ఆస్థాన వైద్యుడి పదవి స్వీకరించమన్నాడు.

Updated : 10 Apr 2024 01:04 IST

రంగరాజపురాన్ని ఒకప్పుడు శూరసేన మహారాజు పాలిస్తుండేవాడు. సుకేతుడు ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి పేదలకు ఉచిత వైద్యసేవలు అందించేవాడు. ఇతని హస్తవాసి బాగుండడంతో మహారాజు తమ ఆస్థాన వైద్యుడి పదవి స్వీకరించమన్నాడు. మంచి పరిపాలన అందిస్తున్న రాజును దృష్టిలో పెట్టుకున్న సుకేతుడు... ‘మీ ఆరోగ్య సంరక్షణ బాధ్యత నేను తీసుకుంటాను, కానీ పేదలకు అందించే ఉచిత వైద్యసేవలను మాత్రం విడిచిపెట్టలేను’ అని షరతుగా చెప్పాడు. దానికి శూరసేనుడు సరేనన్నాడు. అప్పటి నుంచి తన శిష్యులను రోజుకొకరిని మహారాజు దగ్గరకు పంపి, ఆయన ఆరోగ్య నివేదికను తెప్పించుకొని పరిశీలించేవాడు. అవసరమైతే సుకేతుడే వెళ్లి మహారాజుకు వైద్యసేవలు అందించేవాడు. శిష్యుల్లో పరంధాముడు అనే మూగవాడు ఉండేవాడు. అతని వైకల్యానికి జాలిపడిన సుకేతుడు.. ప్రేమగా చూసుకుంటుండేవాడు.

అది మిగిలిన శిష్యులకు అస్సలు నచ్చేది కాదు. పరంధాముణ్ని గురువు అందలమెక్కిస్తున్నాడన్న శిష్యుల గుసగుసలు సుకేతుడి చెవినపడ్డాయి. అంతే కాకుండా వారు అతన్ని ఒంటరి వాడిని చేశారు. దాంతో శిష్యులకు సరైన సమయంలో గుణపాఠం చెప్పాలనుకున్నాడు సుకేతుడు. కొద్దిరోజులు గడిచాక పరిపాలన భారం వల్ల మహారాజుకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. శిష్యులు ఇచ్చే వైద్య నివేదికల ఆధారంగా సుకేతుడు, శూరసేనుడికి వైద్య పరీక్షలు చేశాడు. ఒత్తిడి వల్ల వచ్చే అనారోగ్యానికి మందు నవ్వు అని సూచన చేశాడు సుకేతుడు.

‘నిజమే.. కళలను ఆరాధించడం, ఆస్వాదించడం వల్ల మనిషి నూతన ఉత్తేజాన్ని పొందగలడని చిన్నప్పుడు మా గురువుగారు చెప్పిన విషయం ఇప్పుడు జ్ఞాపకం వస్తోంది. ఆ రోజుల్లో చదువులో అలసటను గమనించిన ఆయన చిత్రాలను వేయించడం, ఆటలు ఆడించడం చేసేవారు. ఇంకొన్ని సందర్భాల్లో క్షేత్ర పర్యటనలకు తీసుకువెళ్లి ప్రకృతి పాఠాలను నేర్పేవారు’ అని గతాన్ని నెమరు వేసుకుంటూ చెప్పాడు శూరసేనుడు.

‘ప్రభూ! బాల్యంలో విద్య నేర్పే గురువు.. వైద్యుడి మాదిరే ప్రవర్తిస్తాడు. చదువు చెప్పే సమయంలో చదువు చెబుతూ, పిల్లలకు ఒత్తిడి లేకుండా ఇటువంటి ప్రక్రియలు చేపడతాడు. దాని వల్ల ఆరోగ్యం, విజ్ఞానం రెండూ పిల్లలకు దక్కుతాయి’ అంటూ గురువు గొప్పతనాన్ని వర్ణించాడు సుకేతుడు. అందుకే ఆస్థాన విదూషకుణ్ని ఎంపిక చేసే బాధ్యతను మీకు అప్పగిస్తున్నాను. అతని సావాసంతో నేను ఒత్తిడిని జయించాక పరిపాలన సమస్యలను అధిగమిస్తాను’ అని చెప్పాడు శూరసేనుడు. ‘చిత్తం ప్రభూ!’ అంటూ ఆ పనిలో పడ్డాడు సుకేతుడు. రాజ్యంలో ఈ విషయంపై దండోరా వేయించాడు. వచ్చిన వారిని పరీక్షించమని పరంధాముడికి అప్పగించాడు సుకేతుడు. గురువుగారు, పరంధాముడికి పెద్దపీట వేయడం మిగతా శిష్యులకు నచ్చలేదు. అక్కడితో ఆగక ఈ విషయాన్ని మహారాజుకు రహస్యంగా ఫిర్యాదు చేశారు. ‘పరంధాముణ్ని నియమించడంలో మీకు ఉన్న అభ్యంతరమేంటని ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిని ప్రశ్నించాడు మహారాజు. అతను మూగవాడు.. ఎలా ఎన్నిక చేయగలడు’ అని తమ అభ్యంతరాన్ని చెప్పారు శిష్యులు.

ముందు ఆశ్చర్యపోయిన మహారాజు.. తర్వాత కాసేపు ఆలోచించి, ఒకసారి నమ్మకంగా అప్పజెప్పిన పనికి అడ్డుతగలడం మంచిది కాదని వారికి నచ్చజెప్పి పంపించాడు. పరంధాముడి ద్వారా విదూషకుడి ఎంపిక పూర్తైంది. ఆస్థాన వైద్యుడు అతన్ని మహారాజుకు పరిచయం చేశాడు. కొద్దిరోజుల తర్వాత శూరసేనుడు ఉపశమనం పొందాడు. వైద్య పరీక్షల నిమిత్తం ఆస్థాన వైద్యుడి దగ్గరకు వెళ్లాడు శూరసేనుడు. అతను యథావిధిగా రాజుకు వైద్యపరీక్షలు నిర్వహించి.. సంతృప్తిని వ్యక్తం చేశాడు. ఆరోగ్యం విషయంలో మీ వ్యక్తిగత అనుభూతి ఎలా ఉందని ప్రశ్నించాడు.

‘తలనొప్పి వచ్చినప్పుడల్లా విదూషకుడి విన్యాసాలు చూసి ఉపశమనం పొందుతున్నాను. అప్పుడు కలిగే నూతనోత్తేజం సమస్యల పరిష్కారానికి కొత్త దారులు చూపుతోంది. మొత్తానికి పరంధాముడు మంచి ఎంపిక చేశాడు’ అంటూ కితాబిచ్చాడు శూరసేనుడు. ‘హమ్మయ్యా! విదూషకుడి ఎంపికపై నేననుసరించిన విధానం మీకు కోపం వచ్చేలా చేస్తుందేమోనని భయపడ్డాను. కారణం.. నా శిష్యుల ఫిర్యాదు నిర్వాకమే’ అన్నాడు సుకేతుడు.

‘మూగవ్యక్తిని న్యాయనిర్ణేతగా ఉంచడంలో మీ నిర్ణయం సబబే! అతడికి చెవులూ వినిపించవు. మాటలు రాని, చెవులు వినబడని వ్యక్తిని మెప్పించాలంటే హావభావాలు మాత్రమే విదూషకుడికి శరణ్యం. అతని హాస్య సంభాషణ కన్నా హావభావాలతో నవ్వించగల శక్తి ఉంటేనే రాణించగలడు’ అని శూరసేనుడు చెప్పాడు. దాంతో మిగిలిన శిష్యుల నోళ్లు మూతపడ్డాయి. అసలైన వైకల్యం తమదేనన్న రుజువు కనిపించడంతో, శిష్యులంతా లెంపలేసుకొని పరంధాముడితో సఖ్యతగా మెలగసాగారు.

బి.వి. పట్నాయక్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని