గోపాలుడి ఇంద్రజాలం!

గోపాలుడు.. నా అన్నవాళ్లు లేని అనాథ. గ్రామానికి రెండు మైళ్ల దూరంలో ఉన్న ఒకే ఒక మంచి నీళ్ల బావి నుంచి బిందెలతో కొందరికి నీళ్లు తెచ్చి ఇచ్చేవాడు.

Published : 21 May 2024 00:07 IST

గోపాలుడు.. నా అన్నవాళ్లు లేని అనాథ. గ్రామానికి రెండు మైళ్ల దూరంలో ఉన్న ఒకే ఒక మంచి నీళ్ల బావి నుంచి బిందెలతో కొందరికి నీళ్లు తెచ్చి ఇచ్చేవాడు. అందుకుగాను వాళ్లు ఎంతో కొంత ధనం ఇచ్చేవారు. దాంతో గోపాలుడికి జీవనం సాగిపోతూ ఉండేది. అయితే ఆ పని కోసం రెక్కలు ముక్కలు చేసుకోవాల్సి వచ్చేది. 
ఒకరోజు ఆ గ్రామంలోని ఒక ధనికుని కుమార్తె వివాహం సందర్భంగా.. వినోదం కోసం ఇంద్రజాల ప్రదర్శన 
ఏర్పాటు చేశారు. ఇంద్రజాలికుడొకడు తన కుటుంబంతో సహా వచ్చి ప్రదర్శనలు ఇచ్చాడు. అవన్నీ గోపాలుడికి ఎంతో నచ్చాయి. మరీ ముఖ్యంగా చెక్కపెట్టె నుంచి వరహాలు రావడం బాగా నచ్చింది. అంత డబ్బు ఇంతకు ముందు గోపాలుడు ఎప్పుడూ చూడలేదు. 
ప్రదర్శన అంతా అయ్యాక, ఇంద్రజాలికుడు మరో గ్రామానికి బయలుదేరబోయే సమయానికి గోపాలుడు అతని దగ్గరికి వెళ్లి... ‘అయ్యా! ఇలాంటి విద్య నేనెప్పుడూ చూడలేదు. నాకూ ఇది నేర్చుకోవాలని ఉంది’ అన్నాడు. ‘తప్పకుండా నేర్పిస్తా’ అని బదులిచ్చాడు ఇంద్రజాలికుడు. గోపాలుడు తను ఉన్న ఊరు వదిలేసి ఇంద్రజాలికుడితో బయలుదేరాడు. ఆ విధంగా నాలుగైదు గ్రామాలు తిరిగేసరికి వర్షాకాలం ప్రారంభమైంది. ఎడతెగని వర్షం వల్ల ప్రదర్శనలకూ అంతరాయం కలిగింది.  
ఇంద్రజాలికుని చేతిలో ఉన్న డబ్బులు ఖర్చయిపోయాయి. గ్రామంలో ఉన్న దాతలను యాచించి, అతి కష్టం మీద పూట గడుపుకోసాగాడు. ఇదంతా చూస్తున్న గోపాలుడు ఇంద్రజాలికుడిని.. ‘అయ్యా! ఆ రోజు ప్రదర్శనలో చెక్కపెట్టె నుంచి వరహాలు వచ్చేలా చేశారు కదా! మరి ఇప్పుడెందుకు.. డబ్బుకింత ఇబ్బంది పడుతున్నారు?’ అంటూ అమాయకంగా ప్రశ్నించాడు. ఇంద్రజాలికుడు గోపాలుడి అమాయకత్వానికి ఆశ్చర్యపోయి... ‘అదంతా నిజం కాదు. హస్తలాఘవం, కనికట్టు మీద ఈ విద్య ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప మాయలు, మంత్రాల వల్ల కాదు. చూస్తే నువ్వు మీ ఊరిలో ఇంద్రజాలం చూసి.. సునాయాసంగా ధనాన్ని సృష్టించవచ్చని భ్రమపడి ఉంటావు. ఎవరైనా శ్రమతో మాత్రమే ధనాన్ని సృష్టించగలరు. ఈ సత్యం నీకు తెలియక పొరబడినట్టున్నావు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. నువ్వు తిరిగి నీ గ్రామానికి వెళ్లి, నీ వృత్తిని నువ్వు చేసుకుంటూ బతుకు’ అన్నాడు ఇంద్రజాలికుడు. ‘నేను పొరబడింది నిజమే.. కానీ గ్రామానికి తిరిగివెళ్లను. ఎందుకంటే ఎన్ని ఇబ్బందులున్నా మీరీ విద్యను వదలలేదు కదా. అలాగే నేను కూడా కష్టమైనా, నష్టమైనా మీ వద్ద ఇంద్రజాలాన్ని నేర్చుకుంటాను’ అన్నాడు స్థిరంగా. 
‘అలా అన్నావు కాబట్టి, నీకు విద్య నేర్పుతాను’ అన్నాడు ఇంద్రజాలికుడు. దానికి గోపాలుడు సంతోషించి.. ‘అయ్యా! నాదొక సందేహం.. ఇన్ని ఇబ్బందులున్నా మీరీ విద్యనే నమ్ముకొని ఉన్నారు ఎందుకు?’ అన్నాడు. దానికి ఇంద్రజాలికుడు నవ్వి... ‘కోటివిద్యలూ కూటి కొరకే.. అని పెద్దలన్నారు. అన్ని విద్యలూ కోట్లనివ్వకపోవచ్చు. కానీ కూటికి లోటు లేకుండా చేస్తాయి. ఆ నమ్మకంతోనే మనం ముందడుగు వేయాలి. ఏ విద్య నేర్చుకున్నా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండవు. కష్టాల్లో సైతం నిబ్బరంగా ఉండడమే పెద్ద విద్య. ఇది తెలిస్తే జీవితంలో తిరుగుండదు. ఇదంతా మా గురువుగారి నుంచే నేను నేర్చుకున్నాను. ఈ విద్యలో నేను నా బతుకు తెరువు వెతుక్కోవడమేగాక, సమాజానికి కూడా కొంత మేలు చేయగలుగుతున్నానన్న తృప్తి పొందుతున్నాను. మాయలు, మంత్రాలు ఉన్నాయని నమ్మి, మోసపోయేవారికి అవి లేవని ఈ ఇంద్రజాల విద్యతో చెబుతుంటాను. అదే నాకు తృప్తి. నువ్వు కూడా ఈ విద్యతో నీ బతుకు తెరువు చూసుకుంటూ.. సమాజానికీ మేలు చేయవచ్చు. మూఢనమ్మకాల బారి నుంచి ప్రజలను కాపాడవచ్చు’ అన్నాడు. ఆ తర్వాత గోపాలుడు, గురువు దగ్గర శ్రద్ధగా ఇంద్రజాలం నేర్చుకున్నాడు.

డా.గంగిశెట్టి శివకుమార్‌  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని