అన్నింటికన్నా స్నేహం గొప్పది!

వేసవి ఎండలు మొదలైన కారణం వల్ల ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. శ్యామ్‌, కిషోర్‌ నాలుగో తరగతి చదువుతున్నారు. ఇద్దరూ ఇరుగుపొరుగు వారే కావడంతో వీరి మధ్య స్నేహం బాగా కుదిరింది.

Updated : 19 Apr 2024 04:46 IST

వేసవి ఎండలు మొదలైన కారణం వల్ల ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. శ్యామ్‌, కిషోర్‌ నాలుగో తరగతి చదువుతున్నారు. ఇద్దరూ ఇరుగుపొరుగు వారే కావడంతో వీరి మధ్య స్నేహం బాగా కుదిరింది. బడికి కలిసే వెళతారు. తిరిగి ఇంటికి కూడా కలిసే వస్తారు. సాయంత్రం కావడంతో శ్యామ్‌, కిషోర్‌ ఇద్దరూ ఇంటికి దగ్గరలో ఉన్న మైదానంలోకి వెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న మిత్రులతో కలిసి క్రికెట్‌ ఆడసాగారు. ఆటలో భాగంగా కిషోర్‌ బంతిని, శ్యామ్‌కు వేశాడు. శ్యామ్‌ బ్యాట్‌తో కొట్టిన బంతి నేరుగా వచ్చి, కిషోర్‌ పాదానికి తగిలింది. దాంతో కిషోర్‌... ‘అమ్మా, నొప్పి..’ అంటూ అక్కడే కూర్చుండి పోయాడు. వెంటనే శ్యామ్‌ బ్యాట్‌ను వదిలి కిషోర్‌ దగ్గరికి వచ్చాడు. మిగిలిన మిత్రులు కూడా ఆడటం ఆపి, కిషోర్‌ దగ్గరికి వచ్చారు.

‘కిషోర్‌, నీ పాదానికి బంతి చిన్నగానే తగిలింది. కంగారు పడకు’ అంటూ శ్యామ్‌ కిషోర్‌ను ఓదార్చసాగాడు. ‘నొప్పి గట్టిగా వస్తుంటే, దెబ్బ చిన్నగా తగిలిందని అంటావా? ఆ బాధ నువ్వు పడితే తెలుస్తుంది. ఇక నుంచి నీతో ఆడను. నీతో మాట్లాడను’ అంటూ కిషోర్‌ నెమ్మదిగా లేచి ఇంటికి వెళ్లిపోసాగాడు. ‘కిషోర్‌! ఆగు.. నన్ను మన్నించు. కావాలని నిన్ను కొట్టలేదు’ అని శ్యామ్‌ అంటున్నా, కిషోర్‌ వినిపించుకోలేదు. శ్యామ్‌ను తన ఇంటికి రావద్దంటూ, గేటు తీసి లోపలికి వెళ్లిపోయాడు. ఇక చేసేదిలేక శ్యామ్‌ బాధతో వెనుదిరిగాడు.

‘కిషోర్‌ కాలి నొప్పి తొందరగా తగ్గి పోవాలి’ అని శ్యామ్‌ మనసులో అనుకున్నాడు. నెమ్మదిగా తెల్లారింది. శ్యామ్‌ అలవాటులో భాగంగా బడికి బయలుదేరుతూ, కిషోర్‌ ఇంటి దగ్గరకు వెళ్లి.. ‘బడికి వెళదాం.. రా!’ అంటూ పిలిచాడు. ‘కిషోర్‌ స్కూల్‌ బ్యాగ్‌ భుజానికి తగిలించుకున్నాడు. తన వైపే వస్తున్న మిత్రుడి కాలికేసి చూస్తూ... ‘నొప్పి తగ్గిందా?’ అని అడిగాడు శ్యామ్‌. ‘నేను నిన్ననే చెప్పాను. నన్ను కొట్టిన వాళ్లతో మాట్లాడనని..’ అంటూ శ్యామ్‌ను పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు కిషోర్‌.

ఆగమంటూ శ్యామ్‌ అరుస్తున్నా.. కిషోర్‌ వినిపించుకోలేదు. శ్యామ్‌, బాధ పడుతూనే బడికి వెళ్లాడు. తరగతి గదిలోకి వెళ్లి ఎప్పటిలాగే కిషోర్‌ పక్కనే కూర్చున్నాడు. కానీ తను విసుగ్గా లేచి, మరో బెంచీలోకి వెళ్లి కూర్చున్నాడు. శ్యామ్‌ బాధపడటం చూసిన తోటి మిత్రులు కిషోర్‌ దగ్గరకు వెళ్లారు. ‘శ్యామ్‌ కావాలని నిన్ను కొట్టలేదని చెప్పాడు. ఆటలో భాగంగా అనుకోకుండా బంతి నీ పాదానికి తగిలిందన్నాడు. ఆలోచిస్తే తన తప్పు లేదనిపిస్తోంది’ అన్నారు. అయినా.. కిషోర్‌ వినలేదు. ‘తెలిసి ముట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుతుంది. అలాగే తెలిసి కొట్టినా, తెలియక కొట్టినా దెబ్బ తగులుతుంది.. బాధ ఉంటుంది. వాడితో మాట్లాడను. మీ మాట కూడా వినను’ అన్నాడు కిషోర్‌. ‘నాతో మాట్లాడు కిషోర్‌’ దీనంగా చూస్తూ.. గట్టిగా అరిచాడు శ్యామ్‌.

‘శ్యామ్‌! ఏమైంది? ఏమిటా కలవరింతలు?’ అంటూ అమ్మ నిద్రలేపింది. అప్పుడు గానీ అది కల అని శ్యామ్‌కు అర్థం కాలేదు. ‘అమ్మా...! కిషోర్‌ నాతో స్నేహం చేస్తాడా?’ అని సందేహంగా అడిగాడు. ‘శ్యామ్‌! నిన్న ఆటలో జరిగిన సంగతి నాకు చెప్పాక, అదే బెంగతో పడుకున్నావు. అందుకే కల గన్నావు. బడికి సమయం అవుతోంది. త్వరగా సిద్ధం కావాలి’ అని అమ్మ అనడంతో తయారయ్యాడు. ‘కిషోర్‌ను పిలిచినా పలకడు. నాతో మాట్లాడనని అన్నాడు కదా’ అనుకుంటూ, విచారంగా స్కూల్‌ బ్యాగ్‌ తగిలించుకున్నాడు. ఇంతలో.. ‘శ్యామ్‌! బడికి వెళదామా?!’ అంటూ.. కిషోర్‌ హుషారుగా వచ్చి, పలకరించాడు. దీంతో శ్యామ్‌ ఆశ్చర్యపోయాడు.

‘కిషోర్‌! నీ కాలి నొప్పి తగ్గిపోయిందా? నా మీద కోపం పోయిందా?’ అని శ్యామ్‌ అడిగాడు. ‘‘నిన్న దెబ్బ తగిలిన బాధలో నీతో అలా మాట్లాడాను. కానీ అమ్మ, నాతో.. ‘ఆటలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఐకమత్యం, సహకార భావాన్ని పెంపొందించే ఆటల్లో... అపార్థాలు ఉండకూడదు’ అని చెప్పింది. చిన్న, చిన్న దెబ్బలు సహజంగా తగిలినా, వాటిని ఆటల్లో భాగంగా గుర్తించాలని చెప్పింది. తర్వాత కాలికి మందు రాసింది. నాకు నొప్పి కూడా తగ్గిపోయింది. అలాగే ఆంటీ.. అంటే మీ అమ్మ కూడా వచ్చి, నిన్న నన్ను ఓదార్చి వెళ్లారు. నాకిప్పుడు అన్నింటి కంటే స్నేహం గొప్పదని అర్థమైంది. అవునూ.. ఈ రోజు సాయంత్రం కూడా, ఆడుకుందామా?’’ అన్నాడు కిషోర్‌. తన స్నేహితుడు అలా అడిగే సరికి, శ్యామ్‌కు ఎంతో సంతోషం కలిగింది. అమ్మకేసి ఆనందంగా చూశాడు. ‘థాంక్స్‌... అమ్మా’ అంటూ, కిషోర్‌ భుజంపై చేయి వేస్తూ, హుషారుగా బడికి వెళ్లేందుకు ముందుకు కదిలాడు.

 కె.వి.లక్ష్మణ రావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని