వెనక్కి తిరిగిరానిది ఏమిటి..?

దేవగిరి రాజ్యాన్ని విరూపాక్ష మహారాజు పాలించేవాడు. ఆయన ప్రతిరోజూ ఆస్థానంలోని ఉద్యోగులతో మాట్లాడేవాడు. అందులో అనేక విషయాలపై చర్చలు కూడా జరిపేవాడు. ఎవరైనా పండిత గోష్ఠిలో అడిగే ప్రశ్నలు నచ్చితే దానికి తగిన బహుమానం కూడా ఇచ్చి వారిని గౌరవించేవాడు. ఒకరోజు పొరుగు రాజ్య పండితుడు చర్చలో పాల్గొనాలని వచ్చాడు.

Updated : 01 May 2024 04:26 IST

దేవగిరి రాజ్యాన్ని విరూపాక్ష మహారాజు పాలించేవాడు. ఆయన ప్రతిరోజూ ఆస్థానంలోని ఉద్యోగులతో మాట్లాడేవాడు. అందులో అనేక విషయాలపై చర్చలు కూడా జరిపేవాడు. ఎవరైనా పండిత గోష్ఠిలో అడిగే ప్రశ్నలు నచ్చితే దానికి తగిన బహుమానం కూడా ఇచ్చి వారిని గౌరవించేవాడు. ఒకరోజు పొరుగు రాజ్య పండితుడు చర్చలో పాల్గొనాలని వచ్చాడు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా ప్రజలందరికీ తెలిసింది. దాంతో ఆ సమావేశానికి అంతా హాజరయ్యారు. ఆ సభలో రాజుతో సహా అనేక మంది పండితులు.. వచ్చిన పండితుడిని, వారికి నచ్చిన ప్రశ్నలు అడగసాగారు. ఆయన అన్నింటికీ ఎలాంటి తడబాటు లేకుండా సమాధానం చెబుతున్నాడు.

కాసేపటికి మహారాజు.. ‘వచ్చిన పండితుడు మేము అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ఇప్పుడు మీరు కూడా మీకు నచ్చిన ప్రశ్నలు అడగవచ్చు. ఒకవేళ ఆయన జవాబు చెప్పలేకపోతే.. మీకు తగిన కానుక ఇస్తాను’ అని అక్కడికి వచ్చిన సామాన్య ప్రజలకు చెప్పాడు. దాంతో అందరూ ఏమడగాలో అర్థంకాక అయోమయంలో పడ్డారు. అప్పుడు.. అక్కడే ఉన్న మల్లన్న ‘అయ్యా! మీరు అనుమతిస్తే నేను ఒక ప్రశ్న వేస్తాను?’ అన్నాడు. దాంతో రాజు.. ‘తప్పకుండా అడుగు!’ అని చెప్పాడు. వెంటనే మల్లన్న అక్కడున్న అందరికీ నమస్కరించి.. ‘అయ్యా! ఈ ప్రపంచంలో ఎవరూ తిరిగి సంపాదించలేనిది ఏంటి?’ అని అడిగాడు. ‘అదేం ప్రశ్న?’ అన్నట్టుగా చూశారంతా. ‘నువ్వు అడిగిన ప్రశ్న తప్పు. రాజు అనుకుంటే తిరిగి సంపాదించలేనిది ఏమైనా ఉంటుందా?’ అని వెటకారంగా నవ్వారు అందరూ. దానికి.. ‘మహారాజు కూడా సాధించలేనిది ఉంది’ అని బదులిచ్చాడు మల్లన్న. ‘ప్రభువులు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. అంతెందుకు మీరందరూ వినలేదా? పరమ నిష్ఠతో ఘోర తపస్సు చేసి ఆ దేవుడిని సైతం మెప్పించి వరాలు పొందారు’ అన్నాడు ఓ వ్యక్తి. ‘నేను అడిగేది ఆ దేవుడు కూడా తిరిగి సంపాదించలేనిది’ అన్నాడు మల్లన్న. దాంతో అక్కడున్న అందరూ ఒక్కసారిగా కోపంతో రగిలిపోయారు. ‘మొదట రాజు చేయలేనిది అన్నాడు. ఆపై దేవుడు కూడా చేయలేనిది అంటున్నాడు. ఇతనికి ఎంత అహంకారం.. అసలు ఆ ప్రశ్నకు సరైన జవాబు అతనికైనా తెలుసా? నిజంగా అలాంటిది ఉందా?’ అని చెవులు కొరుక్కోసాగారు. ‘మల్లన్నా.. నిన్ను ప్రశ్న అడగమని అవకాశం ఇస్తే, అందరినీ అవమాన పరుస్తున్నావు. నీకు ఇంతకీ సమాధానం తెలుసా?’ అన్నాడు మంత్రి. ‘తెలుసండి!’ జవాబిచ్చాడు మల్లన్న. ‘అయితే దాన్ని నిరూపించగలవా?’ అడిగాడు మంత్రి. ‘తప్పకుండా.. నిరూపిస్తాను’ అన్నాడతను. మల్లన్న ఏం సమాధానం చెబుతాడా.. అని అందరూ ఆతృతగా ఎదురుచూడసాగారు.

అప్పుడతను.. ‘మహారాజా! ఎవరైనా అంటే.. ఈ సృష్టిని సృష్టించిన దైవం అయినా కూడా తిరిగి మనకు ప్రసాదించలేనిది ఒక్కటే.. అదే గడచిన కాలం. మనం ఎంతో మంది మహర్షుల తపస్సుల గురించి వినే ఉంటాము. వారికి ఆ దేవుడు ఇచ్చిన వరాలలో.. ఎవరికైనా గడచిన కాలాన్ని తిరిగి ఇవ్వగలిగారా? చెప్పండి. ఏ దైవం అయినా కాలాన్ని వెనక్కి తీసుకురాలేరు’ అన్నాడు. ఆ మాటలు విని మహారాజుతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. మల్లన్న చెప్పింది నిజమేనని ఒప్పుకోక తప్పలేదు. ‘పోయిన కాలం వెనక్కి రాదు. అందుకే దాన్ని వృథా చేయకుండా మంచి పనులకు ఉపయోగించుకోవాలి. అప్పుడే గడిచిన కాలాన్ని తలచుకొని బాధపడకుండా ఉంటాము’ అని మా పెద్దలు చిన్నప్పటి నుంచి చెబుతుండేవారని గుర్తు చేసుకున్నాడు మల్లన్న. ఆ మాటలు విన్న మహారాజు.. ‘అతను చెప్పింది సత్యం. ఎవరైనా తిరిగి సంపాదించలేనిది గడచిన కాలం మాత్రమే. అది చాలా విలువైనది. మా అందరికీ జ్ఞానోదయం కలిగించావు’ అంటూ మల్లన్నకు మంచి బహుమతి అందజేశాడు. దాంతో పండితులతో సహా.. అక్కడున్న వారంతా, వారి చప్పట్లతో మల్లన్నను అభినందించారు.

సింగంపల్లి శేషసాయి కుమార్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని