మానవత్వానికి విలువ.. విజయానికి తోవ!

సూర్యగిరిని ప్రభాకరుడు పాలించేవాడు. అతని మంత్రి కేశవుడు. రాజు, సహాయ మంత్రి పదవి కోసం పోటీ నిర్వహించాలనుకున్నాడు. దాని కోసం రాజ్యం మొత్తం దండోరా వేయించాడు.

Updated : 22 May 2024 00:49 IST

సూర్యగిరిని ప్రభాకరుడు పాలించేవాడు. అతని మంత్రి కేశవుడు. రాజు, సహాయ మంత్రి పదవి కోసం పోటీ నిర్వహించాలనుకున్నాడు. దాని కోసం రాజ్యం మొత్తం దండోరా వేయించాడు. పార్వతీపురంలోని గురుకుల గురువు రామశర్మ.. ఉత్తీర్ణులైన ఐదుగురు శిష్యులను ఎంపిక చేసి.. ఖర్చుల కోసం ఒక్కొక్కరికీ రెండు వరహాలు ఇచ్చి, పోటీకి పంపించాడు. వాళ్లు వెళ్తున్న దారిలో ఒక అవ్వ వణుకుతూ కనిపించింది. వెంటనే విజయుడు ఆమె దగ్గరకు వెళ్లబోయాడు. అప్పుడు మిగతా నలుగురు.. ‘విజయా! మనం ఇప్పుడు ఇక్కడ ఆగిపోతే, పోటీకి ఆలస్యమవుతుంది.. వెళ్దాం పద!’ అన్నారు. ‘మీరు వెళుతూ ఉండండి.. నేను వెనకాలే వస్తాను’ అని బదులిచ్చి.. ఆ ముసలావిడ దగ్గరకు వెళ్లి.. ‘ఏమైంది అవ్వా?’ అని అడిగాడు విజయుడు. ‘చలి జ్వరం పట్టుకుంది నాయనా! నా మనవడు ఇంటి నుంచి ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. కోటలో ఒక కొలువుకు పోటీ ఉంది. నేను వెళుతున్నానని ఇక్కడ వదిలిపెట్టాడు’ అని చెప్పిందామె. 

అప్పుడు విజయుడు వెంటనే.. అక్కడికి వచ్చిన ఒక గుర్రం బండిలో అవ్వను ఎక్కించి, ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యం చేయించి.. దానికి సంబంధించిన ఔషధాలు తీసుకొని ఆమెను జాగ్రత్తగా ఇంట్లో దింపాడు. ఆ తర్వాత మళ్లీ కోటకు బయలుదేరాడు. కోటకు కూతవేటు దూరంలో కొంత మంది పోట్లాడుకుంటున్నారు. వెంటనే వాళ్లను వారించడానికి ప్రయత్నించాడు. కానీ వాళ్లు ఎంత మాత్రం వినలేదు. అసలు ఏం జరిగిందని ప్రశ్నించగా.. ‘ఇక్కడ దొరికిన బంగారు నాణెం కోసం.. నాకే కావాలంటే.. నాకే కావాలంటూ వాదులాడుకుంటున్నారు’ అని చెప్పాడు ఓ పెద్దాయన. 

విజయుడు వాళ్ల దగ్గరకు వెళ్లి.. ‘దొరికిన నాణెం కోసం ఇంతలా వాదించుకుంటున్నారు సరే! కానీ అది పోగొట్టుకున్నవారు ఎంత బాధపడుతుంటారో ఊహించారా?’ అన్నాడు. ఆ మాటలు విని.. ‘అయితే మమ్మల్ని ఇప్పుడేం చేయమంటారు?’ అని ప్రశ్నించారు వాళ్లు. ‘ఆ నాణెం తీసుకెళ్లి రాజుకు ఇస్తే.. మీకు మంచి బహుమతి లభిస్తుంది. అలాగే అది పోగొట్టుకున్న వారికి చేరుతుంది. అప్పుడు ఎవరూ బాధపడాల్సిన పని ఉండదు కదా!’ అన్నాడు విజయుడు. దాంతో వాళ్లు ఆ నాణేన్ని రాజ భటులకు అప్పగించారు. ఆ తర్వాత విజయుడు సభలోకి ప్రవేశించాడు. అతన్ని చూసిన మంత్రి.. ‘నువ్వు ఒక గంట ఆలస్యంగా వచ్చావు’ అన్నాడు. దానికి ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు. కాసేపటికి న్యాయనిర్ణేత నిలబడి.. ‘పోటీ ముగిసింది. సహాయ మంత్రిగా విజయుడు ఎన్నికయ్యాడు’ అని ప్రకటించాడు. 

ఆ ప్రకటన విని.. గురుకుల విద్యార్థులతో సహా సభలోని వారంతా ఆశ్చర్యపోయారు. ‘అసలు ఎలాంటి పోటీ జరగకుండా విజయుడు ఎలా అర్హత సాధించాడు’ అన్నారు పోటీకి వచ్చిన వాళ్లంతా. ‘‘మేము పోటీకి చాటింపు వేసినప్పుడే.. ‘మానవత్వానికి విలువ ఇవ్వండి.. విజయం మిమ్మల్నే వరిస్తుంది’ అని తెలియజేశాము. కోటకు వచ్చే దారిలో జ్వరంతో వణుకుతున్న అవ్వను రక్షించి.. కోట ముందు నాణెం కోసం జరిగిన పోట్లాటను ఆపి, విజయుడు.. విజేతగా నిలిచాడు’’ అన్నాడు రాజు. ‘ఆ విషయాలు మీరు ముందు మాకు చెప్పలేదు.. ఇప్పుడు మరో పోటీ పెట్టండి.. గెలిచి చూపిస్తాము’ అన్నారు పోటీకి వచ్చిన వారు. అప్పుడు మహారాజు.. ‘మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా.. మానవత్వం అనేది చాలా ముఖ్యం. ఆ ముసలావిడ ప్రమాదంలో ఉందని తెలిసినా... మీరంతా వదిలేసి వచ్చారు. కానీ విజయుడు మాత్రం ఆమెను రక్షించాడు. రెండో సందర్భంలో కూడా తన మంచితనాన్ని చాటుకున్నాడు. అయినా సరే..! ఇప్పుడు నేను మీకొక సమస్య వివరిస్తాను.. దానికి పరిష్కారం చెప్పండి. ఒక వ్యాపారికి ముగ్గురు కొడుకులు. ఆయనకు ఆరోగ్యం బాలేక ఉన్న పది ఎకరాల భూమిని సమానంగా పంచుకోమని వీలునామా రాసి మరణించాడు. ముగ్గురూ సమానంగా పంచుకోవాలి. అది అమ్మడానికి వీల్లేదు’ అని చెప్పాడు. దానికి ఏ సమాధానం చెప్పాలో తెలియక.. అందరూ తెల్లమొహం వేశారు. అప్పుడు.. ‘ఒక్కొక్కరికి మూడు ఎకరాలు పంచాలి. మిగిలిన ఆ ఎకరం భూమిని మహారాజుకు ఇవ్వాలి. ఎందుకంటే.. భూమి లేని వారికి ఆ ఎకరం భూమి చేరేలా చేస్తారు’ అని చెప్పాడు విజయుడు. దాంతో.. రాజుతో సహా సభలో ఉన్నవారంతా.. హర్షధ్వానాలు చేశారు. ఆ తర్వాత సహాయ మంత్రి పదవికి విజయుడు మాత్రమే అర్హుడని రాజు ఉత్తర్వులు జారీ చేశాడు. 
యు.విజయశేఖర రెడ్డి 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని