తాతయ్య చెప్పాడు.. మనవడు మారాడు!

సుమన్‌ ఆరో తరగతి చదువుతున్నాడు. పాఠశాల నుంచి ఇంటికి రాగానే అమ్మ దగ్గర ఫోన్‌ తీసుకుని దాంతో ఆడుకుంటుంటాడు.

Updated : 17 Apr 2024 06:39 IST

సుమన్‌ ఆరో తరగతి చదువుతున్నాడు. పాఠశాల నుంచి ఇంటికి రాగానే అమ్మ దగ్గర ఫోన్‌ తీసుకుని దాంతో ఆడుకుంటుంటాడు. సంక్రాంతి సెలవులకు అమ్మమ్మగారింటికి అమ్మతో కలిసి కవిటి గ్రామం వచ్చాడు. తాతయ్య, అమ్మమ్మ ఇంటికి వచ్చిన సుమన్‌ను ఆప్యాయంగా పలకరించారు. కానీ సుమన్‌ అమ్మ దగ్గర సెల్‌ఫోన్‌ తీసుకుని అందులో లీనమైపోయాడు. అందుకే వారి మాటను కూడా పట్టించుకోలేదు. అలా ముందుకు వెళ్లి సోఫాలో కూర్చుని ఆడుకుంటున్నాడు. తల్లి మీనాక్షి.. ‘సుమన్‌! అమ్మమ్మ, తాతయ్య నిన్ను పలకరిస్తున్నారు. వారికి నమస్కారం పెట్టు. తర్వాత కాళ్లు, చేతులు కడుక్కో. సెల్‌ఫోను నాకు ఇవ్వు’ అని చెప్పింది. అయినా అమ్మ మాట పట్టించుకోలేదు. తాతయ్య బ్రహ్మం, మనవడు సుమన్‌ను ఆ రోజంతా గమనించాడు. ప్రతిక్షణం ఫోన్‌తోనే కాలక్షేపం చేస్తున్నాడు.

మీనాక్షిని పిలిచి.. ‘అమ్మా! వీడికి ఫోన్‌ తప్ప మరి ఏమీ తెలియదా?’ అని అడిగాడు. ‘అవును నాన్నా! చెప్పి, చెప్పి విసిగిపోయాను. బడి నుంచి రాగానే నా సెల్‌ తీసుకుని ఆటలో మునిగిపోతాడు. పుస్తకం కూడా సరిగ్గా తీయడు. ఎంత చెప్పినా మాట వినడు’ అని బాధపడుతూ తండ్రితో చెప్పింది. తాతయ్య బ్రహ్మం తర్వాత రోజు ఉదయమే ఆరు గంటలకు సుమన్‌ను నిద్రలేపాడు. ‘ఇంత ఉదయమే నిద్ర లేపావు... ఏమిటి తాతయ్యా!?’ అని సుమన్‌ అన్నాడు. ‘నువ్వు నాతో రా.. అలా పొలం వెళ్లి వద్దాం. అక్కడ జామ చెట్టు ఉంది. కాయలు తెచ్చుకుందాం’ అని సుమన్‌ను వేగంగా బయలుదేరేలా చేశారు బ్రహ్మం. పండగ రోజులు కావడంతో ప్రతి ఇంటి ముందు చక్కని ముగ్గులతో ఆరు బయట అందంగా కనబడుతోంది. సుమన్‌ ముగ్గులు చూస్తూ తాతయ్యతో నడుస్తున్నాడు. మనవడిని గమనించిన బ్రహ్మం.. ‘ఇందులో ఏ ముగ్గు నీకు నచ్చింది చెప్పు’ అని అడిగాడు. ‘తాతయ్యా! నాకు అన్ని ముగ్గులూ బాగానే ఉన్నాయనిపిస్తోంది’ అని అన్నాడు. ‘నువ్వు ఎప్పుడైనా బొమ్మలు గీశావా?’ అని తాతయ్య అడిగాడు. ‘లేదు తాతయ్యా..’ అని జవాబు ఇచ్చాడు సుమన్‌. ‘నీకు బొమ్మలు వేయడం రాదా?’ అని తాతయ్య ప్రశ్నించాడు. ‘ఎప్పుడూ ప్రయత్నించలేదు తాతయ్యా! ఫోన్లో గేమ్‌లతోనే నాకు సమయం అయిపోతోంది. అందుకే నేను ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు’ అని అనేశాడు.

 ఇంతలో ఆ పక్కనే ఆ వీధి పిల్లలు సుమారుగా సుమన్‌ వయసు వారే గోలీలాట ఆడుకుంటున్నారు. తాతయ్య సుమన్‌ను అక్కడ ఆపి గోలీలాట చూడమన్నాడు. ఆ పిల్లలు చాలా చక్కగా ఆడుతున్నారు. చాలా దూరంగా ఉన్న గోలీలను కూడా చాకచక్యంగా గురి చూసి కొడుతున్నారు. సుమన్‌ వారి నైపుణ్యం చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు తాతయ్య.. ‘సుమన్‌! నీకు గోలీలాట వచ్చా!’ అని అడిగాడు. సుమన్‌ తల అడ్డంగా ఊపాడు. ‘ఆ పిల్లలతో ఆడతావా! వారు నీకు నేర్పిస్తారు’ అని తాతయ్య అన్నాడు. ‘సరే తాతయ్యా!’ అన్నాడు సుమన్‌. బ్రహ్మం తాతయ్య ఒక అబ్బాయిని పిలిచి... ‘మా మనవడు కూడా మీతో పాటు ఆడతాడు, గోలిలాట నేర్పండి’ అని సుమన్‌ను ఆ అబ్బాయికి అప్పగించాడు. ఆ అబ్బాయి సుమన్‌కు గోలీ ఇచ్చి ఎలా ఆడాలో నేర్పాడు. ఒక అరగంట పాటు వాళ్లతో కలిసి గోలీలాట ఆడాడు. సుమన్‌కు భలే సరదాగా ఉంది. తాను కూడా కాస్త గోలీలను గురి చూసి కొట్టడం నేర్చుకున్నాడు.

 ఇంతలో తాతయ్య.. ‘సుమన్‌! ఇక రా.. పొలానికి వెళ్దాం’ అని పిలిచాడు. ‘తాతయ్యా కాసేపు గోలీలాట ఆడుకోనివ్వు’ అని అన్నాడు. కొన్ని నిమిషాలు గడిచాక తాతయ్యతో పాటు సుమన్‌ పొలం వైపు బయల్దేరాడు. బ్రహ్మం తాతయ్య.. ‘సుమన్‌! గోలీలాట నచ్చిందా..?’ అని అడిగాడు. ‘నచ్చింది తాతయ్యా! రోజూ ఆడాలనుంది’ అని అన్నాడు. ‘గోలీలాట వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా?’ అని తాతయ్య ప్రశ్నించాడు. ‘ఏమో.. నువ్వే చెప్పాలి’ అని సుమన్‌ అన్నాడు.
‘మనం దూరంగా ఉన్న గోలీని మన చేతిలో ఉన్న గోలీతో గురి చూసి కొట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఏకాగ్రత ఉంటే లక్ష్యం సులువుగా చేరవచ్చని గోలీలాట నిరూపిస్తుంది. ఫోన్లో ఆటల వల్ల మన కంటికి జబ్బులు తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా!? కొన్ని ఫోన్‌ ఆటలకు బానిసలై పిల్లలు తమకు తెలియకుండానే తల్లిదండ్రుల సొమ్మును వృథా చేస్తున్నారు. కానీ ఈ గోలీలాట వల్ల పిల్లలందరూ ఒక చోట చేరి చక్కగా ఆడుకుంటారు.., మాట్లాడుకుంటారు. ఏకాగ్రతను అభ్యసనం చేస్తారు’ అని సుమన్‌కు అర్థమయ్యేటట్టు తాతయ్య చెప్పాడు. ‘నువ్వు చెప్పింది నిజమే.. ఇకపై నేను ఫోన్లో ఆటలకు దూరంగా ఉంటాను. ఇక్కడ ఉన్నన్ని రోజులూ.. ఎంచక్కా ఈ పిల్లలతో ఆడుకుంటాను’ అని తాతయ్యతో అన్నాడు. తాతయ్య పొలం దగ్గరకు తీసుకెళ్లి చక్కని జామకాయలు కోసి సుమన్‌కు అందించాడు. ఇద్దరూ తిరిగి మళ్లీ ఇంటి వైపు నడక సాగించారు.
సుమన్‌ స్నానపానాదులు ముగించిన తర్వాత తాతయ్య దగ్గరకు వచ్చాడు. తాతయ్య బ్రహ్మం, సుమన్‌కు కొన్ని తెల్ల కాగితాలు, రంగు పెన్సిళ్లు ఇచ్చి... ‘నీకు నచ్చిన బొమ్మలు గీసుకో’ అని అన్నాడు. ఆనందంగా తాతయ్య చేతి నుంచి తెల్ల కాగితాలు, రంగు పెన్సిళ్లు అందుకుని బొమ్మలు గీయడానికి సన్నద్ధమయ్యాడు. మధ్యాహ్న భోజనం వరకు వాటితోనే కుస్తీలు పట్టాడు. తల్లి మీనాక్షి సుమన్‌ను గమనించి ఈరోజు అసలు నన్ను ఫోనే అడగలేదని ఆశ్చర్యపోయింది. బ్రహ్మం మీనాక్షిని గమనించి.. ‘అమ్మా! నా మనవడికి మీరు మన గ్రామీణ ఆటలు నేర్పండి. ఇంటి దగ్గర ఫోన్‌కు దూరంగా ఉంచడానికి చదరంగం, వైకుంఠపాళీలాంటివి సుమన్‌తో కలిసి ఆడండి. తప్పనిసరిగా సెల్‌ఫోన్‌కు దూరమై, మంచి వికాసం పొందుతాడు’ అని అన్నాడు. ‘అలాగే నాన్నా!’ అని మీనాక్షి సుమన్‌ను చూసి మురిసిపోతూ తండ్రితో అంది. సుమన్‌ అక్కడ ఉన్నన్ని రోజులూ ఆ ఊరి పిల్లలతో కలిసి గోలీలు, బొంగరాలు ఆడుకున్నాడు. అస్సలు సెల్‌ఫోన్‌ ఊసే ఎత్తలేదు.

మొర్రి గోపి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని