భూమి మీద ఇంద్రధనుస్సు!

ఏడురంగుల ఇంద్రధనుస్సును మనం ఆకాశంలో చూస్తుంటాం కదా. అచ్చం అలాగే భూమిలోంచి ఓ ఇంద్రధనుస్సు పైకి తన్నుకొస్తే ఎలా ఉంటుంది? ఇదిగో అచ్చం మీరు చూస్తున్న పర్వతాల్లానే ఉంటుంది. * భలేగా వీటి పేరే ఇంద్రధనుస్సు పర్వతాలు(రెయిన్‌బో మౌంటెయిన్స్‌). పసుపు, తెలుపు, ఎరుపు, నీలం, పచ్చ ఇలా బోలెడు రంగుల్ని తెరలు తెరలుగా తమలో నింపుకున్నాయివి. ఒక్కసారిగా చూస్తే మంచి చిత్రకారుడెవరో గీసిన పెయింటింగ్‌లా అనిపిస్తున్నాయి కదూ!

Published : 18 Sep 2017 02:04 IST

భూమి మీద ఇంద్రధనుస్సు! 

డురంగుల ఇంద్రధనుస్సును మనం ఆకాశంలో చూస్తుంటాం కదా. అచ్చం అలాగే భూమిలోంచి ఓ ఇంద్రధనుస్సు పైకి తన్నుకొస్తే ఎలా ఉంటుంది? ఇదిగో అచ్చం మీరు చూస్తున్న పర్వతాల్లానే ఉంటుంది.
* భలేగా వీటి పేరే ఇంద్రధనుస్సు పర్వతాలు(రెయిన్‌బో మౌంటెయిన్స్‌). పసుపు, తెలుపు, ఎరుపు, నీలం, పచ్చ ఇలా బోలెడు రంగుల్ని తెరలు తెరలుగా తమలో నింపుకున్నాయివి. ఒక్కసారిగా చూస్తే మంచి చిత్రకారుడెవరో గీసిన పెయింటింగ్‌లా అనిపిస్తున్నాయి కదూ!
* ఇంతకీ ఇవి ఎక్కడున్నాయంటే చైనాలోని గాన్సులో. అక్కడున్న జాంగెయ్‌ డాంక్సీ ల్యాండ్‌ ఫామ్‌ జియోలాజికల్‌ పార్క్‌లో.
* చూసినంతమేర ఇలా రంగు రంగుల్లో పరుచుకున్న పర్వతాలుంటాయి. వాటి మధ్యలోంచి ఓ చిన్న రహదారీ ఉంది. దాని మీద ప్రయాణిస్తుంటే.. అబ్బ! ఏదో గమ్మత్తయిన రంగుల లోకంలో వెళుతున్నట్లు అనుభూతి కలుగుతుంది.
* మొత్తం 322 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయివి.

* ఎప్పటికీ ఇలానే రక్షించుకోవాలన్న ఉద్దేశంలో 2009లో యునెస్కో వీటిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.
* అప్పటి నుంచి దీన్ని చైనా ప్రముఖ పర్యటక ప్రాంతంగా మార్చేసింది. జనాల్ని ఆకర్షించేందుకు ఈ పర్వతాల మధ్యలోంచి రోడ్లు అవీ వేసి బోలెడు సౌకర్యాలూ కల్పించింది. ఏంటి మరి మీరూ ఓసారి ఇంద్రధనుస్సు పర్వతాల్ని చూసొస్తారా!

* మామూలుగా మన దగ్గర పర్వతాల్ని చూస్తే అంతా ఒకే రంగులో ఉంటాయి కదా. మరి ఇవి మాత్రం చిత్రంగా ఇలాగెందుకున్నాయి? అనే సందేహం ఎవరికైనా వస్తుంది. కొన్ని లక్షల ఏళ్ల క్రితం రకరకాల రంగుల్లో ఉన్న ఇసుక రాయి, బోలెడు ఖనిజాలు భూమిలో ఒక్కచోట పోగయ్యాయి. ఎప్పుడంటే రెండు కోట్ల నలభై లక్షల ఏళ్ల క్రితం. భూమి లోపల అప్పుడప్పుడూ ఫలకాలు అటూ ఇటూ జరుగుతుంటాయని తెలుసుగా. అలా సర్దుబాట్లు జరిగినప్పుడు ఓ సారి ఇవిలా రంగు పర్వతాల్లా బయటకి వచ్చాయట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని