Moral story: ఇద్దరు.. ఇద్దరిలో ఒక్కరు!

జమీందారు భూషయ్య ఇంట్లో దుస్తులు ఉతికి, ఇస్త్రీ చేసే సోమయ్య వృద్ధుడైపోయాడు. దీంతో ఆ ఇంట్లో పని మానుకున్నాడు. సోమయ్య చాలా మంచివాడు, నిజాయతీ పరుడు. పరుల ధనాన్ని, విలువైన వస్తువుల్ని ఏమాత్రం ఆశించని వ్యక్తి. అలాంటి మంచి మనిషి, వయోభారంతో తన వృత్తిని వదులుకోవడం భూషయ్యకు కాస్త బాధనిపించినా, అతడు చేసేదేం లేక మిన్నకుండిపోయాడు. అలాంటి మంచి వ్యక్తి స్థానంలో, మరో మంచి మనిషిని నియమించాలనుకున్నాడు భూషయ్య.

Published : 10 Jun 2024 00:33 IST

మీందారు భూషయ్య ఇంట్లో దుస్తులు ఉతికి, ఇస్త్రీ చేసే సోమయ్య వృద్ధుడైపోయాడు. దీంతో ఆ ఇంట్లో పని మానుకున్నాడు. సోమయ్య చాలా మంచివాడు, నిజాయతీ పరుడు. పరుల ధనాన్ని, విలువైన వస్తువుల్ని ఏమాత్రం ఆశించని వ్యక్తి. అలాంటి మంచి మనిషి, వయోభారంతో తన వృత్తిని వదులుకోవడం భూషయ్యకు కాస్త బాధనిపించినా, అతడు చేసేదేం లేక మిన్నకుండిపోయాడు. అలాంటి మంచి వ్యక్తి స్థానంలో, మరో మంచి మనిషిని నియమించాలనుకున్నాడు భూషయ్య. ఈ విషయం తెలిసి ఆ ఊళ్లో కొంతమంది, ఆ పనిని తమకు ఇప్పించాల్సిందిగా భూషయ్య దగ్గరకు వచ్చారు. కొన్ని పరీక్షల తర్వాత, చివరిగా ఇద్దరు వ్యక్తులు మిగిలారు. కానీ తనకు కావాల్సింది ఒక్కరు మాత్రమే! 

ఆ ఇద్దరిలో ఒకరు రాజయ్య. ఆ ఊళ్లోనే రాజయ్యకు మంచి వ్యక్తి అనే పేరుంది. అలాగే పనిమంతుడు కూడా. ఎలాంటి దుస్తులనైనా చక్కగా ఉతికి ఆరబెట్టి, ఇస్త్రీ చేయడంలో చక్కని నైపుణ్యం కలిగిన వ్యక్తి అని ఆ ఊళ్లో చెప్పుకుంటారు. అందరూ ఎంతో ఇష్టపడే వ్యక్తి రాజయ్య. మరో వ్యక్తి నాగయ్య. అతడు కూడా అంతటి పనిమంతుడే. కానీ భూషయ్యతో సహా ఆ ఊళ్లో ఎవరికీ, అతని గురించి ఎక్కువగా తెలియదు. ఎందుకంటే అతడు ఆ ఊరికి ఈ మధ్యే కొత్తగా వచ్చాడు. 

సరే, ఇద్దరిలో ఒక్కరిని మాత్రమే తను తీసుకోవాలి కనుక, ఆ ఇద్దరికీ తన దుస్తులు చెరొక జత ఇచ్చాడు. వాటిని ఉతికి, ఆరబెట్టి చక్కగా ఇస్త్రీ చేసి తెమ్మన్నాడు భూషయ్య. ఎవరైతే ఈ పనిని తన మనసుకు నచ్చే విధంగా సకాలంలో చేసి తీసుకొస్తారో, వారే తనింట్లో ఆ పనికి అర్హత సాధిస్తారన్నాడు. ఆ వ్యక్తికి చక్కని వసతి, మంచి జీతం, మూడుపూటలా తిండి లభించే కొలువు దక్కుతుందని చెప్పాడు. 

ఇద్దరూ, ‘అలాగే దొరా.. మా పనితనం చూసి మీరు కొలువు ఇప్పించండి’ అని చెప్పి ఆ దుస్తులు పట్టుకొని తమ ఇళ్లకు వెళ్లిపోయారు. రెండు రోజుల్లోనే తాము అందంగా ఉతికి, సిద్ధం చేసిన భూషయ్య గారి దుస్తులు పట్టుకొని ఇద్దరూ ఆయన ఇంటికి వెళ్లారు. అప్పుడు ఆయన ఆ ఊరి తగాదా ఏదో తీర్చే పనిలో ఉన్నాడు. ఇద్దర్నీ కొంత సమయం ఆగమని చెప్పాడు. ఇద్దరూ ఒక పక్కగా నిల్చున్నారు. కాసేపటికి పంచాయితీ ముగిసిపోయింది. భూషయ్య ఇద్దరూ తెచ్చిన తన కండువాలు, పైజామాలు, లాల్చీలు చూశాడు. ఇద్దరూ పోటీ పడి మరీ, శుభ్రంగా వాటిని ఉతికి, చక్కగా ఆరబెట్టి, ఇస్త్రీ చేసి ధగధగా మెరిసేటట్టు చేసి తీసుకొచ్చారు. 

భూషయ్య ఆశ్చర్యపోయాడు. శభాష్‌ అని ఇద్దర్నీ మెచ్చుకున్నాడు. ‘మీ ఇద్దరిలో అత్యద్భుతమైన ప్రతిభ దాగి ఉంది. ఇద్దరూ పనితనంలో ఒకరికొకరు ఏ మాత్రం తీసిపోరు. కానీ నాకు కావాల్సింది ఒక్క వ్యక్తి మాత్రమే! అది ఎవరనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను..’ అని ఒక్క క్షణం ఆగాడు. జనం కూడా... ‘భూషయ్యగారు ఎవర్ని ఎంపిక చేస్తారా?’ అని ఆసక్తిగా చూస్తున్నారు. అందరి మదిలో మెదిలే వ్యక్తి ఒక్కడే. అది రాజయ్య. వ్యక్తిగతంగా మంచివాడు. అందరి తల్లో నాలుకలా ఉండేవాడు. భూషయ్యగారింట్లో కొలువుకు సరి తూగేవాడు అని.. అందరూ అనుకుంటున్నారు.

ఇంతలో భూషయ్య తన ఎంపిక పూర్తి చేశాడు. ఆయన ఎంచుకున్నది నాగయ్యను. జనమంతా ఆశ్చర్యపోయారు. ఇలా ఎందుకు చేశారు? ఏదైనా కారణముందా..? అన్నట్లు భూషయ్య వంక చూశారు. ‘ఈ ఇద్దరూ తమ వృత్తిలో చక్కని నైపుణ్యం చూపించినవారే. ఎవర్నీ తక్కువ చేసి చూడకూడదు. ఇద్దరూ నైపుణ్యం ఉన్నవారే. కానీ ఇదొక్కటే సరిపోదు. నిజాయతీ కూడా చాలా ముఖ్యం. తమ కళ్లముందు ఎంత ధనమున్నా, ఎలాంటి విలువైన వస్తువులున్నా ఆశ, ప్రలోభానికి లొంగని వారై ఉండాలి. అలాంటి గుణాలున్న వ్యక్తి నాకు కావాలి. నేను ఇద్దరికీ ఉతికి తెమ్మని ఇచ్చిన నా దుస్తుల్లో, ఒక్కొక్క బంగారు నాణెం పెట్టి ఇచ్చాను. వాటిల్లో ఒకటి నిన్న సాయంత్రమే తనకు నా దుస్తుల్లో దొరికిందని.. నాగయ్య, నిజాయతీగా తెచ్చి ఇచ్చాడు. కానీ ఇప్పటి వరకు నా రెండో నాణెం నాకు అందలేదు’ అంటూ రాజయ్యకేసి చూశాడు భూషయ్య. రాజయ్య తప్పు చేసి, దొరికిన వాడిలా నేల చూపులు చూస్తుండిపోయాడు. జమీందారి ఆలోచన ప్రకారం భూషయ్యనే సరైన ఎంపికని అందరూ హర్షించారు. తనను మన్నించమని రాజయ్య తర్వాత ప్రాధేయపడ్డాడు. 

నంద త్రినాథరావు  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని