వంపుసొంపుల వింత వంతెన!

రోడ్డు దాటాలంటేనో, అవసరం వచ్చినప్పుడో పాదచారుల వంతెనలపై నడుస్తుంటాం. కానీ ఈమధ్య ప్రారంభమైన లక్కీ నాట్‌ వారధి దగ్గరకు మాత్రం ప్రత్యేకంగా దాన్ని చూడ్డానికే, సరదాగా దానిపై పచార్లు కొట్టాడానికే వస్తున్నారు. ఎందుకో తెలుసా? ఇదో విభిన్నమైన నిర్మాణం కాబట్టి.

Published : 07 Nov 2016 01:03 IST

వంపుసొంపుల వింత వంతెన!

దూరం నుంచి చూస్తే వంపులు తిరిగి పేద్ద రోలర్‌ కోస్టర్‌లా కనిపిస్తుంది... దగ్గరకు వెళితే తెలుస్తుంది అదో వింత వంతెనని... ఎందుకో ఏమిటో? విశేషాలు చదివేస్తే పోలా!

రోడ్డు దాటాలంటేనో, అవసరం వచ్చినప్పుడో పాదచారుల వంతెనలపై నడుస్తుంటాం. కానీ ఈమధ్య ప్రారంభమైన లక్కీ నాట్‌ వారధి దగ్గరకు మాత్రం ప్రత్యేకంగా దాన్ని చూడ్డానికే, సరదాగా దానిపై పచార్లు కొట్టాడానికే వస్తున్నారు. ఎందుకో తెలుసా? ఇదో విభిన్నమైన నిర్మాణం కాబట్టి.

* చూడాలంటే చైనాలోని చాంగ్షా నగరానికి వెళ్లాల్సిందే.

* ఇంతకీ దీని విశేషం ఏంటో చెప్పలేదు కదూ. మామూలు వంతెనల్లా కాకుండా ఇది మెలికలు పడ్డ రిబ్బన్‌లా మెట్లతో భలేగా ఉంటుంది. అందుకే నడిచే రోలర్‌ కోస్టర్‌లా అనిపిస్తుంది. మూడు రకాల దారులతో పైకీ కిందకీ ఉన్న ఆ మలుపుల్లో నడుస్తూ, ఫొటోలు దిగుతూ సందర్శకులు సంబరపడిపోతుంటారు.

* అంతేకాదు ఈ బ్రిడ్జి ఇక్కడి రహదారిని, ఓ ఉద్యానవనాన్ని, డ్రాగన్‌ కింగ్‌ హార్బర్‌ అనే నదిని కలుపుతూ ఈ మూడింటికి ముడులు వేసినట్టు, ఎత్తు పల్లాలుగా ఉంటుంది. ఒకదాంట్లోంచి మరోదాంట్లోకి వెళ్లేలా గమ్మత్తుగా ఉంటుంది.

* 600 అడుగుల పొడవు, 78 అడుగుల ఎత్తుతో ఉండే ఈ పాదచారుల వంతెనపై నుంచి నగర అందాల్నీ, ఇక్కడి మీక్సి నదినీ, చుట్టూ ప్రదేశాల్నీ వీక్షించొచ్చు.

* అంతం లేకుండా మెలికలు తిరిగే ‘మొబియస్‌ స్ట్రిప్‌’ను ఆదర్శంగా తీసుకుని, చైనా సంస్కృతిలో అదృష్ట గుర్తును పోలినట్టు ఈ వంతెనను నిర్మించారు. కాబట్టే దీనికి లక్కీ నాట్‌ అని పేరు పెట్టారు. సంపదకు, సంతోషానికి చిహ్నంగా భావించే ఎరుపు రంగును వేశారు.

* నెదర్లాండ్స్‌కు చెందిన వాస్తుశిల్పులు దీన్ని రూపొందించారు.

* రంగు రంగుల విద్యుద్దీపాలతో ముస్తాబైన ఈ వంతెన ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే బోలెడు మంది పర్యటకుల్ని ఆకట్టుకుంటోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని