Paytm: మూడో నెలా పేటీఎం లావాదేవీలు డౌన్‌.. టాప్‌లో ఫోన్‌పే, గూగుల్‌పే

పేటీఎం యూపీఐ లావాదేవీల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. వరుసగా మూడో నెలా క్షీణత నమోదైంది. మరోవైపు ఫోన్‌పే, గూగుల్‌ పే హవా కొనసాగుతోంది.

Published : 07 May 2024 15:39 IST

Paytm | ఇంటర్నెట్‌ డెస్క్‌: యూపీఐ లావాదేవీల విషయంలో ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ పేటీఎం (Paytm) వాటా నానాటికీ తగ్గుతోంది. ఈ యాప్‌ వేదికగా చేసే యూపీఐ లావాదేవీలు వరుసగా మూడో నెలా క్షీణించాయి. ఏప్రిల్‌ నెలకు గానూ ఎన్‌పీసీఐ (NPCI) విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పేటీఎం వేదికగా మార్చిలో 1230.04 మిలియన్‌ లావాదేవీలు జరగ్గా.. ఏప్రిల్‌ నెలకొచ్చేసరికి 9 శాతం క్షీణించి 1117.13 మిలియన్‌ లావాదేవీలు మాత్రమే నమోదయ్యాయి. మొత్తం యూపీఐ లావాదేవీల్లో కంపెనీ వాటా సైతం 8.4 శాతానికి చేరింది. ఫిబ్రవరిలో ఈ వాటా 10.8 శాతంగానూ, మార్చిలో 9.13 శాతం గానూ ఉంది.

ఇక యూపీఐ లావాదేవీల్లో ఫోన్‌పే, గూగుల్‌ పే హవా కొనసాగుతోంది. 6500 మిలియన్‌ లావాదేవీలతో 48.8 శాతం మార్కెట్‌ వాటాతో ఫోన్‌పే అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. 5,027.3 మిలియన్‌ లావాదేవీలు, 37.8 శాతం వాటాతో రెండో స్థానంలో గూగుల్‌పే కొనసాగుతోంది. లావాదేవీలు, మార్కెట్‌ వాటా పరంగా తక్కువే అయినప్పటికీ.. ఇతర యాప్‌ల నుంచి పెద్దగా పోటీ లేకపోవడంతో పేటీఎం మూడో స్థానంలో కొనసాగుతోంది. క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపుల కోసం ఉపయోగించే క్రెడ్‌ యాప్‌ (CRED) నాలుగో స్థానంలో ఉంది. ఏప్రిల్‌ నెలలో 138.46 మిలియన్‌ లావాదేవీలను ఈ యాప్‌ నిర్వహించింది. పేటీఎం లావాదేవీలతో పోలిస్తే ఎనిమిదో వంతు మాత్రమే.

ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్‌.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు

యూపీఐ లావాదేవీల విషయంలో ఫోన్‌పే, గూగుల్‌ పే మొదటినుంచీ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. పేటీఎం మూడో స్థానంలో ఉన్నప్పటికీ.. ఒకప్పుడు మెరుగైన మార్కెట్‌ వాటా ఉండేది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఎప్పుడైతే ఆర్‌బీఐ చర్యలు తీసుకుందో అప్పటినుంచి పేటీఎం లావాదేవీల్లో పతనం మొదలైంది. మార్కెట్‌ వాటాలో క్షీణత మొదలైంది. ఆ సమయంలో టాప్‌-2లో ఉన్న యాప్‌ల మార్కెట్ వాటా పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం థర్డ్‌ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్‌గా పేటీఎం వ్యవహరిస్తోంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌లు.. పేటీఎంకు పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ బ్యాంకులుగా వ్యవరిస్తున్నాయి. ఈనేపథ్యంలో పేటీఎం తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు