తళుకుల్‌ బెళుకుల్‌... వూరంతా వజ్రాల్‌!

అనగనగా ఓ వూరుంది...అక్కడంతా బోలెడు వజ్రాలు.... ఎన్నంటే టన్నులకు టన్నులు... ఏ గోడ చూసినా వజ్రాలే... ఏ గుంజ చూసినా అవే... అయితే వాటిని ఎవ్వరూ తియ్యరు...అస్సలు పట్టించుకోరు... ఎందుకో? ఏంటో?

Published : 03 Jan 2018 02:21 IST

తళుకుల్‌ బెళుకుల్‌... వూరంతా వజ్రాల్‌!

అనగనగా ఓ వూరుంది...అక్కడంతా బోలెడు వజ్రాలు....
ఎన్నంటే టన్నులకు టన్నులు...
ఏ గోడ చూసినా వజ్రాలే...
ఏ గుంజ చూసినా అవే...
అయితే వాటిని ఎవ్వరూ తియ్యరు...అస్సలు పట్టించుకోరు...
ఎందుకో? ఏంటో?

క్కడైనా వజ్రాలు దొరుకుతాయంటే అంతా వెళ్లి గబగబా ఏరేసుకుందాం అనుకుంటాం. అయితే ఓ చిన్న టౌనుంది. ఎక్కడంటే జర్మనీలో. చూస్తే మామూలు టౌనుల్లానే ఉంటుంది ఇదీనూ. ఇక్కడ బోలెడన్ని వజ్రాలుంటాయి. ఎన్నంటే ఏకంగా 72,000 టన్నుల వరకూనట. అయినా చిత్రంగా వాటిని ఎవ్వరూ పట్టించుకోరు.
* ఈ వూరి పేరు నోర్డ్‌లింగన్‌. వజ్రాల్ని పొదుముకున్న టౌననీ దీన్ని పిలుస్తారు. ఇక్కడుండే గోడలు, దుమ్ము... ఇలా అన్ని చోట్లా వజ్రాలు నిక్షిప్తమై ఉంటాయి. కావాలని ఎవరూ వీటినిలా నిక్షిప్తం చెయ్యలేదు.
* తొమ్మిదో శతాబ్దానికి ముందు నుంచే ఇక్కడ నివాసాలు ఉన్నాయి. అయితే అందుకు పూర్వం ఇక్కడ ఒక అగ్నిపర్వత బిలం ఉండేది. 15 మిలియన్‌ సంవత్సరాల క్రితం ఇక్కడో గ్రహ శకలం వచ్చి భూమిని బోలెడు ఒత్తిడితో ఢీకొంది.
* దీంతో అక్కడ రసాయన సమ్మేళనాలు జరిగి చాలానే ఖనిజాలు పుట్టాయి. వీటిల్లో వజ్రాలూ ఉన్నాయి. అయితే అవి మైక్రోస్కోప్‌లో పెట్టి చూస్తే గాని కనిపించనంత బుల్లి బుల్లి రేణువుల్లా ఉంటాయి. ఇక్కడి దుమ్ముల్లో కలిసిపోయి ఉంటాయి.

జ్రాలు చిన్న చిన్న రాళ్లలా కాకుండా ఇలా రేణువుల్లా ఎందుకు మారిపోయాయబ్బా? అని ఎవ్వరికైనా సందేహం కలుగుతుంది కదూ! అంతకు ముందు ఇక్కడ గ్రహశకలం పడటం వల్ల పుట్టిన ఒత్తిడికే ఇవిలా రేణువుల్లా మారిపోయాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

* కనీసం కంటికి కనిపిస్తే వాటిని మనం ఆభరణాల్లోనో, మరో విధంగానో వాడుకుంటాం. కానీ రేణువుల్లా కంటికి కనిపించకుండా ఉండే వాటిని ఏం చేసుకుంటాం. అందుకే వాటికి మార్కెట్‌ విలువా అంతంత మాత్రమే.
* అందుకే వీటిని ఇక్కడ ఎవ్వరూ పట్టించుకోరన్నమాట. అయితే రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీలో భీకర వాతావరణం ఉండేది. ఎప్పుడూ యుద్ధాలు జరుగుతుండేవి. ఈ వూరిని రక్షించుకునేందుకు ఇక్కడి వారు ఆ పక్క పక్కన దొరికే ఇసుక, మట్టిని ఉపయోగించి గోడలు కట్టుకున్నారు. దానితోనే ఇక్కడ కొన్ని ఇళ్లు కూడా కట్టుకున్నారు.
* సూర్యరశ్మి ఎప్పుడైనా ఏటవాలుగా ఆ గోడలపై పడితే వజ్రాలు ధగధగమని మెరుస్తూ మనకు కనిపిస్తాయి తప్ప ఒట్టిగా అయితే అవి కనే కనిపించవు.
* ఇక్కడి అగ్ని పర్వత బిలం దాదాపుగా 25 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేదట. దీంతో ఆ చోటంతా ఇలా చిన్న రేణువుల్లాంటి వజ్రాలు నిక్షిప్తమయ్యాయట.
* ఈ వివరాలన్నీ తెలిపేలా ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది. పేరు రైస్‌ క్రేటర్‌ మ్యూజియం. ఆ అగ్ని పర్వతం పేరు మీదే దీనికీ పేరు పెట్టారు.
* దీంతో ఈ చిత్రమైన వూరుని, మ్యూజియంని చూడటానికి ఇక్కడికి ఏటా బోలెడు మంది పర్యాటకులు వస్తుంటారు. తమాషాగా ఉన్న ఈ వివరాలన్నీ వినడానికైతే భలేగా ఉన్నాయి కదూ! 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని