పిల్లలూ... మార్పు మంచిదే!

అది ఒకటో తరగతి గది. టీచర్‌ రాగానే.. పిల్లలందరూ లేచి నిలబడి ‘గుడ్‌ మార్నింగ్‌ మేడం’ అని ముక్త కంఠంతో అన్నారు. ‘వెరీ గుడ్‌ మార్నింగ్‌ చిల్డ్రన్‌.. ఈ రోజు మనం మన క్లాస్‌ రూమ్‌ మారబోతున్నాం

Updated : 03 May 2024 00:45 IST

అది ఒకటో తరగతి గది. టీచర్‌ రాగానే.. పిల్లలందరూ లేచి నిలబడి ‘గుడ్‌ మార్నింగ్‌ మేడం’ అని ముక్త కంఠంతో అన్నారు. ‘వెరీ గుడ్‌ మార్నింగ్‌ చిల్డ్రన్‌.. ఈ రోజు మనం మన క్లాస్‌ రూమ్‌ మారబోతున్నాం. వేరే గదిలో కూర్చోబోతున్నాం. అందరూ మీ బ్యాగులు తీసుకుని, ఒకరి తర్వాత మరొకరు వరసలో నా వెనక రండి’ అంటూ ముందుకు నడిచారు టీచర్‌. పిల్లలందరూ అలానే చేశారు. కానీ రాజుకి అది నచ్చలేదు. అయిష్టంగా ముఖం మాడ్చుకుని కూర్చున్నాడు. టీచర్‌ అది గమనించారు.  

‘రాజూ! ఎందుకలా ముభావంగా కూర్చున్నావు? ఒంట్లో బాలేదా?’ అన్నారామె. ‘కాదు టీచర్‌! నాకు ఈ క్లాస్‌ రూమ్‌ అస్సలు నచ్చలేదు’ అన్నాడు రాజు. ‘ఓ అవునా.. రాజుకు మాత్రమే నచ్చలేదా? ఇంకా ఎవరికైనా నచ్చలేదా.. చేతులెత్తండి..?’ అన్నారు టీచర్‌. ఒకరి తర్వాత ఒకరు ఇలా దాదాపు మూడు వంతుల పిల్లలు నచ్చలేదని చేతులెత్తారు.

 ‘క్లాస్‌ రూం నచ్చకపోవడానికి కారణం ఏంటో... ఎవరైనా చెప్పగలరా?’ అన్నారు టీచర్‌. ‘అదే బాగుంది మేడం’ అన్నారే కానీ.. ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోయారు. ‘పిల్లలూ! మీకెందుకు నచ్చలేదో.. నేను చెబుతాను వినండి’ అన్నారు టీచర్‌. పిల్లలంతా ఆసక్తిగా టీచర్‌నే చూస్తున్నారు.

 ‘మీరు ఒకే గదిలో కూర్చోవడానికి అలవాటుపడ్డారు. కానీ మీకు ప్రతి ఏడాది తరగతి గది మారుతుంది. టీచర్‌ మారిపోతారు.. స్నేహితులూ మారతారు. కొంతమందికి స్కూల్‌ కూడా మారిపోతుంది. అంటే మీకు ఇప్పటి నుంచే మార్పు మొదలవుతుంది. ఎక్కడ కూర్చున్నా, ఎవరు మీతో ఉన్నా, లేకపోయినా.. మీరు మార్పును అలవాటు చేసుకోవాలి. అందుకే ఇలా అప్పుడప్పుడు తరగతి గదిని మార్చుకుందాం. అర్థమైందా పిల్లలూ!’ అన్నారు టీచర్‌.
వారికి సరిగ్గా అర్థం కాలేదని, వారి ముఖకవళికల ద్వారా తెలుసుకున్న టీచర్‌.. ‘మీకు ఎంతో ఇష్టమైన అమ్మమ్మ, తాతయ్యలు మీ ఇంటికి వచ్చి వెళ్తుంటే మీరు వెళ్లొద్దని ఏడుస్తారా?’ అని అడిగారు. ‘ఆ.. నేను ఏడుస్తాను. అవును.. నేనూ ఏడుస్తాను టీచర్‌’ అన్నారు కొందరు పిల్లలు. ‘మీరు.. మీ బంధువుల ఇళ్లకు వెళ్లినప్పుడు అక్కడ స్నేహితులు పరిచయం అవుతారు. కానీ మీరు అక్కడ నుంచి వచ్చేస్తారు. అప్పుడు చాలా బాధపడతారా, లేదా?’ అన్నారు టీచర్‌.  
‘టీచర్‌! నాకు మా మావయ్య కూతురు బుజ్జి అంటే చాలా ఇష్టం. అక్కడ నుంచి వచ్చేస్తుంటే ఏడుపొస్తుంది. కానీ అమ్మ అలా ఎక్కువ రోజులు ఎక్కడా ఉండకూడదని చెప్పింది’ అంది పింకీ. ‘టీచర్‌! నాకు యూకేజీలో జోగేష్‌ అంటే ఇష్టం. ఫస్ట్‌ క్లాస్‌లో తను స్కూల్‌కు రాలేదు. దాంతో.. నేనూ బడికి వెళ్లనని రోజూ ఏడ్చాను. ఆ అబ్బాయి.. వేరే ఊరు వెళ్లిపోయాడేమో, మళ్లీ రాడు. నువ్వు అలా ఏడవకూడదని అమ్మ చెప్పింది. కొన్ని రోజులు చాలా బాధగా అనిపించింది. ఇప్పుడు అశ్విన్‌ నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌’ అని నవ్వుతూ అన్నాడు రాజు.
‘హమ్మయ్యా! మీరిప్పుడు అసలు విషయంలోకి వచ్చారు. ఇక ముందు ముందు మీరు ఈ బాధను వదిలేయాల్సి ఉంటుంది. మార్పును అంగీకరించడం నేర్చుకోవాలి’ అని నవ్వుతూ అన్నారు టీచర్‌. ‘మేడం! ఇప్పుడు నాకు అర్థమైంది’ అన్నాడు రాజు. ‘మాకూ అర్థమైంది టీచర్‌’ అన్నారు మిగిలిన పిల్లలు కూడా. ‘మార్పును స్వీకరిస్తూ నేటి ఈ పసి మొగ్గలు, రేపు వికసించిన పువ్వులుగా మారతారు’ అని అనుకున్నారు టీచర్‌.
కేవీ సుమలత


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని