చాక్లెట్‌ కొండలట.. చక్కని తీరట!

మనమంతా కొండల్ని చూస్తూనే ఉంటాం. సాధారణంగా అవన్నీ ఒకదానికొకటి ఆనుకుని వరుసలు వరుసలుగా ఉండటమూ గమనిస్తుంటాం. మరేమో ఓచోట వింత రకమైన కొండలున్నాయి. పై నుంచి ఒక్కసారిగా చూస్తే ఏవో ధాన్యపు రాసుల్ని దూరం దూరంగా వరుసగా పోశారా? అని సందేహం వచ్చేస్తుంది. అదే వేసవి కాలంలో అయితే ముదురు రంగులో ఉన్న పువ్వుల్ని గాని గుట్టలుగా చేశారా? అనిపించేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఒకదానికొకటి అంటీముట్టనట్లు భలే తమాషాగా ఉంటాయి.

Published : 07 Mar 2018 01:23 IST

చాక్లెట్‌ కొండలట.. చక్కని తీరట!

మనమంతా కొండల్ని చూస్తూనే ఉంటాం. సాధారణంగా అవన్నీ ఒకదానికొకటి ఆనుకుని వరుసలు వరుసలుగా ఉండటమూ గమనిస్తుంటాం. మరేమో  ఓచోట వింత రకమైన కొండలున్నాయి. పై నుంచి ఒక్కసారిగా చూస్తే ఏవో ధాన్యపు రాసుల్ని దూరం దూరంగా వరుసగా పోశారా? అని సందేహం వచ్చేస్తుంది. అదే వేసవి కాలంలో అయితే ముదురు రంగులో ఉన్న పువ్వుల్ని గాని గుట్టలుగా చేశారా? అనిపించేస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ఒకదానికొకటి అంటీముట్టనట్లు భలే తమాషాగా ఉంటాయి. అన్నీ కలిసి ఒక ప్రాంతంలోనే ఉంటాయిగానీ వేటికవే అన్నట్లుగా కొలువుదీరాయి. వీటి కబుర్లేంటో ఓసారి చూసేద్దామా మరి?
కొండలున్న ప్రాంతాన్ని ‘చాక్లెట్‌ హిల్స్‌ వరల్డ్‌ మానుమెంట్‌’ పేరుతో పిలుస్తారు. ఫిలిప్పీన్స్‌ అనే దేశం ఉంది కదా. అక్కడ బోహోల్‌ ప్రావిన్సులో ఉన్నాయివి.
* ఇక్కడ దాదాపుగా 50 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇదో ఒంటరి కొండల సమూహమున్న ప్రాంతం. ప్రపంచం మొత్తం మీద ఇలాగున్న చిత్రమైన ప్రాంతం ఇదేనని స్థానికులు చెబుతుంటారు.
* ఇక్కడ దాదాపుగా పదిహేడు వందలకు పైగా కొండలున్నాయి. వీటిలో చాలా మటుకు 30 నుంచి 50 మీటర్ల వరకూ ఎత్తుంటాయి. అన్నింటికంటే ఎత్తున్న ఒక కొండ మాత్రం 120 మీటర్ల ఎత్తుంది.
* లోపలున్న ఖనిజాల వల్ల వీటిపై చెట్లు పెరగవని చెబుతారు. అందుకే ఇవన్నీ చిన్న గడ్డిలాంటిదానితో కప్పి ఉంటాయి. వేసవి కాలం వచ్చేసరికీ ఈ గడ్డీ ఎండిపోయి అన్నీ ముదురు గోధుమరంగులోకి మారిపోతాయి. ఆ రంగు వల్లే వీటికి చాక్లెట్‌ హిల్స్‌ అనే పేరొచ్చింది. అయితే... ఈ కొండకూ కొండకూ మధ్య ప్రాంతంలో మాత్రం ఎత్తయిన చెట్లు పెరుగుతాయి. దీంతో పచ్చని చెట్ల మధ్యలో పొడుచుకొచ్చిన భూభాగాల్లా ఇవి దర్శనమిస్తాయి.
* అన్ని కొండలకు భిన్నంగా ఇవి ఇలా ఎందుకు ఏర్పడ్డాయన్నదానిపై ఇక్కడ రెండు జానపద కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకటేంటంటే ఇద్దరు ఆజానుబాహులు ఈ ప్రాంతంలో పెద్ద యుద్ధం చేసుకున్నారట. ఒకరిపై ఒకరు పెద్ద రాళ్లను విసురుకున్నారట. చివరికి ఆ యుద్ధంలో ఇద్దరూ బాగా అలిసిపోయి ఈ ద్వీప దేశం వదిలి వెళ్లిపోయారట. అయితే వారు విసురుకున్న ఆ రాళ్లు మాత్రం ఇలా చిత్రమైన కొండలుగా మారాయట.
ఇక రెండో కథ విషయానికి వస్తే.. ఓ వ్యక్తి ఇక్కడి కొండకోనల్లో ఉన్న ఓ అమ్మాయిని ఇష్టపడ్డాడట. తర్వాత కొంతకాలానికే ఆమె చనిపోయిందట. అందుకు ఎంతో బాధపడి ఆ వ్యక్తి గుండెలవిసేలా కన్నీళ్లు కార్చాడట. ఆ కన్నీళ్లే ఇలా కొండల్లా మారాయని చెబుతారు. మొత్తానికి కథలూ, ఈ కథల వెనకున్న కొండలూ భలే తమాషాగా ఉన్నాయి కదూ!

* ఈ కొండల అందాల్ని చూడటానికి ఇక్కడ వ్యూ పాయింట్‌ ఉంది. ఎత్తయిన చోట డెక్‌లాంటిదాన్ని నిర్మించారు. అదెక్కితే వీటి అందాల్ని పై నుంచి చూస్తూ ఆస్వాదించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని