సముద్ర తీరమా! నీ సొగసు చూడతరమా!!

అదో సముద్ర తీరం. చుట్టూ పర్వతాలు. కనుచూపుమేర పచ్చని చెట్లు. ఇంతేనా? దీని అసలైన ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇవాళ చూసినట్టు రేపు ఉండదు. ఎప్పటికప్పుడు కొత్త వేషం వేస్తుంది. పేరు జ్లాట్ని రాట్‌. మరి దీని వింతైన వివరాలేంటో చదివేద్దామా?

Published : 06 Jul 2016 01:35 IST

సముద్ర తీరమా!
నీ సొగసు చూడతరమా!!

అదో సముద్ర తీరం. చుట్టూ పర్వతాలు. కనుచూపుమేర పచ్చని చెట్లు. ఇంతేనా? దీని అసలైన ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇవాళ చూసినట్టు రేపు ఉండదు. ఎప్పటికప్పుడు కొత్త వేషం వేస్తుంది. పేరు జ్లాట్ని రాట్‌. మరి దీని వింతైన వివరాలేంటో చదివేద్దామా?

* ఎక్కడైనా సముద్రతీరం ఒకలాగే ఉంటుంది. మహా అయితే కెరటాల తాకిడికి కాస్త అటూ ఇటూగా మారుతుంది. కానీ ఈ బీచ్‌ మాత్రం దాని రూపాన్ని పూర్తిగా మార్చేసుకుంటుంది. ఒక్కోసారి ఒక్కోలా రూపుదిద్దుకుని నిత్యనూతనంగా ఉంటుంది. వంపులు వంపులు తిరుగుతూ ఉంటుంది.

* ఈ వింత తీరాన్ని చూడాలంటే క్రొయేషియాలోని బ్రాక్‌ దీవికి వెళ్లాల్సిందే.

* అడ్రియాటిక్‌ సముద్రతీరంలో ఉండే ఈ బీచ్‌ సాగినట్టుగా ఉండే నాలుక ఆకారంలో 1740 అడుగుల పొడవుంటుంది. సన్నగా పొడుగ్గా ఉండే ఈ తీరాన్ని దాని రూపాన్నిబట్టి ‘గోల్డెన్‌ హార్న్‌ బీచ్‌’, ‘గోల్డెన్‌కోప్‌’ అని కూడా పిలుస్తుంటారు.

* ఇంతకీ ఈ తీరం ఆకారం అంతలా మారడానికి కారణం ఏంటో తెలుసా? మిగతా తీరాల్లోలా ఇక్కడ ఇసుక కాకుండా ఎక్కువగా గులక రాళ్లుంటాయి. ఇవి బంగారు, తెలుపు రంగుల్లో మెరుస్తూ ఉంటాయి. గాలి వాటం వల్ల ఇవి సులువుగా, వేగంగా కదులుతూ తీరం స్వరూపాన్ని మార్చేస్తాయన్నమాట.పై నుంచి చూస్తే ఈ బీచ్‌ ఆకారం ఎంతగా మారిందో స్పష్టంగా తెలుస్తుంది. కొన్నిసార్లు నీటి రంగులు కూడా లేత, ముదురు నీలం, ఆకుపచ్చ రంగుల్లోకి మారుతుంటాయి.

* పర్యటకులతో ఏడాది పొడవునా కిటకిటలాడుతూ ఉంటుంది. సర్ఫింగ్‌ చెయ్యడానికి ఇక్కడికి బోలెడు మంది ఆటగాళ్లు కూడా వస్తుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని