భలే.. భలే.. మువ్వన్నెల చిలుక!

హాయ్‌ నేస్తాలూ.. నేడు గణతంత్రదినోత్సవం కదా! ఈ రోజు మనం జాతీయపతాకాన్ని ఎగరేస్తాం కదూ! మన జాతీయ పతాకం మూడు రంగుల్లో ఉంటుంది.

Updated : 26 Jan 2024 05:38 IST

హాయ్‌ నేస్తాలూ.. నేడు గణతంత్రదినోత్సవం కదా! ఈ రోజు మనం జాతీయపతాకాన్ని ఎగరేస్తాం కదూ! మన జాతీయ పతాకం మూడు రంగుల్లో ఉంటుంది. ఓ చిలుకకు కూడా మూడు రంగులు ఉంటాయి. మరి దాని పేరేంటి? అదెక్కడ ఉంటుందో.. దాని వివరాలేంటో తెలుసుకుందామా!

మన జాతీయపతాకంలో ఉన్న రంగులను దాదాపుగా పోలిన వర్ణాల్లోనే కనిపిస్తున్న ఈ చిలుక పేరు ఆస్ట్రేలియన్‌ కింగ్‌ ప్యారెట్‌. దీని స్వస్థలం ఆస్ట్రేలియా. క్వీన్స్‌లాండ్‌లోని కుక్‌టౌన్‌ నుంచి, విక్టోరియాలోని పోర్ట్‌క్యాంప్‌బెల్‌ వరకున్న అడవుల్లో జీవిస్తుంటుంది. చలికాలంలో కాన్‌బెర్రాలోనూ కనిపిస్తుంటుంది. ఇది చాలా అరుదైన చిలుక. దీనిలో మళ్లీ రెండు ఉపజాతులున్నాయి. వీటిలో మగవాటి తల, గొంతు, పొట్ట భాగాలు కాస్త కాషాయ రంగులా కనిపించే ముదురు ఎరుపు వర్ణంలో, రెక్కలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. రెక్క మీద ఓ చోట తెల్లని గీత కూడా ఉంటుంది. తోక మాత్రం కాస్త ముదురు ఆకుపచ్చరంగులో కనిపిస్తుంటుంది. ఆడ చిలుకల్లో మాత్రం ఆకుపచ్చ రంగు ఎక్కువగా ఉంటుంది. కాళ్లపైన, పొట్టకింద మాత్రమే ముదురు ఎరుపు రంగు కనిపిస్తుంటుంది.

పొడవైన తోక

ఈ చిలుకలు 43 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. వీటి తోక పొడవుగా ఉంటుంది. ఇవి ఎక్కువగా పండ్లు, విత్తనాలను ఆహారంగా తీసుకుంటాయి. పొద్దుతిరుగుడు పువ్వుల విత్తనాలనైతే చాలా ఇష్టంగా తింటాయి. చాలా వరకు మౌనంగానే ఉంటాయి. వీటికి మాట్లాడే సామర్థ్యం మిగతా చిలుకలతో పోల్చుకుంటే చాలా తక్కువ. కానీ వీటినీ పెంచుకోవచ్చు. ఇవి కూడా మనుషులతో చక్కగా కలిసిపోతాయి.

25 సంవత్సరాల వరకు..  

ఇవి అటవీ ప్రాంతాల్లో ఎంతకాలం జీవిస్తాయో కచ్చితంగా తెలియదు కానీ... పెంపుడు చిలుకలుగా మాత్రం దాదాపు 25 సంవత్సరాల వరకు బతకగలవు. ‘ప్యారట్‌ సొసైటీ ఆఫ్‌ న్యూజిలాండ్‌’ వారి అంచనా ప్రకారం మాత్రం ఈ ఆస్ట్రేలియన్‌ కింగ్‌ ప్యారెట్లు అడవుల్లో 15 సంవత్సరాల వరకు జీవించగలవు. 195 నుంచి 275 గ్రాముల వరకు బరువు తూగుతాయి. ఇవి గుంపులుగా బతుకుతాయి. వీటిలో ఆడ పక్షులు దాదాపు పదిమీటర్ల ఎత్తులో చెట్ల తొర్రల్లో గుడ్లను పెట్టి పొదుగుతాయి. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ ఈ మువ్వన్నెల చిలుకల విశేషాలు. భలే ఉన్నాయి కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు