పుర్రె విత్తనం.... పువ్వేమో డ్రాగన్‌!

పుర్రెల్ని నాటితే అందమైన పువ్వులు పుట్టుకొస్తాయి... ఆ పూలని రెండువైపులా నొక్కగానే డ్రాగన్‌లా నోరు తెరుస్తాయి... ఇదేదో కట్టు కథ కాదు... నిజంగా ఇలాంటి పువ్వొకటి ఉంది తెలుసా?

Published : 17 Jan 2016 12:06 IST

పుర్రె విత్తనం.... పువ్వేమో డ్రాగన్‌!

పుర్రెల్ని నాటితే అందమైన పువ్వులు పుట్టుకొస్తాయి... ఆ పూలని రెండువైపులా నొక్కగానే డ్రాగన్‌లా నోరు తెరుస్తాయి... ఇదేదో కట్టు కథ కాదు... నిజంగా ఇలాంటి పువ్వొకటి ఉంది తెలుసా?
   కొన్ని బొమ్మల పొట్టనొక్కగానే ఠక్కున నోరు తెరుస్తాయి. అదెంతో తమాషాగా అనిపించి పిల్లలు ఆడుకుంటారు. అలా నోరు తెరిచే ఓ పువ్వు కూడా ఉంది. ఏదో ప్రాణమున్న జీవిలా గట్టిగా నొక్కే కొద్దీ మరింతగా నోరు తెరుస్తుంది. పువ్వేంటీ? నోరు తెరవడం ఏంటీ? ‘స్నాప్‌ డ్రాగన్‌’గా పిలిచే పువ్వు సంగతులివి.

* రంగు రంగుల్లో ఉండే ఈ పూల చెట్లని ఎక్కువగా ఉద్యానవనాల్లో అలంకరణ కోసం ప్రత్యేకంగా పెంచుతుంటారు. నొక్కగానే డ్రాగన్‌ మూతిలా తెరుస్తూ వదలగానే మళ్లీ మూసుకునే ఈ పూలతో పిల్లలు ఎంచక్కా ఆడుకుంటారట.

* ఈ వింత రూపాన్ని బట్టే ‘డ్రాగన్‌ ఫ్లవర్‌’, ‘స్నాప్‌ డ్రాగన్‌’ అనే పేర్లతో పిలుస్తారు.

* ఆసియాలో ‘రాబిట్‌ లిప్స్‌’ అని, హాలెండ్‌లో ‘లయన్‌ లిప్స్‌’ అని కూడా పిలుస్తుంటారు.

* ఈ పువ్వు మరో విశేషం దీని విత్తనాలే. ఈ విత్తనాలు పెద్ద కళ్లు, తెరిచి ఉన్న నోరులా కనిపించి అచ్చంగా సూక్ష్మమైన మనిషి పుర్రెలా ఉంటాయి. కొమ్మకు వరుసగా ఉన్న వీటిని చూస్తే పుర్రెలు మొక్కకు పెరిగాయా? అన్నంత భ్రమను కలిగిస్తాయి.

* ఈ వింత లక్షణాల వల్ల ప్రాచీనులు ఈ స్నాప్‌ డ్రాగన్‌ మొక్కకి అతీత శక్తులున్నాయని నమ్మేవారట. దుష్ట శక్తుల బారి నుంచి కాపాడుతుందని ప్రత్యేకంగా పెంచుకునేవారట. అంతేకాదు ఆడవాళ్లు ఈ పుష్పాల్ని తింటే అందంగా అవుతారని, యౌవనంతో ఉంటారని భావించేవారు.

* ఎక్కువగా యూరోప్‌, అమెరికా, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో ఉండే దీని శాస్త్రీయ నామం ‘అంటిర్హినమ్‌ మజూస్‌’.

 * ఎప్పుడో క్రీస్తు శకం 1700 సంవత్సరాల నుంచే వీటిని పెంచుతున్నారు.

* ఇవి పదిహేను రకాలకు పైగా రంగుల్లో ఉంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని