భలే.. భలే.. చెట్టూ మాట్లాడింది..!

నందనవనం సరస్సు పక్కనే ఒక జామచెట్టు ఉంది. దాని మీద చిలుక, కింద ఉడుత నివసిస్తున్నాయి. ఆ చెట్టుకు కాసిన పండ్లు తింటూ.. ఎంచక్కా కాలం గడిపేస్తున్నాయవి.

Updated : 30 Apr 2024 05:40 IST

నందనవనం సరస్సు పక్కనే ఒక జామచెట్టు ఉంది. దాని మీద చిలుక, కింద ఉడుత నివసిస్తున్నాయి. ఆ చెట్టుకు కాసిన పండ్లు తింటూ.. ఎంచక్కా కాలం గడిపేస్తున్నాయవి. ఒకరోజు ఉడుత ఎప్పటిలాగే.. జామపండు తినడానికి చెట్టు మీదకు ఎక్కింది. పండు తెంపుకొని తినబోతుండగా.. అక్కడే కొమ్మ మీద ఉన్న చిలుక ‘ఆగు.. ఆ పండు నేను తినాలనుకున్నాను. నువ్వు ఇంకోటి తెంపుకో’ అంది. అప్పుడు ఉడుత.. ‘నీకు రెక్కలున్నాయి. ఎంచక్కా ఎగురుకుంటూ వెళ్లి, ఆ పైనున్న పండు తిను. నన్ను ఇది తిననివ్వు’ అంది. ఆ మాటలు నచ్చని చిలుక.. ‘ఈ చెట్టు మీదకు నీ కంటే నేనే ముందుగా వచ్చాను. కాబట్టి ఈ చెట్టు నాది. ఆ మాటకొస్తే చెట్టు మీదున్న ప్రతీ పండూ నాదే. నీకు ఎలాంటి అధికారం లేదు’ అని కొంచెం కోపంగా అంది. ‘చెట్టు అందరినీ ఆదరిస్తుంది. ఆకలి తీరుస్తుంది. దానికి తర, తమ బేధాలుండవు. కాబట్టి చెట్టు నీది, నాది కాదు.. మనందరిదీ! అని సున్నితంగా చెప్పింది ఉడుత. అయినా ఆ చిలుక వినకుండా.. ‘లేదు! ఈ చెట్టు నా సొంతం’ అంటూ మొండిగా వాదించింది.

అప్పుడే ఎవరో గట్టిగా నవ్వుతున్న శబ్దం వినిపించింది. దాంతో ఉడుత, చిలుకా రెండూ ‘ఎవరా నవ్వింది..?’ అని చుట్టూరా చూడసాగాయి. కానీ ఎవరూ కనిపించలేదు. అప్పుడు చెట్టు ‘కంగారు పడకండి. నేనే నవ్వాను’ అని గట్టిగా చెప్పింది. ‘హో..! నువ్వు కూడా మాట్లాడతావా? సమయానికి పలికావు. నువ్వు చెప్పు.. ఉడుత కంటే నేనే కదా ముందుగా వచ్చింది. నేనంటేనే నీకు ఎక్కువ ఇష్టం కదా!’ అని చెట్టును చూస్తూ.. అడిగింది చిలుక. ‘పరోపకారం నా సహజ గుణం. ఆ లక్షణం ఉన్న వారినే నేను అభిమానిస్తాను’ బదులిచ్చింది చెట్టు. నాకు కూడా పరోపకార గుణం ఉంది’ అంటూ గొప్పగా చెప్పింది చిలుక. ‘మాటలు చెప్పడం కాదు. చేతల్లో నిరూపించాలి. అప్పుడు పరోపకార గుణం ఉందని ఒప్పుకుంటాను’ అంది చెట్టు.

ఆ చెట్ట కింద నుంచే చాలామంది బాటసారులు వెళ్తుంటారు. ఆ సమయంలోనే ఒక వ్యక్తి చెట్టు కిందకు వచ్చి కూర్చున్నాడు. అతను కాసేపటికి.. ‘నాకు చాలా ఆకలిగా ఉంది. అస్సలు నడవలేకపోతున్నాను. కనీసం చెట్టు ఎక్కి పండు తెంపుకునేంత ఓపిక కూడా లేదు. ఇప్పుడు నా ఆకలి తీరేదెలా?’ అని నీరసపడుతూ అన్నాడు. అప్పుడు చెట్టు అతన్ని చూపించి.. ‘చూశారా పాపం ఆ వ్యక్తి ఆకలితో ఎంత ఇబ్బంది పడుతున్నాడో. చెట్టు నిండా పండ్లు ఉన్నా.. ఓపిక లేక వాటిని తెంపుకోలేకపోతున్నాడు’ అంది. ఆ మాట విన్న ఉడుత వెంటనే.. ఒక పండు తెంపి అతని చేతిలో పడేలా కిందకు విసిరింది. ఆ బాటసారి పండును పట్టుకొని, పైకి చూస్తూ.. చెట్టుకు కృతజ్ఞతలు చెప్పి దాన్ని తినసాగాడు.

చెట్టు చిలుక వైపు చూస్తూ.. ‘ఎందుకు నువ్వు బాటసారికి జామపండు కోసివ్వలేదు?’ అని అడిగింది. ‘అతను ఆకలిగా ఉందన్నాడు. కానీ, పండు కావాలని.. నన్ను కోసివ్వమని అడగలేదు కదా! అందుకే కోసివ్వలేదు’ అని మూర్ఖంగా జవాబిచ్చింది చిలుక. ‘ఉడుతను కూడా అడగలేదుగా? మరి అది ఎందుకు కోసిచ్చింది?’ అని చెట్టు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక అటూఇటూ దిక్కులు చూసిందా చిలుక. ‘ఆపదలో ఉన్న వారి అవసరాన్ని గుర్తించి, అడక్కుండా చేసేదాన్నే సాయం అంటారు. అదే పరోపకారం అనిపించుకుంటుంది. ఇతరులకు సాయం చేసే అవకాశం మనకు ఉన్నప్పుడు కచ్చితంగా చేయాలి.. కానీ నువ్వు చేయలేదు. నాకు పరోపకారం ఉందని నువ్వు మాటల్లో చెప్పావు. కానీ ఉడుత చేతల్లో నిరూపించింది’ అంది చెట్టు. దాంతో చిలుకలో ఆలోచన మొదలైంది. గబగబా పైకి ఎగురుకుంటూ వెళ్లి.. పైనున్న దోరమగ్గిన పండును తెంపుకొచ్చి, ఉడుత చేతిలో పెట్టింది. అది ఆ పండును అందుకుని.. చిలుక వైపు నవ్వుతూ చూసింది. ‘ఇక నుంచి నా బుద్ధి మార్చుకుంటాను. నాకు చేతనైన సాయం చేయడానికి ప్రయత్నిస్తాను’ అని మెల్లగా చెప్పింది చిలుక. ‘పరోపకారమంటే ఇదే! ఇప్పుడు మీ ఇద్దరూ నాకు నచ్చారు’ అంది చెట్టు. దాంతో మూడు కలిసి ఎంచక్కా నవ్వసాగాయి.

కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు