నేను మీ పాండా చీమనోచ్‌!

హాయ్‌ నేస్తాలూ.. బాగున్నారా! ఏంటి అలా చూస్తున్నారు..నేను ఎవరనా..నేనండీ మీ పాండా చీమను!! పేరుకైతే నన్ను చీమ అంటారు కానీ.. నేను నిజానికి చీమను కాదు. పాండాను అంతకన్నా కాదు

Published : 31 Jan 2024 00:11 IST

హాయ్‌ నేస్తాలూ.. బాగున్నారా! ఏంటి అలా చూస్తున్నారు..నేను ఎవరనా..నేనండీ మీ పాండా చీమను!! పేరుకైతే నన్ను చీమ అంటారు కానీ.. నేను నిజానికి చీమను కాదు. పాండాను అంతకన్నా కాదు. మరింతకీ నేనెవర్నో తెలుసా?! తెలియదు కదూ...! అలా బుంగమూతి పెట్టుకోకండి.. నా సంగతులన్నీ మీతో చెప్పిపోదామనే..ఇదిగో ఇలా వచ్చాను.

నా అసలు పేరు ఎస్పినోలియా మిలిటారిస్‌. పలకడానికి చాలా ఇబ్బందిగా ఉంది కదూ! ఎందుకొచ్చిన తిప్పలు కానీ.. హాయిగా మీరు కూడా పాండా చీమ అని పిలిచేయండి. చీమ అనమన్నాను కదా అని.. నేను నిజంగా పిపీలికాన్నే అనుకునేరు. నిజానికి నేనో కందిరీగను. ‘అయినా నువ్వు కందిరీగవు ఏంటి? నీకు రెక్కలే లేవు?’ అని అంటారేమో..! నిజంగా నిజం ఫ్రెండ్స్‌ నేను కందిరీగ జాతికి చెందిన జీవిని. కానీ మాలో కేవలం మగవాటికే రెక్కలుంటాయి.. ఆడవాటికి ఉండవు. అయినా నమ్మకం లేదా..! అయితే ఓసారి మీ చేతినివ్వండి కుట్టి చూపిస్తా. మీకు తెలుసో.. లేదో.. నేను కుడితే ఆ నొప్పి వర్ణనాతీతం. కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా. అయినా మనం.. మనం.. ఫ్రెండ్స్‌ కదా! మిమ్మల్ని కుట్టనులే!!

చూడ్డానికి అలా ఉన్నానని..

నన్ను మొట్టమొదట 1938లో చిలీలోని అడవుల్లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నేను చూడ్డానికి కాస్త పాండాలా.. తెలుపు, నలుపు మచ్చలతో ఉన్నానని నాకు పాండా చీమ అని నామకరణం చేశారు. నేను ఎనిమిది మిల్లీ మీటర్ల వరకు పొడవు పెరగగలను. మేం చాలా వరకు ఒంటరిగానే జీవిస్తాం. తేనెను ఆహారంగా తీసుకుంటాం. ఇంకా చిన్న చిన్న చీమల్నీ కరకరలాడించేస్తాం. కీటకాల లార్వాలు, ప్యూపాలతోనూ కడుపు నింపుకొంటాం. మాలో మగవి మాత్రం ఎక్కువగా తేనెపైన ఆధారపడతాయి. మేం ముద్దుగా కనిపిస్తాం కానీ.. చాలా ప్రమాదకరం.  

కొన్ని మాత్రమే..

మాలో ఆడ పాండా చీమ సంవత్సరానికి దాదాపు రెండువేల వరకు గుడ్లను పెడతుంది. కానీ వీటిలోంచి వచ్చిన వాటిల్లో చాలా పాండా చీమల్ని యాంట్‌ఈటర్స్‌ తినేస్తాయి. కొన్ని మాత్రమే ప్రాణాలతో మిగులుతాయి. మా జీవిత కాలం కూడా చాలా తక్కువ. మేం కేవలం రెండు సంవత్సరాల వరకే జీవించి ఉంటాం. మీకు మరో విషయం తెలుసా... మమ్మల్ని ‘కౌ కిల్లర్స్‌’ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే.. మేం దాదాపు ఆవు అంత పరిమాణంలో ఉండే జీవుల్ని కూడా మా కాటుతో చంపేయగలం. అందుకే మాకు ఈ పేరూ వచ్చిందన్నమాట. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ మా విశేషాలు. ఇక ఉంటాం మరి.. బై..బై..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని