ఈ పిట్టలు అపార్టుమెంట్లు కట్టేస్తాయ్‌!

పక్షి గూళ్లు చూసే ఉంటారు... ఏ చూరుకో చెట్లపైనో కనిపిస్తుంటాయి... గుప్పెడంతే ఉంటాయా గూళ్లు... అయితే ఓ రకమైన పక్షులున్నాయి... అవి ఏకంగా అపార్టుమెంట్లు కట్టేస్తాయి... ఆశ్చర్యపరిచే ఆ సంగతులేంటో చదివేయండి మరి! ఓ పది, ఇరవై కుటుంబాలతో మనం అపార్టుమెంట్లు కట్టుకుంటాం. ఒకే పెద్ద భవంతిలో వాటాల్ని పంచుకుంటాం. గదులు కేటాయించుకుంటాం. ఇలా చేసేది మనమేనా? సోషల్‌ వీవర్‌ పక్షులూ చేసేస్తాయి. అయితే అపార్టుమెంట్లు అనగానే మనలా ఇసుక, సిమెంటుతో కట్టినవి కాదండోయ్‌... చెట్లపైన చిన్న చిన్న కర్రలు... గడ్డి ఆకులు వంటి వాటితోనే. అయితే మిగతా పక్షి గూళ్లలా ఇవి చిన్నగా ఉండవు. భారీ పరిమాణంలో ఉంటాయి. లోపల అంతరాలు అంతరాలుగా వందల సంఖ్యలో గదులుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే బోలెడు పక్షులు కలిసి ఒకే పేద్ద పక్షి గూడుని నిర్మించుకుంటాయన్నమాట....

Published : 02 Jan 2018 01:55 IST

ఈ పిట్టలు అపార్టుమెంట్లు కట్టేస్తాయ్‌!

పక్షి గూళ్లు చూసే ఉంటారు... ఏ చూరుకో చెట్లపైనో కనిపిస్తుంటాయి... గుప్పెడంతే ఉంటాయా గూళ్లు... అయితే ఓ రకమైన పక్షులున్నాయి... అవి ఏకంగా అపార్టుమెంట్లు కట్టేస్తాయి... ఆశ్చర్యపరిచే ఆ సంగతులేంటో చదివేయండి మరి!

పది, ఇరవై కుటుంబాలతో మనం అపార్టుమెంట్లు కట్టుకుంటాం. ఒకే పెద్ద భవంతిలో వాటాల్ని పంచుకుంటాం. గదులు కేటాయించుకుంటాం. ఇలా చేసేది మనమేనా? సోషల్‌ వీవర్‌ పక్షులూ చేసేస్తాయి. అయితే అపార్టుమెంట్లు అనగానే మనలా ఇసుక, సిమెంటుతో కట్టినవి కాదండోయ్‌... చెట్లపైన చిన్న చిన్న కర్రలు... గడ్డి ఆకులు వంటి వాటితోనే. అయితే మిగతా పక్షి గూళ్లలా ఇవి చిన్నగా ఉండవు. భారీ పరిమాణంలో ఉంటాయి. లోపల అంతరాలు అంతరాలుగా వందల సంఖ్యలో గదులుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే బోలెడు పక్షులు కలిసి ఒకే పేద్ద పక్షి గూడుని నిర్మించుకుంటాయన్నమాట.

* ఈ గూళ్ల కొలతలు వింటే అయ్య బాబోయ్‌ అనేస్తారు. ఇరవై అడుగుల వెడల్పు, పది అడుగుల ఎత్తు, వెయ్యి కిలోల బరువుతో ఉంటాయివి. 100 జంటల పక్షులుండేంత పరిమాణం ఈ గూళ్లది. ఈ గూళ్లతో ఏకంగా చెట్టే పడిపోగలదు.
* అద్భుతమైన ఈ గూటికి... ఎండిపోయిన చెట్ల కొమ్మలే సిమెంట్‌. మనం ఇంటిని అలంకరించుకున్నట్టే ఈ పక్షులు కూడా గూటి లోపల నిర్మాణానికి గడ్డి, దూది, ఆకులు, ఈకల్ని వాడేస్తాయి. పది అంగుళాల పొడవుతో మూడు అంగుళాల వెడల్పుతో ద్వారమూ నిర్మించుకుంటాయి. వీటికి ఎంత తెలివంటే... పాముల్లాంటి శత్రువులు లోపలికి చొరబడకుండా ముళ్లతో ప్రత్యేకఏర్పాటు చేసుకుంటాయి.

* అంతేకాదూ... ఈ గూళ్ల మధ్యలో హాలు లాంటి విశాలమైన గది దాని చుట్టూ బోలెడు బుల్లి గదులు ఉంటాయి. వీటి ప్రత్యేకతలు ఏమిటంటే... గూడు మధ్యలోని పెద్ద గది ఉష్ణాన్ని నిలిపి ఉంచుకుంటూ రాత్రుల్లో వెచ్చగా ఉంటుంది. పగటిపూట బయట వాతవరణ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందిగా... దానికి తగ్గట్టు చుట్టూ ఉన్న గదులు పగటిపూట 7 నుంచి 8 డిగ్రీల సెల్సియస్‌తో చల్లగా ఉంటాయట. ఏమైనా భలే ఏర్పాటులెండి.

* వీటిని చూస్తే మనకే కాదూ ఇతర జాతి పక్షులకూ ముచ్చటేస్తుందేమో... అందుకే పిగ్మీ ఫాల్కన్‌, రెడ్‌ హెడ్డెడ్‌ ఫించెస్‌ వంటి పక్షులూ ఈ గూళ్లను ఎంచక్కా వాడేసుకుంటాయి.
* ఐదున్నర అంగుళాల పొడవు, 26 నుంచి 32 గ్రాముల బరువుండే ఈ పక్షుల చిరునామా ఆఫ్రికా.
* ఈ చిట్టిపొట్టి పిట్టలు... కీటకాలు, పురుగులు, విత్తనాల్లాంటివి తిని పొట్ట నింపుకొంటాయి. ఇవి నీటిని తాగవట. పదార్థాల నుంచే అవసరమయ్యే తేమను గ్రహిస్తాయట.
శ్చర్య పరిచే సంగతి తెలుసా? చెట్లు, విద్యుత్తు స్తంభాలపై కట్టుకునే ఈ గూళ్లు గాలి వానకో, వాన నీటికో అంత సులువుగా కూలిపోవట. ఏకంగా ఏళ్లకు ఏళ్లు దృఢంగా స్థిరంగా ఉంటాయట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని