Crakk Review: రివ్యూ: క్రాక్‌.. విద్యుత్‌ జమ్వాల్‌ స్పోర్ట్స్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ఎలా ఉందంటే?

విద్యుత్‌ జమ్వాల్‌ నటించిన స్పోర్ట్స్‌ యాక్షన్‌ మూవీ ‘క్రాక్‌’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Published : 26 Apr 2024 17:26 IST

చిత్రం: క్రాక్‌: జీతేగా తో జియేగా; నటీనటులు: విద్యుత్‌ జమ్వాల్‌, అర్జున్‌ రాంపాల్‌, నోరా ఫతేహి, అమీ జాక్సన్‌, అంకిత్‌ మోహన్‌ తదితరులు; మ్యూజిక్‌: విక్రమ్‌ మాన్‌ట్రోజ్‌ (నేపథ్య సంగీతం), మిథున్‌, తనిష్క్‌ భగ్చీ, ఎంసీ స్క్వేర్‌, విక్రమ్‌ మాన్‌ట్రోజ్‌ (పాటలు); ఎడిటింగ్‌: సందీప్‌ కురుప్‌; సినిమాటోగ్రఫీ: మార్క్‌ హమిల్టన్‌; కథ: ఆదిత్య దత్‌, రెహన్‌ ఖాన్‌, సరిమ్‌ మోమిన్‌, మోహిందర్‌ సింగ్‌; దర్శకత్వం: ఆదిత్య దత్‌; ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: డిస్నీ+ హాట్‌స్టార్‌.

విద్యుత్‌ జమ్వాల్‌ (Vidyut Jammwal), అర్జున్‌ రాంపాల్‌ (Arjun Rampal) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘క్రాక్‌’ (Crakk). జీతేగా తో జియేగా.. ఉపశీర్షిక. ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలైంది. శుక్రవారం నుంచి ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’ (Disney+ Hotstar)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి, ఈ మూవీ ఎలా ఉంది? ఏయే భాషల్లో అందుబాటులో ఉందంటే?(Crakk Review)

కథేంటంటే? మైదాన్‌.. అదో ప్రత్యేక క్రీడా ప్రపంచం. పోలాండ్‌లోని ఆ సామ్రాజ్యానికి రాజుగా వ్యవహరిస్తూ ఉంటాడు దేవ్‌ (అర్జున్‌ రాంపాల్‌). ప్రపంచవ్యాప్తంగా స్టంట్స్‌లో ఆరితేరిన యువతకు రేస్‌లు నిర్వహిస్తూ గెలిచిన వారికి రూ. కోట్ల బహుమానం అందజేస్తుంటాడు. డబ్బు విషయంలో ‘కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి’ అనే ధోరణితో ఉండే ముంబయికి చెందిన సిద్ధార్థ్‌ దీక్షిత్‌ అలియాస్‌ సిద్ధు (విద్యుత్‌ జమ్వాల్‌) ‘మైదాన్‌’లోకి అడుగుపెట్టేందుకు తగిన ప్రయత్నాలు చేస్తాడు. అంతకు ముందు అదే మైదానంలో తన అన్నయ్య ప్రాణాలు కోల్పోయాడని తెలిసినా, తల్లి, తండ్రి వద్దని చెప్పినా వినకుండా అక్కడికి చేరుకుంటాడు. తొలి టాస్క్‌ గెలిచిన తర్వాత మైదాన్‌ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అలియా (నోరా ఫతేహి)తో ప్రేమలో పడతాడు. మరోవైపు, స్పోర్ట్స్‌ పేరిట చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నాడని తెలుసుకున్న పోలీసు అధికారి నోవక్‌ (అమీ జాక్సన్‌) దేవ్‌ను అరెస్టు చేసేందుకు ప్రణాళిక రచిస్తుంది. అది సిద్ధు వల్లనే అవుతుందనే నిర్ణయానికొస్తుంది. మరి, నోవక్‌ ప్లాన్‌ని సిద్ధు అమలుచేశాడా? ఈ క్రమంలో.. తన అన్నయ్య నిహాల్‌ దీక్షిత్‌ (అంకిత్‌ మోహన్‌) మరణం గురించి తెలుసుకున్న నిజమేంటి? మైదాన్‌లో విజేతగా నిలిచాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే (Crakk Review in Telugu).

ఎలా ఉందంటే? స్పోర్ట్స్‌ యాక్షన్‌ మూవీ ఇది. వేగంగా దూసుకెళ్తున్న రైలుపై హీరో చేసే సాహసాలతో సినిమాని ఆసక్తికరంగా ప్రారంభించిన దర్శకుడు ఆ వెంటనే అతడి కుటుంబ నేపథ్యాన్ని పరిచయం చేశాడు. ఆలస్యం చేయకుండా మైదాన్‌ ప్రపంచంలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్లాడు. దేవ్‌ ఎంట్రీ కూల్‌గా ఉన్నా అతడెంత క్రూరుడో తదుపరి సీన్‌ చెబుతుంది. మైదాన్‌ రూల్స్‌, అక్కడ జరిగే రేసులు సూపర్‌హిట్‌ వెబ్‌సిరీస్‌ ‘స్క్విడ్‌ గేమ్‌’ని తలపిస్తాయి. ఆ సిరీస్‌ చూడని వారికైతేనే ఈ సినిమా కొత్త అనుభూతి పంచుతుంది. ప్రాణాలు పణంగా పెట్టి పాల్గొనే రేసులవి. ఛేజింగ్‌ సీక్వెన్స్‌ విశేషంగా ఆకట్టుకుంటాయి. విద్యుత్‌ జమ్వాల్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ కథ రాసినట్టు స్పష్టమవుతుంది. తొలి టాస్క్‌లో సిద్ధు అసమాన ప్రతిభను గుర్తించిన దేవ్‌ అతడిపై దృష్టి పెట్టడం నుంచి కథ వేగం పుంజుకుంటుంది. అదే సమయంలో పోలీసు అధికారి నోవక్‌ ఎంట్రీ, నిహాల్‌ మరణ రహస్యాన్ని సిద్ధుకి చెప్పడంతో తదుపరి ఏం జరుగుతుందోనన్న ఆసక్తి కలుగుతుంది (Crakk Review).

సిద్ధు పోలీసులకు సహరిస్తున్నాడా? దేవ్‌ వైపు ఉన్నాడా? అనే సందేహాన్ని ప్రేక్షకుడిలో కొనసాగిస్తూ ద్వితీయార్ధం ప్రారంభమవుతుంది. ప్రతీకారం ఇతివృత్తంగా సాగుతుంది. తన అన్నను చంపిందెవరో సిద్ధు తెలుసుకునే ప్రయత్నంలో మరో పాత్ర మార్క్ తెరపైకి వస్తుంది. మైదాన్‌ సృష్టికర్త అతడేనని తెలుసుకుంటాడు. కీలకమైన ఆ క్యారెక్టర్‌ను సింపుల్‌గా తేల్చేశారు. దేవ్‌కు, మార్క్‌కు ఉన్న బంధాన్నీ సరిగా ఎలివేట్‌ చేయలేదు. మిగిలిన రెండు టాస్క్‌లు విజువల్‌గా బాగున్నా ఎక్కడా ఉత్కంఠ కలగదు. దేవ్‌ ఎలిమినేట్‌ చేసినా సిద్ధు రెండో టాస్క్‌లో పాల్గొనడం, సోషల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ అలియా అతడి పార్టనర్‌గా స్టంట్స్‌ చేయడం.. లాజిక్‌కు అందని విషయాలే. అక్కడా విజేతగా నిలిచిన హీరో మూడో టాస్క్‌లో దేవ్‌తో చేసే పోరాటం అలరిస్తుంది. ప్రేక్షకుడు ఊహించనివిధంగా క్లైమాక్స్‌ను ట్విస్ట్‌తో తీర్చిదిద్దారు. సీక్వెల్‌ ఉంటుందనే హింట్‌ ఇచ్చారు (Crakk Review). స్క్రీన్‌ప్లేతో ఆడుకోగలిగితే రొటీన్‌ స్టోరీనైనా అద్భుతంగా చూపించొచ్చనేది సినీ విశ్లేషకుల మాట. ఇందులో ఆ మ్యాజిక్‌ జరగలేదు. హీరో వేసే అడుగులన్నీ ప్రేక్షకుడు ఊహించినట్టే ఉంటాయి. అన్నదమ్ముల మధ్య భావోద్వేగాలూ పండలేదు. సిద్ధు కుటుంబ నేపథ్యాన్ని, బ్రదర్స్‌ బాండింగ్‌కి అధిక ప్రాధాన్యం ఇస్తే బాగుండేది. కేవలం హిందీలోనే (ఇంగ్లిష్‌ సబ్‌టైటిల్స్‌తో) ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఎవరెలా చేశారంటే? ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అయిన విద్యుత్‌ జమ్వాల్‌కు సిద్ధు లాంటి పాత్రలు చేయడం కొత్తేమీ కాదు. ఆయన చేసే స్టంట్స్‌కు ప్రత్యేక అభిమానగణం ఉంది. ఇందులోనూ తన మార్క్‌ చూపించారు. నెగెటివ్‌ ఛాయలున్న పాత్ర దేవ్‌గా అర్జున్‌ రాంపాల్‌ ఓకే. నోరా ఫతేహి, అమీ జాక్సన్‌, అంకిత్‌ మోహన్‌ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా..? సినిమాటోగ్రఫీ బాగుంది. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. పాటలు ఏమాత్రం ప్రభావం చూపవు. ఎడిటింగ్‌ లోపం కనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి (Crakk Review).

  • బలాలు:
  • + విద్యుత్‌ జమ్వాల్‌ విన్యాసాలు
  • + పోరాట ఘట్టాలు
  • బలహీనతలు:
  • - కథ, కథనం
  • - భావోద్వేగాలు కొరవడడం
  • చివరిగా: ఈ ‘క్రాక్‌’.. యాక్షన్‌ ప్రియులకే (Crakk Review)!
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని