Monkeys - Merchant: అరరె.. ఇప్పుడెలా..!

ఒక మర్రి చెట్టుపై రెండు కొండముచ్చులు నివాసం ఉండేవి. వాటి పేర్లు అమ్ము, పమ్ము. అవి చాలా స్నేహంతో కలిసిమెలిసి జీవించేవి. ఆ మర్రి చెట్టు ఓ రహదారి పక్కనే ఉండేది.

Updated : 08 Apr 2023 00:56 IST

ఒక మర్రి చెట్టుపై రెండు కొండముచ్చులు నివాసం ఉండేవి. వాటి పేర్లు అమ్ము, పమ్ము. అవి చాలా స్నేహంతో కలిసిమెలిసి జీవించేవి. ఆ మర్రి చెట్టు ఓ రహదారి పక్కనే ఉండేది. దాంతో వివిధ పనుల నిమిత్తం ఆ మార్గంలో రాకపోకలు సాగించే బాటసారులు.. మధ్యాహ్నం ఎండ తీవ్రతకు ఆ చెట్టు కిందకు చేరుకునేవారు. అక్కడే కాసేపు సేదతీరి.. వెంట తెచ్చుకున్న అన్నం తిని ప్రయాణం కొనసాగించేవారు. మిగిలిన ఆహార పదార్థాలను అమ్ము, పమ్ములకు ఇచ్చేవారు. అవి సంతోషంగా తీసుకునేవి.
ఒకరోజు రాత్రి అమ్ము, పమ్ము రోజు మాదిరే చెట్టుపై నిద్రించాయి. ఉదయం ముందుగా నిద్ర లేచిన అమ్ము కిందకు దిగబోయింది. కానీ, దాని శరీరం ముందుకు కదల్లేదు సరికదా.. బరువుగా కూడా అనిపించింది. ‘రోజూ చెట్లపై గంతులేసే నేను ఎందుకు కదల్లేకపోతున్నాను.. ఎందుకు లేవలేకపోతున్నాను.. నాకేమైంది?’ అని మనసులోనే అనుకుంటూ పమ్ము వైపు చూసింది. అది మంచి నిద్రలో ఉంది. దాన్ని లేపటం ఇష్టం లేక, మళ్లీ లేచేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. కారణం తెలుసుకునేందుకు అటూ ఇటూ చూసింది. అంతే... ఒక్కసారిగా గట్టిగా కిచకిచమని అరిచింది. ఆ అరుపునకు పమ్ముకు నిద్రాభంగం కలిగింది. అది కళ్లు తెరిచి చూస్తే.. పక్కనే అమ్ము కనబడింది.

‘ఉదయాన్నే ఎందుకు అలా అరుస్తున్నావు? అడవి తగలబడుతోందా? క్రూరమృగాలు మనల్ని చంపాలని చూస్తున్నాయా? అడవిలోకి వేటగాళ్లు ఎవరైనా వచ్చారా?’ అని కాస్త కోపంగా అడిగింది. ‘అవేం కాదు..’ అని సమాధానమిచ్చింది అమ్ము. ‘మరి ప్రాణాలు పోతున్నట్లు అంత గట్టిగా ఎందుకు అరిచావు? నీతోపాటు నా నిద్ర కూడా చెడగొట్టావు’ అంది పమ్ము. ‘కాస్త ఓపికపట్టు.. ఒక్కసారి నా మాట విని వెనక్కి తిరిగి చూడు’ అని అమ్ము చెప్పడంతో.. పమ్ము లేచి వెనక్కి తిరగబోయింది. కానీ, దాని శరీరమూ కదల్లేదు. బరువుగానూ అనిపించింది. బలాన్నంతా కూడదీసుకొని మరీ ప్రయత్నించినా.. లాభం లేకపోయింది.

తీరా చూస్తే.. ఆ రెండింటి తోకలూ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. దాంతో అమ్ములాగానే పమ్ము కూడా గట్టిగా అరిచింది. రాత్రి నిద్రపోయే ముందు బాగానే ఉన్న తోకలు.. తెల్లారేసరికి ఎలా ముడిపడ్డాయో తెలియక అవి రెండూ తెగ ఆలోచించసాగాయి. ‘ఎలా జరిగింది? ఎవరు చేశారు?’ అని పరస్పరం ప్రశ్నించుకున్నా, సమాధానం రాలేదు. ముడి విప్పాలని రెండూ విశ్వప్రయత్నం చేశాయి. ఆ క్రమంలో ముడి మరింత గట్టిగా బిగుసుకుంది. తోకలు ముడి పడటంతో ఎటు వెళ్లాలన్నా.. వాటికి కష్టంగా మారింది. చెట్టు దిగాలన్నా, ఎక్కాలన్నా, కొమ్మల మీద గెంతాలన్నా.. ఇలా ఏ పని చేయాలన్నా అప్పటినుంచి రెండూ కలిసే చేయాల్సి వచ్చేది.

బాటసారులు ఇచ్చే ఆహార పదార్థాల కోసం కూడా అవి రెండూ, ఒకేసారి చెట్టు దిగాల్సి వచ్చేది. ఆ మార్గంలో రాకపోకలు సాగించే వారు కొండముచ్చుల పరిస్థితి చూసి బాధ పడ్డారు. వాటి తోకల ముడి విప్పాలని చూసినా.. వారికి సాధ్యం కాలేదు. అంతకుముందు దేనికి నిద్ర వస్తే.. అది ఎంచక్కా కొమ్మల మీద కునుకు తీసేది. ఇప్పుడు ముడి కారణంగా ఏ ఒక్కదానికి నిద్రొచ్చినా.. మరొకటి కూడా సహకరించాల్సి వస్తోంది. ఎడ్ల బండిపై ఊరూరూ తిరుగుతూ నూనె విక్రయించే వ్యాపారి ఒకరు పొరుగూరుకు వెళ్తూ.. ఆ చెట్టు కింద ఆగాడు. అతడు ఆహారం తిన్నాక మిగిలిన పదార్థాలను అమ్ము, పమ్ముల కోసం ఉంచాడు. అది గమనించి, చెట్టు పైనుంచి కిందకు వచ్చాయవి. వాటి తోకలు ముడి పడి ఉండటం చూసి ఆ వ్యాపారి ఆశ్చర్యపోయాడు. ఎలా జరిగిందని అడగడంతో.. విషయం చెప్పాయవి.

వాటి పరిస్థితిని చూసిన వ్యాపారికి జాలేసింది. ఎలాగైనా తమ తోకల ముడి విప్పాలని వ్యాపారిని కోరాయి. అతను కాస్త ఆలోచించి.. పొరుగూరుకు వెళ్తున్నాననీ, తిరుగు ప్రయాణంలో సమస్యను పరిష్కరిస్తానని చెప్పాడు. వ్యాపారి మాటలతో అమ్ము, పమ్ము సంతోషపడ్డాయి. పని నిమిత్తం వ్యాపారి ఎండ్లబండిపై వెళ్లిపోయాడు. అమ్ము, పమ్ము అతడి కోసం ఎదురు చూడసాగాయి. చీకటి పడే వేళకు ఆ వ్యాపారి తిరిగి రావటం గమనించి.. అతడికి ఎదురెళ్లాయి. వ్యాపారి ఎండ్ల బండి పైనుంచి ఖాళీ నూనె పీపాను కిందకు దించాడు.

‘ఉదయం వెళ్లేటప్పుడు పీపాలో నూనె నిండుగా ఉంది.. పక్క ఊరిలో మొత్తం విక్రయించి వస్తున్నాను. ఇప్పుడు ఖాళీ అయింది. మీరిద్దరూ అందులోకి దిగండి. పీపా లోపలి అంచులకు ఉన్న నూనె మీ తోకలకు అంటించుకోండి’ అన్నాడు. అవి చెప్పినట్లే చేయడంతో.. సులభంగా వాటి ముడిని విప్పగలిగాడా వ్యాపారి. తమ సమస్య పరిష్కారం కావడంతో అమ్ము, పమ్ము ఆనందంతో గంతులు వేశాయి. వ్యాపారికి కృతజ్ఞతలు చెప్పి చెట్టు పైకి చేరుకున్నాయి.  
తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని