ఇళ్లే.. కోటలాయె!

అనగనగా ఓ ప్రాంతముంది... అక్కడ చాలానే వూళ్లున్నాయి... వాటిల్లో చిత్రమైన ఇళ్లున్నాయి... ఇంతకీ ఏంటా సంగతులు? ఎక్కడైనా ఒక కోట ఉందనుకోండి. మనమంతా దాన్ని ఆసక్తిగా చూస్తుంటాం. పర్యాటక ప్రాంతంలా సందర్శించేందుకు వెళుతుంటాం. దాని విశేషాలన్నీ తెలుసుకుని విజ్ఞానాన్నీ సంపాదిస్తాం. మరేమో ఒక దేశంలో కొన్ని వూళ్లకు వూళ్లే కోటల్లా ఉంటాయి. ఏంటో ఆ చిత్రం మనమూ చూసొద్దాం...

Published : 10 Jan 2018 01:52 IST

ఇళ్లే.. కోటలాయె!

నగనగా ఓ ప్రాంతముంది...
అక్కడ చాలానే వూళ్లున్నాయి...
వాటిల్లో చిత్రమైన ఇళ్లున్నాయి...
ఇంతకీ ఏంటా సంగతులు?

క్కడైనా ఒక కోట ఉందనుకోండి. మనమంతా దాన్ని ఆసక్తిగా చూస్తుంటాం. పర్యాటక ప్రాంతంలా సందర్శించేందుకు వెళుతుంటాం. దాని విశేషాలన్నీ తెలుసుకుని విజ్ఞానాన్నీ సంపాదిస్తాం. మరేమో ఒక దేశంలో కొన్ని వూళ్లకు వూళ్లే కోటల్లా ఉంటాయి. ఏంటో ఆ చిత్రం మనమూ చూసొద్దాం.
* జార్జియా అని ఒక చిన్న దేశముంది తెలుసుగా? అక్కడ ఖెవ్‌సురైటీ అని ఒక రాష్ట్రముంది. పెద్ద పెద్ద పర్వతాలుంటాయి. వాటిపేరు కకాసస్‌.
* అంతెత్తునున్న పర్వతాల పక్కల్లో, ఆ లోయల్లో చిన్నచిన్న గ్రామాలుంటాయి.
* వాటిని చూస్తే పెద్ద పెద్ద రాతి బురుజులతో వూరు వూరంతా కోటే ఉందా? అనిపిస్తుంది. ఏ రాజు కట్టిన కోటో ఇది? అని సందేహం వచ్చేస్తుంది.
* అంతెత్తు రాతి గోడలు, దూరం నుంచి ఎవరైనా వస్తుంటే కనిపించడానికి వీలుగా కిటికీలు, పైన ఇనుప వూసల బాల్కనీలతో చిత్రంగా ఉంటాయా ఇళ్లు.
* ఈ ఇళ్లను అసలు ఎందుకు ఇలా కట్టుకున్నారబ్బా? అంటే దాని వెనక ఓ పెద్ద కారణమే ఉంది మరి.
* ఎప్పుడో ప్రాచీన కాలం నుంచే ఇక్కడ జార్జియన్‌లు కొండల్ని తొలుచుకుని చిన్న ఇళ్లు వేసుకుని నివసించేవారు. అయితే ఇక్కడ పెద్దగా పరిశ్రమల్లాంటివేమీ లేవు. దీంతో చుట్టుపక్కల వారందరికీ ఉద్యోగాలూ లేవు. ఈచుట్టుపక్కల ఉండే గిరిజనులకు చేసుకునేందుకు పనులే దొరికేవి కావట. దీంతో వాళ్లు వూళ్లకు వూళ్లనే దోచుకుపోయేవారట.
* దొంగల భయానికి వూళ్లలో ఉండే ప్రజలంతా ఒక్కటయ్యారు. వారి నుంచి రక్షించుకోవడానికి వీలుగా అంతెత్తు కోట గోడలతో ఇళ్లన్నీ ఒక దగ్గరే నిర్మించుకున్నారు. వాటిల్లోనే వాటాలు పంచుకుని ఎవ్వరిళ్లల్లో వాళ్లు ధైర్యంగా జీవించడం ప్రారంభించారు.
* అలా ఈ ప్రావిన్సులో ఉన్న చాలా గ్రామాలు వరుసగా కోటఇళ్లుగా మారిపోయాయి. అందుకే ఈ వూళ్లను ‘ఫోర్ట్‌ విలేజస్‌’ అని సరదాగా పిలిచేస్తుంటారు. ఇక్కడ దొంగల నుంచి కాపాడుకోవడానికి ఇక్కడి పురుషులు యుద్ధకళల్నీ నేర్చుకుని వాటిల్లో ఆరితేరారు. ఇక్కడి యువకులు ఇప్పటికీ ఆసంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
* ఇంత కథ ఉండి, చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిన ఈ గ్రామాలు పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నాయిప్పుడు.

చాలా గ్రామాల్లో ఇప్పుడు జనాలు పెద్దగా లేరు. అయితే షతిలి అనే వూళ్లొ మాత్రం ఇప్పటికీ డజన్లకొద్దీ కుటుంబాలు ఈ కోటల్లోనే నివాసముంటున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని