రియోలో రియో! చూడ వింతయో!!

ఒలింపిక్స్‌ రియోలో జరుగుతున్నాయని తెలుసు... మరి అక్కడే మరో రియో ఉందని తెలుసా? దీన్ని చూడ్డానికి పర్యటకులు బారులు తీరుతున్నారు! ఇంతకీ ఏంటా విశేషాలు!

Published : 12 Aug 2016 01:09 IST

రియోలో రియో! చూడ వింతయో!!

ఒలింపిక్స్‌ రియోలో జరుగుతున్నాయని తెలుసు... మరి అక్కడే మరో రియో ఉందని తెలుసా? దీన్ని చూడ్డానికి పర్యటకులు బారులు తీరుతున్నారు! ఇంతకీ ఏంటా విశేషాలు!బ్రెజిల్‌లోని రియోలో సందడిగా జరుగుతున్న ఒలింపిక్‌ పోటీలు చూడ్డానికి వెళుతున్న సందర్శకులంతా అక్కడున్న మరో బుల్లి రియో నగరాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. అందులోని నిర్మాణాల్ని చూసి ముచ్చటపడుతున్నారు. ఎందుకంటే ఇవన్నీ అసలు నిర్మాణాల్ని పోలిన బుల్లి రూపాలు. రియో నగరంలోని ముఖ్య ప్రదేశాల్ని ఈ నమూనాలో లెగో బ్రిక్స్‌తో తయారుచేశారు.

* లెగోబ్రిక్స్‌ తెలుసుగా? చిన్న చిన్న ముక్కల్ని కలుపుతూ బొమ్మల్నీ, వస్తువుల్నీ, భవంతుల్నీ తయారుచేస్తుంటారు. అలాంటి లెగో ఇటుకల్ని ఉపయోగించే ఈ బుల్లి రియో నమూనాను తీర్చిదిద్దారు.* మరి దీని నిర్మాణానికి ఎన్ని లెగోబ్రిక్స్‌ పట్టాయో తెలుసా? దాదాపు పది లక్షలు. అచ్చంగా ఒలింపిక్‌ స్టేడియంలాంటి నమూనాలు, ఒలింపిక్‌ మస్కట్‌, వలయాలు, ప్రేక్షకుల బొమ్మలు, చెట్లు, కార్లు, వాహనాలతోపాటు రియో నగరంలోని ప్రముఖ కట్టడాలైన కొర్కొవడో పర్వతంపై ఉండే ఎత్తయిన ఏసుక్రీస్తు విగ్రహం, కొపకబానా బీచ్‌, రియో ఒలింపిక్‌ పార్కు ఇలా అన్నీ అచ్చుగుద్దినట్టు సూక్ష్మ రూపంలో తయారుచేసి పెట్టారు.

* ఇరవై చదరపు మీటర్ల పరిమాణంలో ఉండే ఈ బుల్లి నమూనా నగరం బరువు ఒకటిన్నర టన్నులు.

* 50 మంది లెగో బ్రిక్స్‌ కళాకారులు 2,500 గంటలు పనిచేసి ఈ సూక్ష్మ నగరాన్ని తీర్చిదిద్దారు. నిజమైన వాటిలానే ఉండేలా రంగు రంగుల బ్రిక్స్‌తో ఆకుపచ్చ రంగులో మైదానాల్ని, చెట్లను; నీలం రంగులో నీటిని, ఇంకా నిర్మాణాలకు సరిపోయేట్టు రంగుల బ్రిక్స్‌ఉపయోగించారు.

* వేలాది మంది పర్యటకుల్ని ఆకట్టుకుంటున్న ఈ రియో నగర నమూనాని ఒలింపిక్స్‌ పూర్తయ్యాక ఇక్కడి మ్యూజియంలో భద్రపరుస్తారట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని