T20 WC 2024: విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్‌.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్‌: భారత మాజీ క్రికెటర్

టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్‌లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు. 

Published : 27 Apr 2024 00:05 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ కోసం (T20 World Cup 2024) భారత జట్టును ప్రకటించడానికి బీసీసీఐ సెలక్టర్లు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) నాయకత్వంలోని 15 మందితో కూడిన టీమ్‌లో ఎవరికి చోటు దక్కనుందో ఆసక్తికరంగా మారింది. టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్లు సెహ్వాగ్, ఇర్ఫాన్‌ పఠాన్, హర్భజన్‌ సింగ్ తమ డ్రీమ్‌ స్క్వాడ్‌లను ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్‌ మంజ్రేకర్ కూడా జట్టును ప్రకటించాడు. అయితే, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. అనూహ్యంగా లఖ్‌నవూ ఆల్‌రౌండర్‌కు స్థానం కల్పించాడు. 

‘‘రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనింగ్‌ చేయాలి. ఆ తర్వాత సంజూశాంసన్, సూర్యకుమార్‌ యాదవ్‌ బ్యాటింగ్‌కు వస్తారు. నా స్క్వాడ్‌లో ముగ్గురు వికెట్ కీపర్లకు అవకాశం ఇస్తా. సంజూతోపాటు రిషభ్‌ పంత్‌, కేఎల్ రాహుల్‌ ఉంటారు. ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజాకు తోడుగా కృనాల్ పాండ్యను తీసుకుంటా. పేస్ ఆల్‌రౌండర్లు శివమ్‌ దూబె, హార్దిక్‌ పాండ్యకు ప్లేస్‌ లేదు. కుల్చా జోడీని స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా ఎంచుకుంటా. బుమ్రా, సిరాజ్‌తోపాటు హర్షిత్ రాణా, మయాంక్‌ యాదవ్, అవేశ్‌ఖాన్ పేసర్లుగా ఉంటారు. కుల్‌దీప్ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు’’ అని వెల్లడించాడు. 


కెప్టెన్‌గా రోహిత్‌ సరైన ఎంపిక కాదు: భట్టాచార్య

రోహిత్ శర్మ సారథ్యంలోనే టీమ్‌ఇండియా పొట్టి కప్‌లో ఆడుతుందని చాన్నాళ్ల కిందటే బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే టీమ్‌ను కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో బీసీసీఐ నిర్ణయాన్ని కోల్‌కతా ఫ్రాంచైజీ మాజీ డైరెక్టర్ భట్టాచార్య ప్రశ్నించారు.

 ‘‘రోహిత్‌కు టీ20 వరల్డ్‌ కప్‌లో జట్టును నడిపించే బాధ్యతలను అప్పగించడం సరైంది కాదు. టీమ్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది. పొట్టి ఫార్మాట్‌కు రోహిత్ సరైన సారథి కాదు. హిట్‌మ్యాన్‌పై నాకేమీ కోపం లేదు. అతడంటే ఎంతో గౌరవం. అద్భుతమైన క్రికెటర్. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కానీ, టీ20ల్లో అతడు పెద్దగా ఫామ్‌లో లేడు. అతడితో పోలిస్తే విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, గిల్ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇప్పుడు రోహిత్ సారథి కాబట్టి అతడే ఓపెనింగ్‌ చేస్తాడు. ఫామ్‌లో ఉన్న మిగతావారు వేరే స్థానంలో ఆడాల్సి ఉంటుంది. ఈ టోర్నీకి రోహిత్‌ కంటే బుమ్రాను కెప్టెన్‌గా చేయడం ఉత్తమ ఎంపిక అవుతుంది’’ అని భట్టాచార్య వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని