తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో తలెత్తిన ఒక భూవివాదంలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు బొత్స సందీప్‌ పేరు తెరపైకి వచ్చింది.

Updated : 04 May 2024 11:13 IST

రికార్డులు ఫోర్జరీ అయ్యాయంటున్న బాధితులు
తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో తలెత్తిన ఒక భూవివాదంలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు బొత్స సందీప్‌ పేరు తెరపైకి వచ్చింది. షాబాద్‌ మండలం మాచన్‌పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేశారంటూ ఇ.మహేందర్‌ అలియాస్‌ బొప్పి మహేందర్‌ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ భూమి ప్రస్తుత యజమానుల్లో బొత్స సందీప్‌ ఒకరు కావడం విశేషం. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ భూమి తమ ముత్తాత పోచయ్య పేరుతో ఉందని, ఆయన మృతిచెందగా కుమారులు నిరక్షరాస్యతతో మ్యుటేషన్‌ చేయించుకోలేదన్నారు. 2018లో రైతుబంధు పథకం డీడీ కూడా పోచయ్య పేరుతో వచ్చిందని తెలిపారు.

మ్యుటేషన్‌ కోసం రెవెన్యూ అధికారులను ఆశ్రయించగా సివిల్‌ కోర్టు నుంచి వారసత్వ ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని చెప్పారన్నారు. ఈలోగా వారసుల్లో ఒకరు భాగపరిష్కారం కోసం సివిల్‌ కోర్టును ఆశ్రయించగా సర్వే నం.442లోని 15 ఎకరాల భూమి చేగూరి రమేశ్‌ పేరుతో ఉందని తెలిసిందన్నారు. అతడు సయ్యద్‌ రహీం ఉద్దీన్‌, సయ్యద్‌ ఇంతియాజ్‌ ఉద్దీన్‌లకు విక్రయించగా వాళ్లు మరికొందరికి విక్రయించారని పేర్కొన్నారు. అలా కొన్నవారిలో ఎం.వెంకటసునీల్‌, కె.కృష్ణస్వామి, బొత్స సందీప్‌, మహమ్మద్‌ ఫహీముద్దీన్‌లు ఉన్నారని... వారిని ప్రతివాదులుగా చేర్చినట్లు తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి పోలీసుల వివరణ కోరుతూ విచారణను జూన్‌ 5వ తేదీకి వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని