‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్‌ఫేక్‌ వీడియోపై వారెన్‌ బఫెట్‌ రియాక్షన్‌

Warren Buffett: ప్రముఖ మదుపరి, బిలియనీర్‌ వారెన్ బఫెట్  ఏఐ సాంకేతికపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐని అణుబాంబుతో పోల్చారు.

Published : 08 May 2024 00:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(AI).. ఈ సాంకేతిక వినియోగంలోని వచ్చినప్పటి నుంచి దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. రంగంతో సంబంధం లేకుండా అన్నింటా ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) వినియోగం విస్తృతంగా పెరుగుతోంది. కొందరు ఈ సాంకేతికను కొనియాడుతుంటే ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌తో పాటు మరికొందరు ప్రముఖులు దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐను దుర్వినియోగం చేస్తుండటమే అందుకు కారణం.

ఏఐ సాయంతో డీప్‌ఫేక్‌ వీడియోలు సృష్టించి భయందోళనకు గురిచేస్తున్నారు. సామాన్యుల దగ్గర నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు, దేశాధినేతల వరకు అనేకమంది డీప్‌ఫేక్‌  బారిన పడుతున్నారు. తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ  బిలియనీర్‌, బెర్క్‌షైర్ హాత్‌వే సీఈవో వారెన్ బఫెట్ (Warren Buffett)కు సైతం ఈ ముప్పు తప్పలేదు. అయితే, ఈ అంశంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఏఐ దుర్వినియోగాన్ని అణుబాంబుతో పోల్చారు.

‘‘అణ్వాయుధాలు తయారు చేసే సమయంలో ఒక జీనీని సీసాలో నుంచి బయటకు పంపుతాం. అది కొన్ని భయంకరమైన పనులు చేస్తోంది. ఆ జీనీ శక్తి నన్ను భయపెడుతోంది. దాన్ని తిరిగి బాటిల్‌లో తీసుకొచ్చేందుకు నాకు ఏ మార్గం తెలియదు’’ అని నెబ్రాస్కాలో ఏర్పాటు చేసిన వార్షిక వాటాదారుల సమయావేశంలో ఆయన అన్నారు. ఏఐ సాంకేతికతపై తక్కువ అవగాహన ఉన్నప్పటికీ దాని ప్రభావం గురించి భయపడుతున్నట్లు తెలిపారు. డీప్‌ఫేక్‌ వీడియో కారణంగా తాను ఎదుర్కొన్న వ్యక్తిగత అనుభవాన్ని ఈ సందర్భంగా షేర్‌ చేసుకున్నారు. ‘‘ఇటీవల ఒక వీడియో చూసి నేను ఆశ్చర్యపోయాను. నా ఫొటో, నా వాయిస్‌తో దాన్ని రూపొందించారు. నా భార్య, కుమార్తె కూడా అందులో ఎటువంటి తేడాను గుర్తించలేకపోయారు. ఆ వీడియో చూసి ఆందోళనకు గురయ్యా’’ అని చెప్పుకొచ్చారు. ఏఐకి ఇంకా అపారమైన సామర్థ్యం ఉందన్న ఆయన.. అది ఇంకా హాని కలిగించే ప్రమాదం ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు