IPL 2024: ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్‌ అక్రమ్

వెస్టిండీస్‌ క్రికెటర్లకు ఐపీఎల్‌ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

Updated : 26 Apr 2024 19:33 IST

ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఇద్దరు ఆటగాళ్లు సునీల్ నరైన్ (Sunil Narine), ఆండ్రి రస్సెల్‌ (Andrue Russell). వెస్టిండీస్‌కు చెందిన వీరిద్దరూ ఐపీఎల్ కోసం భారత్‌కు వచ్చిన మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డారు. అక్కడికి, ఇక్కడికి టైమింగ్‌లో దాదాపు 9.30 గంటల వ్యత్యాసం ఉంటుంది. దీంతో రాత్రంతా నిద్ర లేకుండా గడిపేవారని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్‌ (Wasim Akram) తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తొలినాళ్లలో అక్రమ్‌ కోల్‌కతా జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే.

‘‘ఐపీఎల్‌లో నేను కేకేఆర్‌ ఫ్రాంచైజీతో కలిసి పనిచేశా. ఉదయాన్నే సిద్ధమై త్వరగా బ్రేక్‌ఫాస్ట్‌ కోసం వచ్చేవాడిని. సునీల్ నరైన్ మాత్రం వాచిన కళ్లతో వచ్చేవాడు. ఒక రోజు ‘ఏమైంది.. ఎందుకలా ఉన్నావు?’ అని అడిగా. నేను వెస్టిండీస్‌ యాసలో మాట్లాడేందుకు ప్రయత్నించా. కానీ, అది వర్కౌట్‌ కాలేదు. ఎందుకు అంత అలిసిపోయినట్లుగా ఉన్నావు? అని మళ్లీ అడిగా. దానికి సమాధానంగా రాత్రంతా నిద్రలేదని చెప్పాడు. అంతా బాగానే ఉంది కదా.. ఎందుకు పడుకోలేకపోయావు? అనే ప్రశ్నకు వివరంగా బదులిచ్చాడు. ‘నేను వెస్టిండీస్‌ టైమింగ్‌లోనే ఉన్నా. అక్కడికి, ఇక్కడికి వ్యత్యాసం ఎక్కువ. రాత్రంతా మేల్కొని ఉంటున్నా. పగలు నిద్ర పోతున్నా. రస్సెల్‌ పరిస్థితి కూడా నాలాగే ఉంది’ అని అన్నాడు.  అప్పుడర్థమైంది.. పాపం వీరిద్దరూ ఐపీఎల్‌ సీజన్‌ మొత్తం రాత్రంతా మేల్కొని ఉండి.. పగలు నిద్రపోయేవారని’’ అని అక్రమ్‌ గుర్తు చేసుకున్నాడు. 

గత రెండు ఎడిషన్లలో పెద్దగా ఆకట్టుకోని విండీస్‌ ఆటగాళ్లు నరైన్, రస్సెల్ ఈసారి చెలరేగిపోతున్నారు. ఓపెనర్‌గా వస్తున్న నరైన్ తొలి సెంచరీ బాదాడు. ఏడు మ్యాచుల్లో మొత్తం 286 పరుగులు చేసిన అతడు.. బౌలింగ్‌లోనూ 9 వికెట్లు పడగొట్టాడు. ఇక రస్సెల్ ఏడు మ్యాచుల్లో 155 పరుగులు, 9 వికెట్లు తీశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని