Salman Khan: సల్మాన్‌ఖాన్‌ ఇల్లు మారుతున్నారా?

సల్మాన్‌ఖాన్‌ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్‌ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు.

Published : 26 Apr 2024 17:05 IST

ముంబయి: సల్మాన్‌ఖాన్‌ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కొన్ని రోజుల క్రితం కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్‌ ఇల్లు మారనున్నారంటూ ప్రచారం సాగుతోంది. ఎన్నో ఏళ్ల నుంచి నివసిస్తోన్న గెలాక్సీని వీడి ఆయన బయటకు రానున్నారని పలు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయా వార్తలపై తాజాగా సల్మాన్‌ సోదరుడు అర్భజ్‌ఖాన్‌ స్పందించారు.

‘‘ఇల్లు మారినంత మాత్రాన బెదిరింపులు ఆగిపోతాయని మీరు అనుకుంటున్నారా. ఒకవేళ అదే జరిగితే వేరే ప్రాంతానికి మారడంలో తప్పులేదు కానీ, వాస్తవానికి అలా జరగడం లేదు. ఎన్నోఏళ్ల నుంచి మా నాన్న ఆ ఇంట్లోనే నివసిస్తున్నారు. సల్మాన్‌ కూడా ఎంతోకాలంగా అక్కడే ఉంటున్నారు. అది వారి ఇల్లు. దానిని ఖాళీ చేసి వెళ్లమని చెప్పలేం. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఒక్కటే చేయగలరు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన సెక్యురిటీతో ఉన్నంతలో జాగ్రత్తగా ఉండటమే కాకుండా సాధారణంగా జీవించగలగాలి. ఆ బెదిరింపుల భయంతో జీవిస్తే ఏం వస్తుంది? ఇంటిని నుంచి కూడా బయటకు రాలేం’’ అని ఆయన బదులిచ్చారు.

ఏప్రిల్‌ 14 తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో బాంద్రా ప్రాంతంలో సల్మాన్‌ ఉండే గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌ వద్దకు మోటారు సైకిల్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అరెస్టు చేసిన పోలీసులు, కేవలం సంచలనం సృష్టించేందుకే సల్మాన్‌ ఇంటివద్ద కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటన వెనక గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌, అతడి సోదరుడు అన్మోల్‌ బిష్ణోయ్‌ల హస్తం ఉన్నట్లు ముంబయి పోలీసులు ప్రకటించారు. ప్రస్తుతం లారెన్స్‌ బిష్ణోయ్‌ గుజరాత్‌లోని సబర్మతీ సెంట్రల్‌జైల్లో ఉండగా.. అతడి సోదరుడు మాత్రం అమెరికా లేదా కెనడాలో ఉన్నట్లు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని