సాధన గెలిచింది.. గర్వం ఓడింది..!

వింధ్య నగరాన్ని విజయసేన మహారాజు పాలించేవాడు. ఆయన మంత్రి ధర్మనిరతి. పేరుకు తగ్గట్టుగానే మహారాజుకు అన్ని విషయాల్లో మంచి సూచనలు చేసేవాడు.

Updated : 17 May 2024 00:21 IST

వింధ్య నగరాన్ని విజయసేన మహారాజు పాలించేవాడు. ఆయన మంత్రి ధర్మనిరతి. పేరుకు తగ్గట్టుగానే మహారాజుకు అన్ని విషయాల్లో మంచి సూచనలు చేసేవాడు. రాజుకు కవులన్నా, పండితులన్నా ఎంతో గౌరవం. అందుకనే ఆస్థానంలో కూడా కొందరు కవులను నియమించుకున్నాడు. సమయం దొరికినప్పుడల్లా.. వారి కవితలు విని ఆనందించేవాడు. కొన్ని రోజులకు ఆయనకు రాజ్యంలో పనులు ఎక్కువ అవ్వడంతో.. కవితలు వినడం మానేశాడు. దాంతో ఆ కవులు.. సాధన చేయడం, రచనలు చేయడం కూడా ఆపేశారు. అయినా వారికి ఇవ్వాల్సిన నెలవారీ భత్యాలు ఇచ్చేవాడు రాజు.

ఒకరోజు నగరానికి ఒక వ్యక్తి వచ్చి.. రాజుని కలిసి, ‘మహారాజా! నా పేరు శ్రీ పండిత. నేను అనేక కావ్యాలు, పురాణాలు చదివాను.. చాలా గ్రంథాలు రాశాను. ఎన్నో రాజ్యాల ఆస్థాన పండితులను, నా వాదనతో ఓడించి జయ పత్రాలు పొందాను. మీరు అనుమతిస్తే.. మీ ఆస్థాన పండితులను కూడా గెలవాలని ఉంది’ అన్నాడు. దానికి రాజు.. ‘మీరు మా అతిథి. ముందు ఈ రోజు విశ్రాంతి తీసుకోండి. పండిత గోష్టి ఎప్పుడనేది నిర్ణయించి.. తెలియజేస్తాము’ అని మంత్రితో అతనికి విడిది ఏర్పాట్లు చేయించాడు. తర్వాత రాజుతో.. ‘మహారాజా! శ్రీ పండితుడి గురించి నేను విన్నాను. మహా పండితుడు అనడంలో సందేహం లేదు. ఈ మధ్య మన పండితులు ఎలాంటి రచనలు చేయట్లేదు. అతడిని మన వాళ్లు గెలవలేరని అనిపిస్తోంది’ అన్నాడు మంత్రి. ‘మన పండితులను తక్కువ అంచనా వేయకు. నేను వారికి ఎందులోనూ లోటు చేయలేదు. కాబట్టి వారంతా ఎప్పటిలా అన్ని విషయాల్లోనూ ముందే ఉంటారు’ అని బదులిచ్చాడు రాజు. ‘నిజమే.. వారు ఎంత పండితులైనా.. కావచ్చు. కానీ పదునైన కత్తి కూడా ఉపయోగించకపోతే మొద్దుబారినట్టు.. ఎప్పటికప్పుడు కావ్యాలు, గ్రంథాలు చదవకపోతే ఫలితం ఉండదు’ అన్నాడు మంత్రి.

మహారాజు వెంటనే పండితులను పిలిపించి.. ‘మీరంతా శ్రీ పండితుడిని వాదనలో ఎదుర్కోగలరా?’ అని ప్రశ్నించాడు. దానికి వాళ్లంతా కాస్త తడుముకుంటూనే సమాధానమిచ్చారు. అప్పుడు మంత్రి.. ‘ఇక మనం చేయగలిగిందేమీ లేదు. పండితునికి జయ పత్రం ఇచ్చి పంపించాల్సిందేనా?’ అన్నాడు. ‘లేదు.. ఒక వారం సాధన చేస్తే మన పండితులు కచ్చితంగా అతని మీద విజయం సాధిస్తారు. ఒకవేళ అలా చేయలేకపోతే.. శ్రీ పండితునికి జయ పత్రం, వీరికి పదవీ విరమణ పత్రం అందజేస్తాను’ అన్నాడు మహారాజు. దానికి పండితులు తప్పకుండా గెలుస్తామని మాటిచ్చి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పుడు మంత్రి.. శ్రీ పండితుడి దగ్గరకు వెళ్లి.. ‘మా పండితుల్లో ఒకరికి అనారోగ్యంగా ఉంది. వారు కోలుకోవడానికి ఒక వారం రోజులు పడుతుంది. అప్పటి వరకూ మీరు రాజ్య పర్యటన చేసి రండి’ అని ఏర్పాట్లు చేశాడు మంత్రి. అలాగేనంటూ బయలుదేరి.. వారం రోజులు సరదాగా గడిపాడు శ్రీ పండితుడు. ఇక ఆస్థానంలోని కవులంతా.. సాధనలో మునిగిపోయారు.

వారం రోజులు పూర్తయ్యాయి. అనుకున్నట్లుగానే.. మరుసటిరోజు పోటీ ప్రారంభమైంది. మహారాజు ఆస్థాన పండితులంతా.. కొత్త కొత్త విషయాలు వివరిస్తూ శ్రీ పండితుడిని ముప్పు తిప్పలు పెట్టి, చివరకు ఓడించారు. ఎలాగైనా గెలుస్తాననే గర్వంతో.. వారం రోజుల విహారయాత్రలో మునిగి, సాధన చేయకపోవడంతో కవిత్వాల మీద పట్టు కోల్పోయాడు శ్రీ పండితుడు. ‘మీరు మహా పండితులు అని మాకు తెలుసు! మీకున్న జ్ఞానం ఎంతో గొప్పది’ అంటూ ఓడిపోయినా కూడా అతన్ని ఘనంగా సన్మానించాడు మహారాజు. ‘నా కంటే గొప్ప పండితులు ఎవరూ ఉండరన్న గర్వంతో.. సాధన చేయకుండా ఈ రోజు ఓడిపోయాను. ఎంత జ్ఞానం ఉన్నా.. సాధన ఎంత ముఖ్యమో.. మీ పండితుల వల్ల నాకు ఈరోజు తెలిసొచ్చింది. దానికి మీకు ధన్యవాదాలు’ అని తెలిపి వెళ్లిపోయాడు శ్రీ పండితుడు.

కూచిమంచి నాగేంద్ర


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని