ఆ రాళ్లకు కాళ్లున్నాయ్‌

అదో లోయ ప్రాంతం. అందులో అక్కడక్కడా కొన్ని రాళ్లు. వాటికి కాళ్లొచ్చాయి. ఎవరూ తోయకుండానే వాటంతట అవే ముందుకు జరుగుతూ పోతున్నాయి. అదీ ఎవరూ చూడనప్పుడే సుమా. నమ్మశక్యంగా లేదా... అయితే వాటి గురించి తప్పక తెలుసుకోవాల్సిందే.

Published : 01 Nov 2017 01:40 IST

ఆ రాళ్లకు కాళ్లున్నాయ్‌

దో లోయ ప్రాంతం. అందులో అక్కడక్కడా కొన్ని రాళ్లు. వాటికి కాళ్లొచ్చాయి. ఎవరూ తోయకుండానే వాటంతట అవే ముందుకు జరుగుతూ పోతున్నాయి. అదీ ఎవరూ చూడనప్పుడే సుమా. నమ్మశక్యంగా లేదా... అయితే వాటి గురించి తప్పక తెలుసుకోవాల్సిందే.
అమెరికాలోని కాలిఫోర్నియాకు సమీపంలో ఉందా లోయ. దాన్ని అక్కడివారు మృత్యులోయ అని పిలుచుకుంటారు. ఎందుకంటే అక్కడ ఎవరికీ అంతుబట్టని ఓ రహస్యం దాగుంది. అక్కడున్న రాళ్లను చూస్తే వాటికి కాళ్లొచ్చి నడుచుకుంటూ పోతున్నాయేమో అన్న అనుమానం వస్తుంది. ఆ రాళ్లను ఎవరూ జరపకుండానే వాటంతట అవే ముందుకు వెళ్తున్నాయి మరి. వంద సంవత్సరాలకు పైగా ఇది జరుగుతున్నా దీని వెనుక ఉన్న రహస్యమేంటో తెలియలేదు.
* ఈ రాళ్లు కదులుతుండగా ప్రత్యక్షంగా చూసినవారు ఎవరూ లేరు. ఎందుకంటే ఈ రాళ్లు ఎప్పుడు కదులుతాయో ఎవరికీ తెలియదు. అవి చాలా నెమ్మదిగా రెండు మూడేళ్లలో కొన్ని మీటర్ల దూరమే కదులుతున్నాయి.
* మరి ఈ రాళ్లు నిజంగా కదులుతున్నాయని ఎలా తెలిసిందంటారా..?. ఆ రాళ్ల కదలికల మూలంగా నేలపై ఏర్పడిన బాటలే అందుకు రుజువుగా నిలుస్తున్నాయి.
* కొన్ని రాళ్లు పదడుగుల దూరం ముందుకు కదలగా మరికొన్ని వందడుగులకుపైగానే ముందుకెళ్లాయి. ఈ రాళ్లు కొన్ని కిలో కన్నా తక్కువ బరువుండగా మరికొన్ని వందకిలోల పైన బరువుతో ఉన్నాయి. పైగా ఈ రాళ్లు ఒకే దిశలో వెళ్లడం లేదట. కొన్ని 90 డిగ్రీల కోణంలో తమ దిశను మార్చుకోవడం విచిత్రం.
* ఈ రాళ్ల కదలిక గురించి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. కొందరేమో దెయ్యాలే వాటిని కదిలిస్తున్నాయని చెబుతున్నారు. మరికొందరు ప్రత్యేకమైన అయస్కాంత లక్షణాలుండటం వల్లే అవి కదులుతుండొచ్చని చెబుతున్నారు. కొందరు పరిశోధకులు టైమ్‌ లాప్స్‌ వీడియోలు తీసి వీటి కదలికల్ని గమనించారు. ఆ వీడియోల సంగతి వినే ఉంటారుగా... ఓ మొగ్గ పువ్వులా పూర్తిగా విచ్చుకునే వరకు రకరకాల దశల్ని ఫ్రేముల్లో బంధించి ఓ వీడియోలా చూపించేదే. దీని ఆధారంగా బలమైన గాలులే వాటిని ముందుకు తోస్తుండవచ్చని అంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని