వైవాహిక స్థితి ఏదైనప్పటికీ... వయోజనులైన ఇద్దరు ఇష్టపడితే నేరం కాదు: హైకోర్టు

వివాహితులైన భార్యాభర్తల మధ్యే శారీరక సంబంధాలు ఉండాలన్నది సమాజం నిర్ణయించుకున్న ఆదర్శ నియమమని దిల్లీ హైకోర్టు తెలిపింది.

Updated : 04 May 2024 05:46 IST

దిల్లీ: వివాహితులైన భార్యాభర్తల మధ్యే శారీరక సంబంధాలు ఉండాలన్నది సమాజం నిర్ణయించుకున్న ఆదర్శ నియమమని దిల్లీ హైకోర్టు తెలిపింది. ఈ నియమం ఎలా ఉన్నప్పటికీ, వారి వైవాహిక స్థితి ఏదైనప్పటికీ పరస్పర అంగీకారంతో అటువంటి సంబంధాన్ని ఇద్దరు వయోజనులు కలిగి ఉన్నట్లయితే దానిని నేరంగా పరిగణించలేమని పేర్కొంది. ఫిర్యాదుదారైన మహిళ...తనను కలుస్తున్న పురుషుడికి అప్పటికే వివాహమైందని తెలిసినా ఆ బంధాన్ని ఇష్టపడి కొనసాగిస్తూ అతడు తనను నమ్మించి మోసం చేశాడని ఆరోపించడంలో అర్థంలేదని జస్టిస్‌ అమిత్‌ మహాజన్‌ స్పష్టం చేశారు. తనను బలవంతపెట్టాడని ఆమె ఫిర్యాదు చేసినా నేరంగా పరిగణనలోకి తీసుకోలేమని అభిప్రాయపడ్డారు. మహిళ ఫిర్యాదు ఆధారంగా అరెస్టైన 34 ఏళ్ల వ్యక్తికి మరో మహిళతో వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో అతనిని ఏడాదికిపైగా జైలులోనే ఉంచడం సరికాదన్నారు. వ్యక్తులను సంస్కరించడంలో భాగంగా ఖైదీగా ఉంచడం ఒక్కటే జైలు ఉపయోగం కాదని, నిందితుడిని సకాలంలో విచారణకు హాజరు పరచాలన్న ఉద్దేశంతోనూ అలా చేస్తారని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని