లోతైన గుహ...వివరాలు ఆహ!

చుట్టూ పెద్ద పెద్ద రాతి కొండలు. వాటి మధ్యలో భూమిలోకి నిలువుగా ఓ లోతైన గుహ. కొండలపై కురిసిన వర్షాలతో ఆ గుహ మొత్తం నీళ్లతో నిండిపోయింది. అందుకే ఇప్పుడిది భూమిపై నీళ్లతో నిండి ఉన్న అతి లోతైన గుహగా రికార్డుకెక్కింది.

Published : 04 Oct 2016 01:20 IST

లోతైన గుహ...వివరాలు ఆహ!

అనగనగా ఓ గుహ ఉంది... దాని చివరి వరకు వెళ్లాలంటే బోలెడు ధైర్యముండాలి... ఎందుకంటే ఇది ప్రపంచంలోనే లోతైనది... ఈ మధ్యే దీని విశేషాలు తెలిశాయి...

చుట్టూ పెద్ద పెద్ద రాతి కొండలు. వాటి మధ్యలో భూమిలోకి నిలువుగా ఓ లోతైన గుహ. కొండలపై కురిసిన వర్షాలతో ఆ గుహ మొత్తం నీళ్లతో నిండిపోయింది. అందుకే ఇప్పుడిది భూమిపై నీళ్లతో నిండి ఉన్న అతి లోతైన గుహగా రికార్డుకెక్కింది.
* సున్నపు రాతి గుహ అయిన దీని పేరు హ్రనికా ప్రోపాస్ట్‌. చెక్‌రిపబ్లిక్‌ దేశంలో ఉంది. పైకి మాత్రం ఇదేదో నీటి గుంటలా ఉంటుంది.
* దీని లోపలికి దిగి కడదాకా వెళ్లి రావాలంటే వామ్మో! డైవర్లూ సాహసించలేరు. చిమ్మచీకట్లో లైటు వేసుకుని ముందుకు వెళ్లాలి. మధ్య మధ్యలో మనిషి పట్టలేని ఇరుకు దారులు. అందుకే దీని లోపలికంటే వెళ్లేందుకు చాలా రోజులు ఎవరూ సాహసించలేదు.
* తర్వాత 2014లో పోలెండ్‌కి చెందిన జామ్‌ కోవస్కి అనే ఆయన దీని అడుగుకి వెళ్లాలనుకున్నాడు. ముందు రిమోట్‌ కంట్రోల్‌తో పనిచేసే ఓ రోబోను దీనిలోకి పంపించి దారి ఎలా ఉందో అంచనా వేశాడు.

* దారి తెలిశాక మరి కొంత మంది మిత్రుల సహాయంతో నీళ్లలోకి దిగిపోయాడు. ఆక్సిజన్‌ మాస్కులు, లైట్లు, రోబోను వెంట పెట్టుకున్నాడు. డైవింగ్‌ చేసుకుంటూ గుహ లోపలికి కొంచెం కొంచెం వెళ్లడం, వెళ్లలేని దారుంటే కొన్ని పెళ్లల్ని విరిచి ముందుకు పోవడం మొదలు పెట్టాడు.
* ఇదంతా ఒక్క రోజులో ఏమీ జరగలేదు. కొన్ని రోజులకోసారి ఈయన గుహలోకెళ్లి అడ్డంకులు తొలగించుకుంటూ ముందుకెళుతుండేవాడు. 2014లో మొదలుపెడితే 2016లో ఇప్పటికి దీని చివరి వరకు వెళ్లగలిగాడు.
* ఇంతకీ ఇది ఎంత లోతుందంటే మొత్తం 1,325 అడుగులు. ఈఫిల్‌ టవర్‌ ఆకాశంలోకి పొడుగ్గా ఉంటుంది కదా. అదే తిరగబడి భూమి లోతులోకి ఉంటే ఎంత లోతుంటుందో అంత కంటే ఎక్కువే లోతుందిది!
* అందుకే ఇది ప్రపంచంలోనే అతి లోతైన గుహగా రికార్డుకెక్కింది. ఇప్పటి వరకు ఇటలీలో దీనిలాగే ఉన్న 1,286 అడుగుల లోతైన గుహ అన్నింటికంటే పెద్దదనుకున్నారు. కానీ ఇదేమో దానికంటే ఇంకా 39 అడుగుల ఎక్కువే లోతుంది!
* ఈ గుహ 1999లోనే బయటపడింది. అప్పట్లో నీళ్ల లోతుల్లోకి వెళ్లొచ్చే రోబోల్లాంటి సాంకేతిక లేదు కదా. అందుకే దీని లోపలికి వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. ఎట్టకేలకు అతి లోతైన దీని కథ మనకిప్పటికి తెలిసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని