సముద్రంలో భూగోళం!

మనం పుస్తకాల్లో గ్లోబును చూస్తూనే ఉంటాం... మరి ఎప్పుడైనా సముద్రం మధ్యలో చూశారా? మన చిన్నూ మాత్రం చూసొచ్చాడంట... మన కోసం తమాషా కబుర్లు మోసుకొచ్చాడంట! హల్లో మిత్రులారా! అంతా కుశలమేనా! మీకెన్నో తమాషాలు, విశేషాలు చెప్పే నేనంటే మీ అందరికీ భలే ఇష్టమని నాకు తెలుసులేండి. అందుకే ఇవాళ ఒక చిత్రమైన ప్రాంతం గురించి చెప్పేందుకు మళ్లీ మీ పేజీలోకొచ్చేశా.

Published : 20 Mar 2018 01:10 IST

సముద్రంలో భూగోళం!

మనం పుస్తకాల్లో గ్లోబును చూస్తూనే ఉంటాం... మరి ఎప్పుడైనా సముద్రం మధ్యలో చూశారా? మన చిన్నూ మాత్రం చూసొచ్చాడంట... మన కోసం తమాషా కబుర్లు మోసుకొచ్చాడంట!

ల్లో మిత్రులారా! అంతా కుశలమేనా! మీకెన్నో తమాషాలు, విశేషాలు చెప్పే నేనంటే మీ అందరికీ భలే ఇష్టమని నాకు తెలుసులేండి. అందుకే ఇవాళ ఒక చిత్రమైన ప్రాంతం గురించి చెప్పేందుకు మళ్లీ మీ పేజీలోకొచ్చేశా.
* మరేమో ఈ సారి నేను చూసొచ్చినది భూమిని. ‘అదేంటదీ భూమి మీదే ఉండి భూమిని చూసిరావడమేంటి?’ అనకండి. నిజ్జంగానే నేను ‘ద వరల్డ్‌’ అనే చోటును చూసొచ్చా. యూఏఈ దేశ సముద్రతీరంలో ఉందిది. భలే ప్రత్యేకమైన ప్రాంతమేలేండి.
* ఇక్కడి ఫొటోలు చూస్తుంటే ఇప్పటికే మీకు కాస్త విషయం అర్థమై ఉంటుంది. మనం పుస్తకాల్లో, బొమ్మల్లో గుండ్రంగా ఉన్న గ్లోబు, దానిలో ఏడు ఖండాల్నీ చూస్తూనే ఉంటాం. అలాంటి గ్లోబు సముద్రంలో ఉంది తెలుసా?
* నేను ఈ ప్రాంతానికి  వెళదామనుకున్నప్పుడే భలే ఆశ్చర్యమేసేసింది. అసలు సముద్రంలో గ్లోబు ఆకారం, ఖండాలు స్పష్టంగా కనిపించడం ఎలా సాధ్యమయ్యిందబ్బా? అనిపించేసింది.
* తీరా అక్కడ అంతా చూశాకా అర్థమయ్యిందేంటంటే? యునైటెడ్‌ అరబ్‌ ఎమిరైట్స్‌ దీన్ని కృత్రిమంగా తయారు చేసింది.
* సాగరం మధ్యలో తొమ్మిది కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ కృత్రిమ ద్వీపాల్ని తయారు చేయడం గొప్పే కదా!
* అక్కడ ప్రభుత్వం ఆధ్వర్యంలో కొన్ని ప్రైవేటు నిర్మాణ సంస్థలు కలిసి దీన్ని నిర్మించాయి. దాదాపు మూడు వందల దీవుల్ని ఏర్పాటుచేసి భూగోళ ఆకారం రప్పించాయి.
* 2003లో ప్రారంభమైన వీటి నిర్మాణం దాదాపుగా 2014కు ఓ కొలిక్కి వచ్చింది. ఇప్పటికీ ఇక్కడ ఇంకా చిన్నా చితకా పనులు జరుగుతూనే ఉన్నాయి.
* ఇంతకీ ఈ దీవుల్ని ఎలా నిర్మించారనుకుంటున్నారు. ఇందుకోసం దుబాయ్‌ తీరంలోని ఇసుకను పెద్ద ఎత్తున తీసుకెళ్లారు. వేల టన్నుల రాళ్లను మోసుకెళ్లి సముద్రంలో కృత్రిమంగా కొట్టుకుపోకుండా ఉండేలా ద్వీపాల్ని తయారు చేశారట. అక్కడో అంకుల్‌ చెప్పారు నాకు.
* వీటిల్లో కొన్ని ప్రైవేటు ద్వీపాలు. ఇంకొన్నింటిలోనేమో అపార్ట్‌మెంట్లు, హోటళ్లు, రిసార్టులు, బీచ్‌లు... ఇలా చాలానే ఉన్నాయి. అందుకే ఇక్కడకు నాలానే బోలెడు మంది పర్యాటకులు వెళుతున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్‌ సంస్థలు కార్యక్రమాల్ని నిర్వహించుకుంటుంటాయి. ఇంకా పెళ్లిళ్లలాంటినీ చేసుకుంటుంటారు.
* మిగిలినవన్నీ ఎలా ఉన్నా పై నుంచి శాటిలైట్‌ వ్యూలో చూస్తే అచ్చంగా గ్లోబులానే కనిపించడం, మనుషులే దాన్నలా తయారు చేయడం నిజంగానే చిత్రమనిపించేసింది నాకు. మీకూ అలానే ఉంది కదూ! సరే. ఇప్పటికే బోలెడు విషయాలు చేప్పేసా. అమ్మ ఎదురు చూస్తుంటుంది ఇక ఇంటికి వెళ్లాలి. బైబై.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని