Story: జగన్నాథం మారిపోయాడు..!

పసులపాలెంలో పెంటయ్య అనే పాల వ్యాపారి ఉండేవాడు. అతనికి దాదాపుగా పది గోవులు ఉండేవి. వేకువజామునే నిద్ర లేచి.. పాలు తీసుకెళ్లి, ఇల్లిల్లూ తిరిగి అమ్మేవాడు

Published : 09 Jun 2024 00:27 IST

పసులపాలెంలో పెంటయ్య అనే పాల వ్యాపారి ఉండేవాడు. అతనికి దాదాపుగా పది గోవులు ఉండేవి. వేకువజామునే నిద్ర లేచి.. పాలు తీసుకెళ్లి, ఇల్లిల్లూ తిరిగి అమ్మేవాడు. అలా చాలా డబ్బులు సంపాదించేవాడు. ఊరి ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినా ఆదుకునేవాడు. పెంటయ్య, ఊరి వారందరికీ తలలో నాలుకలా మారిపోయాడు. ప్రతిరోజూ పాలు అమ్మడం.. పది అవ్వగానే గోవులను మేత కోసం బయటికి తీసుకెళ్లడం అతని దినచర్య. 

పెంటయ్య చిన్ననాటి స్నేహితుడు జగన్నాథం చాలా రోజుల తర్వాత తనని కలవడానికి వచ్చాడు. జగన్నాథం డిగ్రీ వరకు చదివాడు. కొన్ని సంవత్సరాల క్రితమే పట్నం వెళ్లిపోయాడు. అక్కడ రకరకాల వ్యాపారాలు చేశాడు. అప్పుడప్పుడు పండగలకు మాత్రమే ఊరికి వచ్చి, రెండు రోజులు ఉండి వెళ్లిపోయేవాడు. జగన్నాథాన్ని చూడగానే.. ‘ఏరా జగన్నాథం... ఎప్పుడొచ్చావు? ఇప్పుడు ఊర్లో ఏ పండగ లేదు కదా!’ అని సందేహంగా అడిగాడు పెంటయ్య. ‘పట్నంలో ఎంత పని చేసినా సంతృప్తి ఉండట్లేదు. అంతకు మించి ఇంటి వద్ద అమ్మానాన్నలను ఒంటరిగా వదిలేసి వెళ్లడం నాకు ఇబ్బందిగా అనిపిస్తోంది. ఈ వయసులో వారికి పనులు చేసి పెట్టడానికి తోడు కావాలి కదా! అందుకే ఇక్కడే ఉండి.. పాల వ్యాపారం చేద్దామనుకుంటున్నాను’ అని బదులిచ్చాడు జగన్నాథం. ‘సరే జాగ్రత్తగా వ్యాపారం చేసుకో! స్వచ్ఛమైన పాలు అందిస్తే.. కచ్చితంగా నువ్వు వ్యాపారంలో మంచి స్థాయికి చేరుకుంటావు’ అని స్నేహితునికి మర్యాదలు చేశాడు పెంటయ్య. 

అలా కొన్ని రోజుల తర్వాత.. మిత్రుని సాయంతో కొన్ని గోవులను కొనుక్కొచ్చి పశువుల పాకను ఏర్పాటు చేశాడు జగన్నాథం. ఇద్దరు పనివాళ్లను కూడా పెట్టుకున్నాడు. వ్యాపారం గాడిన పడేంత వరకు పెంటయ్య సలహాలు, సూచనలు పాటించాడు జగన్నాథం. రోజులు గడుస్తున్న క్రమంలో.. తన దగ్గరకు పాల కోసం వచ్చే వారితో.. ‘పెంటయ్య, పాలల్లో నీళ్లు ఎక్కువగా కలుపుతాడు. అతను అమ్మేవి అసలు స్వచ్ఛమైన పాలు కాదు. మీరు ఇక్కడికే రండి. చిక్కనైన పాలు నేను మీకు అందిస్తాను’ అని అబద్ధాలు చెప్పేవాడు. కానీ అతనే.. తను అమ్మే పాలలో నాణ్యత పాటించకపోవడం వల్ల.. కొంత కాలానికే వ్యాపారం పడిపోయింది. జనాలు తన వద్దకు రావడమే మానేశారు. ఆ సమయంలో జగన్నాథానికి ఏం చేయాలో అర్థం కాలేదు. ‘ఇలానే ఉంటే గోవులకు మేత వేయడానికి కూడా చాలా కష్టమైపోతుంది. ఈ వ్యాపారాన్ని మానేసి మళ్లీ పట్నానికి వెళ్లాలి’ అని మనసులోనే అనుకుంటూ బాధపడసాగాడు. 

అప్పుడే పెంటయ్య మిత్రుడిని కలవడానికి వచ్చాడు. దిగాలుగా కూర్చున్న జగన్నాథాన్ని చూసి.. ‘మిత్రమా..! ఏంటి అలా విచారంగా ఉన్నావు?’ అని అడిగాడు. ‘ఏం లేదు పెంటయ్యా.. ఈ మధ్య వ్యాపారం సరిగా సాగడం లేదు. మానేసి పట్నానికి వెళ్లిపోదాం అనుకుంటున్నాను’ అని బదులిచ్చి.. అతనికి తాగడానికి పాలు తీసుకొచ్చి ఇచ్చాడు జగన్నాథం. ఆ పాలను తాగిన పెంటయ్యకు వ్యాపారం ఎందుకు సరిగా సాగడం లేదో అర్థమైంది. అప్పుడు.. ‘గోవులకు నువ్వు సరైన మేత పెట్టడం లేదు. అలాగే.. పాలలో ఎక్కువ శాతం నీటిని కలుపుతున్నావు. అదే నీ వ్యాపారం సరిగ్గా సాగకపోవడానికి కారణం. ఒక్కసారి నేను చెప్పినట్లు చేసి చూడు.. తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి’ అని సలహాలు చెప్పాడు పెంటయ్య. అతను చెప్పిన సూచనలు పాటించినప్పటి నుంచి.. మెల్లమెల్లగా జగన్నాథం పాల వ్యాపారం మెరుగుపడింది. కొన్ని రోజుల తర్వాత జగన్నాథం, పెంటయ్య వద్దకు వెళ్లి.. ‘నీకు వ్యాపారం బాగా అవ్వకూడదని.. పాలు కొనడానికి వచ్చిన వాళ్లందరికీ నీ మీద చాడీలు చెప్పాను. కానీ నువ్వు మాత్రం.. నాకు సలహా ఇచ్చి నా వ్యాపారం పెరిగేలా చేశావు. నన్ను క్షమించు మిత్రమా..! ఇంకెప్పుడూ ఇలా ప్రవర్తించను’ అని వేడుకున్నాడు. అతని పొరపాటును మన్నించి.. జగన్నాథంతో ఎప్పటిలాగే కలిసిమెలసి ఉండసాగాడు పెంటయ్య. 
ముక్కామల జానకీరామ్‌ 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని