మిలటరీ లేని దేశం!

పసిఫిక్‌ మహా సముద్రంలో దక్షిణాన ఉన్న ద్వీపదేశం సోమన్‌ ఐల్యాండ్స్‌. ఆస్ట్రేలియాకు ఈశాన్యంవైపు ఉండే దీవులివి. పవునా న్యూగినియా, వనాటూలు పొరుగు దేశాలుగా ఉన్నాయి. దీనిలో దాదాపుగా వెయ్యి ద్వీపాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి మాత్రం ఆరు. అవి చోయ్‌సల్‌, గౌడాల్‌కెనాల్‌, మలైటా, మకైరా, న్యూజార్జియా, శాంటాఐస్‌బల్‌లు.....

Published : 17 Mar 2018 01:17 IST

సోలమన్‌ ఐలాండ్స్‌
మిలటరీ లేని దేశం!  

పసిఫిక్‌ మహా సముద్రంలో దక్షిణాన ఉన్న ద్వీపదేశం సోమన్‌ ఐల్యాండ్స్‌. ఆస్ట్రేలియాకు ఈశాన్యంవైపు ఉండే దీవులివి.  పవునా న్యూగినియా, వనాటూలు పొరుగు దేశాలుగా ఉన్నాయి.

దీనిలో దాదాపుగా వెయ్యి ద్వీపాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి మాత్రం ఆరు. అవి చోయ్‌సల్‌, గౌడాల్‌కెనాల్‌, మలైటా, మకైరా, న్యూజార్జియా, శాంటాఐస్‌బల్‌లు.
*  ఇది 1978లో గ్రేట్‌ బ్రిటన్‌ నుంచి స్వతంత్రం పొందింది.
*  ఇక్కడ 90శాతం దట్టమైన అడవులే. ఎత్తయిన పర్వతాలు, లోయలు, పగడపుదిబ్బలకు ఈ దేశం పెట్టిందిపేరు.
*  ఇది ఉష్ణమండల ప్రాంతం. డిసెంబర్‌ నుంచి మార్చి వరకు వేడిగా ఉంటుంది. ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు చల్లగా ఉంటుంది.

దేశం: సోలమన్‌ ఐలాండ్స్
‌రాజధాని: హోనియారా
విస్తీర్ణం: 28,400 చదరపు కిలోమీటర్లు
జనాభా: 5,23,000
భాష: ఆంగ్లం
కరెన్సీ: సోలమన్‌ ఐలాండ్స్‌ డాలర్‌

*  ఈ దేశానికి 5,313 కిలోమీటర్ల తీర రేఖ ఉంది.
*  వీరి అధికారిక భాష ఆంగ్లమే అయినా దాన్ని మాట్లాడేవారు దాదాపుగా ఒకటి నుంచి రెండు శాతం మంది మాత్రమే. ఇక్కడ 120 వరకు స్థానిక భాషలున్నాయి. వాటిల్లోనే వీరు ఎక్కువగా సంభాషణలు జరుపుతారు.
*  దాదాపు 30,000సంవత్సరాల క్రితం పపువా న్యూగినియా నుంచి కొందరు వచ్చి తొలిసారిగా ఇక్కడ స్థిరపడ్డారని చెబుతారు.

* ఈ దేశానికి మిలటరీనే లేదు. కేవలం 500మంది గల పోలీసుదళం ఉంది. సరిహద్దుల్లో కాపలానూ వారే కాస్తారు.

 *  దీని రాజధాని హోనియారా ఇక్కడి గౌడాల్‌కెనాల్‌ ద్వీపంలో ఉంది. ఈ దేశంలో అత్యంత ఎత్తయిన చోటుకూడా ఈ ద్వీపంలోనే ఉంది. దాన్ని ఉల్ట్రాపీక్‌ అని పిలుస్తారు. ఇది సముద్రమట్టానికి 2300మీటర్ల ఎత్తులో ఉంది.
*  బంగారం, సీసం, జింకు, నికెల్‌లు ఇక్కడ ఎక్కువగా దొరికే ఖనిజాలు.

*  ఇక్కడి ఆర్నవన్‌ ద్వీపాలు అంతరించిపోతున్న హౌకిస్‌బిల్‌ తాబేళ్లకు నెలవులు.

*  చైనా, థాయిలాండ్‌, జపాన్‌, న్యూజీలాండ్‌, మలేషియా, సింగపూర్‌, ఆస్ట్రేలియాలతో ఎక్కువగా వ్యాపార సంబంధాలున్నాయి.
*  కొకొవా, కొబ్బరి, వరి, బంగాళాదుంపలు, పామ్‌తోటల్ని ఎక్కువగా సాగు చేస్తారు. పశువులు, పందుల్ని పెంచుతారు.
*  కలప, చేపలు, పామాయిల్‌లను ఎక్కువగా ఎగుమతి చేస్తారు.

*  కొబ్బరి పాలను వంటల్లో ఎక్కువగా వాడతారు.

*  ప్రపంచంలోనే అతి పెద్ద ఉప్పు నీటి మడుగుల్లో ఒకటైన మరోవో ఇక్కడి న్యూజార్జియా దీవిలో ఉంది. 700చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. పగడపు దిబ్బలుండటంతో దీన్ని సంరక్షిత ప్రాంతంగా చేశారు.
*  పగడపు దిబ్బలతో ఏర్పడ్డ ప్రపంచంలోనే అతిపెద్ద దీవి ఈస్ట్‌ రెన్నెల్స్‌ ఇక్కడే ఉంది.

 

*  ఒక సోలమన్‌ ఐలాండ్స్‌ డాలర్‌ దాదాపుగా మన కరెన్సీలో ఎనిమిది రూపాయలకు సమానం.

*  నివాసాలకోసం ఇక్కడ కృత్రిమంగా ద్వీపాలనూ ఏర్పాటు చేసుకుంటారు. రాళ్లను ఒకదగ్గరకు చేర్చికదలకుండా చేసి వాటిపై నివాసాలు ఏర్పరుచుకుంటారు.
*  చదువు ఎవరికీ నిర్బంధం కాదు.

*  స్థానికుల్ని మెలనేషియన్లు అంటారు. వీరే ఇక్కడ 94.5శాతం మంది ఉంటారు. మిగిలినవారిలో చైనీయులు, యూరోపియన్లు, మైక్లోనేషియన్లు ఉన్నారు.

*  ఇక్కడ 61రకాల ఉభయచర, 163రకాల పక్షి, 53రకాల క్షీరదజాతులున్నాయి. దాదాపుగా 230రకాల ఆర్కిడ్‌లు, ఇతర ఉష్ణమండల పూలు కనిపిస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని