వరహాల మూటతో ఉద్యోగం..!

దేవగిరి రాజ్యంలో ధర్మపురం అనే గ్రామం ఉండేది. ఒకరోజు సాయంత్రం వేళ.. కొంతమంది రచ్చబండ దగ్గర చేరి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో అక్కడికి ఇద్దరు బాటసారులు వచ్చారు. వాళ్లు కూడా రచ్చబండ మీద కూర్చున్నారు. వారిని చూసిన సుబ్బయ్య.. ‘మీరెవరు. ఇంతకు ముందెప్పుడూ మిమ్మల్ని ఇక్కడ చూడలేదు. ఎక్కడి నుంచి వచ్చారు’ అని అడిగాడు.

Updated : 08 Jun 2024 05:13 IST

దేవగిరి రాజ్యంలో ధర్మపురం అనే గ్రామం ఉండేది. ఒకరోజు సాయంత్రం వేళ.. కొంతమంది రచ్చబండ దగ్గర చేరి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో అక్కడికి ఇద్దరు బాటసారులు వచ్చారు. వాళ్లు కూడా రచ్చబండ మీద కూర్చున్నారు. వారిని చూసిన సుబ్బయ్య.. ‘మీరెవరు. ఇంతకు ముందెప్పుడూ మిమ్మల్ని ఇక్కడ చూడలేదు. ఎక్కడి నుంచి వచ్చారు’ అని అడిగాడు. ‘అయ్యా! మేము పక్క రాజ్యం నుంచి.. మా యజమాని వర్తకం నిమిత్తం వచ్చాము. ఈ సమీపంలో జరిగిన సంతలో సరకులు అమ్మి తిరిగి వెళుతున్నాం. చీకటి పడటంతో.. ఇక్కడే ఆగిపోయాము. ఈ రాత్రికి రచ్చబండ దగ్గరే నిద్రపోయి.. ఉదయాన్నే వెళ్లిపోతాం’ అని బదులిచ్చాడు ఓ వ్యక్తి. అక్కడే ఉన్న ధర్మన్న.. ‘ఇప్పుడు మీరు మాకు అతిథులు. ఈ రోజు మా ఇంటి దగ్గర విడిది చేయండి. మా ఆతిథ్యం స్వీకరించండి. ఉదయమే మీ రాజ్యానికి బయలుదేరొచ్చు’ అన్నాడు. ‘లేదండి..! మా యజమాని ఒకవేళ చీకటి పడితే ధర్మపురం గ్రామానికి వెళ్లి, అక్కడ రచ్చబండ దగ్గర నిద్రపొమ్మని చెప్పారు. ఎవరి ఇళ్లకూ వెళ్లొద్దని కూడా చెప్పారు. ఆ గ్రామంలో దొంగల బెడద ఉండదు. వరహాల మూటతో నిశ్చింతగా అక్కడ నిద్రించవచ్చని అన్నారు’ అని చెప్పారు వాళ్లు. అలాగే వారి దగ్గర ఉన్న వరహాల మూట తెరిచి ‘ఇందులో 200 వరహాలు ఉన్నాయి’ అని అన్నారు. 

ఆ తర్వాత కాసేపటికి.. ధర్మన్న వారికి రచ్చబండ దగ్గరే భోజనం ఏర్పాట్లు చేసి.. ‘మీ దగ్గర ఉన్న వరహాల మూట నేను భద్రపరుస్తాను. మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే అందజేస్తాను.. నిశ్చింతగా నిద్రపోండి’ అని వారి దగ్గర వరహాల మూట తీసుకున్నాడు. వారు రాత్రి అక్కడే నిద్రపోయి.. వేకువజామునే వెళ్లిపోయారు. ఉదయమే ధర్మన్న వరహాలు ఇవ్వడానికి వెళ్లాడు. కానీ అక్కడ వాళ్లిద్దరూ కనిపించలేదు. సమీపంలో ఉన్న యువకులను పిలిచి వారి గురించి అడిగినా.. వారు కూడా తెలియదన్నారు. ఎంత వెతికినా వారి ఆచూకీ మాత్రం తెలియలేదు. ఇక చేసేదేం లేక, ఆ వరహాలు మూటను తన దగ్గరే ఉంచాడు. ఒక వారం రోజులు ఎదురుచూశాడు. ఇక మహారాజుకు ఆ వరహాల మూటను అందజేయాలని నిర్ణయించుకొని.. కోటకు బయలుదేరాడు. అక్కడికెళ్లి.. ‘మహారాజా! వారం రోజుల క్రితం మా గ్రామానికి ఇద్దరు పొరుగు రాజ్యపు బాటసారులు వచ్చారు. వారి దగ్గరున్న 200 వరహాల మూటను నాకిచ్చి.. వాళ్లు రచ్చబండ మీద నిద్రించారు. మరునాడు ఉదయమే.. ఆ మూటను తిరిగివ్వడానికి వెళ్లేసరికే వెళ్లిపోయారు. అందుకే ఆ వరహాల మూటను మీకు అప్పగిస్తున్నాను. మీరు పొరుగు రాజ్య రాజుకు అందజేసి, వారి ఆచూకీ కనుక్కొని అందజేయమని చెప్పగలరు’ అని తాను తెచ్చిన వరహాల మూటను అందజేశాడు ధర్మన్న. రాజు వెంటనే ఆ మూటలోని వరహాలను లెక్కించమని ఆస్థానంలో ఉన్న ఉద్యోగికి చెప్పాడు. వాటిని లెక్కించి.. అందులో 400 వరహాలున్నాయని చెప్పాడతను. ‘ఇందులో 200 వరహాలు ఉన్నాయని చెప్పావు. కానీ 400 ఉన్నాయి’ అడిగాడు మహారాజు. 

అప్పుడు ధర్మన్న.. ‘నేను ఆ మూట తెరిచి చూడలేదు. ఆ బాటసారులు 200 వరహాలు ఉన్నాయని చెప్పారు. ఆ మాటే మీకు చెప్పాను’ అని అన్నాడు. ‘నీ నిజాయితీ, నిబద్ధత గొప్పది. ఆస్థానంలో కోశాధికారి పదవి కోసం నెల రోజుల క్రితం నలుగురు వచ్చారు. అందులో నువ్వు కూడా ఉన్నావు కదా! మీ నలుగురిని పరీక్షించడం కోసం మీ గ్రామాలకు మారు వేషాల్లో నేను, మంత్రి బాటసారులుగా వచ్చాము. మా దగ్గర ఉన్న వరహాల మూటలను భద్రపరచమని, ఉదయం తీసుకుంటామని ఇచ్చాం. మిగిలిన ముగ్గురు ఆయా గ్రామాలలో తమకు లభించిన వరహాల మూటలను ఎవరికీ తెలియకుండా తామే ఉంచేసుకున్నారు. కానీ నువ్వు మాత్రం నిజాయితీగా ఆ మూట కూడా విప్పకుండా మాకు అప్పగించావు. మేము పెట్టిన పరీక్షలో నువ్వే విజయం సాధించావు. ఇక నుంచి మన ఆస్థాన ధనాగారానికి నువ్వే కోశాధికారివి’ అని మహారాజు ప్రకటించాడు. ఆ సభలో ఉన్న వారంతా వారి కరతాళ ధ్వనులతో ధర్మన్నను అభినందించారు. అప్పటి నుంచి అతను.. కోశాధికారిగా నిజాయితీగా పనిచేసి మహారాజు మన్ననలు పొందాడు. 
మొర్రి గోపి   


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని