ఐకమత్యమే.. అభివృద్ధికి పునాది..!

అనంతగిరి పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో సిరిపురం అనే గ్రామం ఉంది. ఆ ఊర్లో పరంధామయ్య మాట అంటే అందరికీ వేదవాక్కు. ఆయన గ్రామాభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు.

Published : 27 May 2024 00:07 IST

నంతగిరి పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో సిరిపురం అనే గ్రామం ఉంది. ఆ ఊర్లో పరంధామయ్య మాట అంటే అందరికీ వేదవాక్కు. ఆయన గ్రామాభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఆయన మనవడు జీవితేష్‌ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. చాలా రోజుల తర్వాత గ్రామానికి వచ్చాడు. తను కూడా వాళ్ల తాతయ్యలాగే.. సేవాగుణం కలిగిన వ్యక్తి. అందుకే తన వంతుగా ఊరికి ఏదైనా సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. దాని కోసం తన చిన్ననాటి మిత్రులను కలిసి, గ్రామంలో ఉన్న సమస్యల గురించి తెలుసుకున్నాడు. అక్కడ అత్యవసరాలు ఏమున్నాయో కనుక్కొని.. వాటిని తీర్చాలనుకున్నాడు. రెండు రోజుల్లో గ్రామానికి అత్యవసరంగా కావాల్సిన వాటి జాబితా తీసుకున్నాడు. ఈ పనిలో గ్రామస్థులను కూడా భాగస్వాములను చేయాలని నిర్ణయించుకున్న జీవితేష్‌.. ఆ విషయాన్నే సమావేశం ఏర్పాటు చేసి, ప్రజలందరికీ తెలియజేశాడు. మొదట్లో అందరూ.. ‘అసలు ఇది సాధ్యమవుతుందా?’ అనుకున్నారు. కానీ.. సాక్షాత్తూ పరంధామయ్య మనవడే అడిగినప్పుడు, దానికి అడ్డు చెబితే బాగుండదని.. దానికి వాళ్లంతా సరేనన్నారు.
అనుకున్నట్లుగానే.. మరుసటి రోజు ఉదయాన్నే పనులు ప్రారంభించారు. గ్రామంలోని కొంత మంది యువకులంతా కలిసి.. రెండు రోజుల్లో రోడ్డుకు సంబంధించిన పనులు పూర్తి చేశారు. ఇంకొందరేమో.. వర్షాలు పడినప్పుడు నీరు నిల్వ ఉండేందుకు చెరువులో గుంతలు తవ్వారు. ఆ మట్టిని చెట్లను పెంచడానికి నర్సరీల్లోకి తరలించారు. మరికొందరు.. ఒక్కో వీధికి మొక్కలు, ఇటుకలు ఇలా అన్నీ పంచి.. ‘ఎవరి వీధులను వారే శుభ్రం చేసుకొని మొక్కలు నాటుకొని, వాటి సంరక్షణకు చిన్న గోడలను నిర్మించుకోవాలి. ఇలా అందరం కలిసి పని చేస్తే.. కష్టంగా అనిపించదు. ఖర్చు కూడా ఉండదు. మన కోసం ఎవరో వస్తారు.. ఏదో చేస్తారు అని ఎదురు చూడకుండా, మన పనులు మనమే చేసుకుందాం!’ అని చెప్పారు. అలా గ్రామంలోని ప్రజలంతా కలిసి ఎంచక్కా.. రోజువారీ పనులు చేసుకుంటూనే, వీటిని పూర్తి చేశారు. ఆ గ్రామంలోని పిల్లలు చదువుకోవడానికి దగ్గర్లో గ్రంథాలయాలేమీ లేకపోవడంతో.. అది కూడా నిర్మించి కావాల్సిన పుస్తకాలన్నీ ఏర్పాటు చేశాడు జీవితేష్‌. దానికి గ్రామంలోని ప్రజలంతా అతన్ని ‘తాతయ్యను మించిన మనవడు’ అంటూ ఎంతగానో మెచ్చుకున్నారు. 
తను తిరిగి మళ్లీ అమెరికా వెళ్లిపోయేటప్పుడు సమావేశం ఏర్పాటు చేసి.. ‘మన గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. ఇన్ని రోజులు మన గ్రామంలో జరిగిన పనులన్నీ నా ఒక్కడి వల్ల సాధ్యం కాలేదు. నేను కేవలం డబ్బు మాత్రమే ఇవ్వగలిగాను. కానీ పనులు అందరం కలిసి చేస్తేనే పూర్తయ్యాయి. ఐకమత్యంతో ఉంటే.. ఎంతటి అభివృద్ధినైనా సాధించవచ్చని నిరూపించారు. నాకు సహకరించినందుకు అందరికీ మరోసారి ధన్యవాదాలు’ అని చెప్పాడు. ఇక ముందు కూడా తామంతా ఇలాగే పనులు చేసుకోవాలని నిర్ణయించుకున్నారా గ్రామ ప్రజలు. అప్పటి నుంచి ఊర్లో ఏ చిన్న సమస్య వచ్చినా.. వాళ్లకు వాళ్లే పరిష్కరించుకునే ప్రయత్నం చేసేవారు. అప్పుడు కూడా అది తీరకపోతే.. ఉన్నతాధికారులను సంప్రదించేవారు. అలా ఆ చుట్టుపక్కల గ్రామాలకు సిరిపురం ఆదర్శ గ్రామంగా మారింది. జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామంగా అవార్డు కూడా అందుకుంది. 

బెల్లంకొండ నాగేశ్వరరావు 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని