ఈ బావి సముద్రాన్ని మింగేస్తోంది..!

అమెరికాలోని యచట్స్‌ నగరం పసిఫిక్‌ సముద్ర తీర ప్రాంతంలో ఉంటుంది. అక్కడ సముద్రపు ఒడ్డున ఓ చిన్న బావి ఉంటుంది. అది సహజ సిద్ధంగా ఏర్పడింది. థోర్‌ బావిగా పిల్చుకునే ఆ బావికి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా? పసిఫిక్‌ సముద్రాన్ని పీల్చేసే గొట్టం... మనుషులను ముంచేసే గొయ్యి... నరకానికి ద్వారం... ఇలాంటి రకరకాల పేర్లు ఉన్నాయి. ఎందుకంటే ఆ బావిని ప్రమాదకరమైనదిగా అక్కడివారు భావిస్తారు.

Published : 02 May 2017 00:56 IST

ఈ బావి సముద్రాన్ని మింగేస్తోంది..!

అదో సముద్రం. ఆ ఒడ్డునే ఓ బావి. దాని దగ్గరకు వెళ్లాలంటేనే జనాలకు భయం. దానికి సాధ్యమైనంత దూరంగా ఉంటారు. ఎందుకంటే అది సముద్రాన్ని మింగేస్తోందట. విచిత్రంగా ఉంది కదూ. దాని సంగతేంటో తెలుసుకుందామా.

మెరికాలోని యచట్స్‌ నగరం పసిఫిక్‌ సముద్ర తీర ప్రాంతంలో ఉంటుంది. అక్కడ సముద్రపు ఒడ్డున ఓ చిన్న బావి ఉంటుంది. అది సహజ సిద్ధంగా ఏర్పడింది. థోర్‌ బావిగా పిల్చుకునే ఆ బావికి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా? పసిఫిక్‌ సముద్రాన్ని పీల్చేసే గొట్టం... మనుషులను ముంచేసే గొయ్యి... నరకానికి ద్వారం... ఇలాంటి రకరకాల పేర్లు ఉన్నాయి. ఎందుకంటే ఆ బావిని ప్రమాదకరమైనదిగా అక్కడివారు భావిస్తారు.
* ఈ బావి సుమారు ఇరవై అడుగుల లోతుంటుంది. సముద్రంలో పోటు వచ్చి బావి సమీ పానికి అలలు కొట్టుకొచ్చినప్పుడు అడుగు భాగం నుంచి సముద్రపు నీటిని పీల్చుకుంటుంది. బావి నిండాక ఒక్క ఉదుటున నీటిని బయటకు ఫౌంటెన్‌లా చిమ్మేస్తుంది. మళ్లీ ఆటు సమయంలో ఆ నీటిని పై భాగం నుంచి పీల్చేస్తుంది. అందుకే దీన్ని సముద్రాన్ని మింగేసే బావి అంటున్నారు.
* ఆ బావి అడుగు భాగం నుంచి నీళ్లను పీల్చుకోవడం ఎలా సాధ్యమని పరిశీలిస్తే ఆసక్తికర విషయం తెలిసింది. ఆ బావికి అడుగు భాగమే లేదట. సముద్రపు అలల ఉద్ధృతికి మొదట నేలపై ఓ చోట గొయ్యిలాగా తయారయ్యింది. క్రమంగా అది లోతు పెరుగుతూ పోయింది. అడుగుభాగంలోంచి మట్టికొట్టుకుపోతూ ఓ గొట్టంలా డొల్లగా మారిపోయింది. దీంతో అలలు వచ్చినప్పుడు అడుగున ఉన్న రంధ్రం ద్వారా నీరు లోపలకి వస్తోంది. అలాగే పై నుంచి పీల్చుకున్న నీరు ఈ రంధ్రం ద్వారానే మళ్లీ సముద్రంలోకి వెళ్తొంది.
* పై నుంచి నీటిని పీల్చుకునేటప్పుడు దగ్గర్లో ఉన్నవారిని కూడా ఆ బావి లోపలికి లాగేసే ప్రమాదం ఉందని జనాలు భయపడుతుంటారు. అందుకే దాని దగ్గరికి ఎవరూ పోరు. ఆ బావిలో పడితే ఇక మరణమే అని, అది నరకానికి ద్వారం లాంటిదని చెప్పుకుంటారు.
* నీటిని బయటకి విరజిమ్మే సమయంలో ఓ పేద్ద ఫౌంటెన్‌లా చూడటానికి గమ్మత్తుగా ఉంటుందట. దాన్ని ఫొటోలు తీసుకోవడానికే చాలా మంది వస్తుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని