CSIR: సోమవారం ముడతల దుస్తులు ధరించండి..! సీఎస్‌ఐఆర్‌ వినూత్న ప్రచారం

ఇస్త్రీ చేసిన దుస్తులు కాకుండా ముడతల దుస్తులు వేసుకోవాలని పరిశోధక సంస్థ సీఎస్‌ఐఆర్‌ (CSIR) తన సిబ్బందిని కోరింది. 

Updated : 07 May 2024 15:57 IST

దిల్లీ: ఆఫీసులకు వెళ్తున్నారంటే నీట్‌గా ఇస్త్రీ చేసిన దుస్తులను ధరిస్తుంటారు ఉద్యోగులు. సోమవారం వస్తుందంటే.. వారం మొత్తం ధరించాల్సిన దుస్తుల్ని రెడీ చేసి పెట్టుకుంటాం. అయితే సోమవారం ముడతల డ్రెస్‌లు వేసుకోమని కౌన్సిల్‌ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ సెర్చ్‌ (CSIR) తన సిబ్బందిని కోరింది. దీనిలోభాగంగా వాహ్‌ మండేస్‌ (WAH Mondays)ను ప్రారంభించింది. WAH అంటే Wrinkles Acche Hai (ముడతలు మంచివే). ప్రతీ సోమవారం ఇస్త్రీ చేయని దుస్తులు ధరించడం ఈ ప్రచారం ఉద్దేశం. దీని వెనక పర్యావరణహితం ఉంది.

సీఎస్‌ఐఆర్ తొలి మహిళా డైరెక్టర్‌ జనరల్ డాక్టర్ ఎన్‌.కళైసెల్వి మాట్లాడుతూ.. ఇంధన అక్షరాస్యతలో భాగంగా వాహ్‌ మండేస్‌ను తీసుకువచ్చామన్నారు. ‘‘సోమవారం ఇస్త్రీ చేయని దుస్తులు ధరించి సహకరించాలని సీఎస్‌ఐఆర్‌ నిర్ణయించింది. ఒక జత దుస్తుల్ని ఐరన్ చేసినప్పుడు 200 గ్రాముల కార్బన్‌ డై ఆక్సైడ్ విడుదల అవుతుంది. ముడతల దుస్తులు ధరించడం వల్ల దానిని నివారించే అవకాశం ఏర్పడుతుంది’’ అని ఆమె వెల్లడించారు.

ఇంధనాన్ని ఆదా చేసే నిమిత్తం సీఎస్‌ఐఆర్‌.. మే 1 నుంచి 15 వరకు ‘స్వచ్ఛతా పక్వాడా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దానిలోభాగంగా ఇంధన వినియోగాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకొని కొన్ని నిబంధనలను రూపొందించింది. వాటిని జూన్ నుంచి ఆగస్టు మధ్య పైలట్ ప్రాతిపదికన అమలుచేయనుంది. తన కార్యాలయాల్లో విద్యుత్ ఛార్జీలను 10 శాతానికి తగ్గించడం తొలి టార్గెట్‌. ఇదిలాఉంటే.. ఎర్త్‌ డే వేడుకల్లో భాగంగా ఈ పరిశోధక సంస్థ గత నెల దిల్లీలోని తన కేంద్ర కార్యాలయంలో అతిపెద్ద క్లైమేట్ క్లాక్‌ను ఏర్పాటుచేసింది. ఉద్గారాల విడుదల, పర్యావరణ మార్పు గురించి ఇది గ్రాఫ్ రూపంలో వివరణ ఇస్తుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని