నయా జోష్.. డబ్స్‌మాష్!

ఫేస్‌బుక్ పాతబడిపోయింది.. ట్వీట్లు బోర్ కొట్టేశాయి... వాట్సాప్ జోరు తగ్గింది.. స్మార్ట్‌ఫోన్ చిన్నోళ్లు.. ఆన్‌లైన్ అమ్మాయిల చూపంతా ఇప్పుడు 'డబ్స్‌మాష్'పైనే...

Published : 19 Jan 2016 10:46 IST

నయా జోష్.. డబ్స్‌మాష్!


ఫేస్‌బుక్ పాతబడిపోయింది.. ట్వీట్లు బోర్ కొట్టేశాయి... వాట్సాప్ జోరు తగ్గింది.. స్మార్ట్‌ఫోన్ చిన్నోళ్లు.. ఆన్‌లైన్ అమ్మాయిల చూపంతా ఇప్పుడు 'డబ్స్‌మాష్'పైనే... హిట్ డైలాగ్ ఎంచుకోవడం.. సెల్ఫీవీడియో కలిపి సోషల్ మీడియాకి అనుసంధానించడం... ట్రెండ్ జోరుమీదుంది... ప్యాంట్లు వేస్తున్న కుర్రకారు నుంచి కారులోంచి దిగని తెరవేల్పులదాకా అందరిదీ ఇదేబాట... ఫ్యాషన్లు ఒడిసిపట్టేస్తాం.. ట్రెండ్స్‌కి పట్టా రాసేసుకున్నాం అనుకునే యూత్ ఈ తాజా ధోరణి తెలుసుకోకపోతే ఎలా? పాప్‌క్వీన్ రిహాన్నా పాడితే కుర్ర అభిమానులకు పండగే! ఈమధ్యే 'బిచ్ బెటర్ హ్యావ్ మై మనీ' పేరుతో సింగిల్ విడుదల చేసింది. ఆపై ప్రచారం మొదలెట్టాలిగా. ఎప్పట్లా మీడియాకి లీకులివ్వలేదు. ట్విట్టర్ పేజీలో, యూట్యూబ్‌లో టీజర్లూ వదల్లేదు. ప్రెస్‌మీట్లు పెట్టి నానా హంగామా చేయలేదు. సింపుల్‌గా పదిసెకన్ల వీడియోని డబ్స్‌మాష్‌లో అప్‌లోడ్ చేసేసింది. ఇంకేం.. సంచనలం షురూ!


డబ్స్‌మాష్.. తెనిగిస్తే.. అనుకరణ. కుర్రభాషలో చెబితే వీడియో సెల్ఫీ. వివరంగా చెప్పాలంటే నచ్చిన హిట్ డైలాగు, పాట ఎంచుకొని మొహంలో చిత్రమైన హావభావాలు చూపిస్తూ డైలాగుకి అనుగుణంగా పెదాల్ని కదిలిస్తూ వీడియో తీసి అప్‌లోడ్ చేయడం. తేలిగ్గా, సూటిగా ఉండటంతో ట్రెండ్ అద్దిరిపోతోంది.

దున్నేయండిలా
1. గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ ఐవోఎస్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌తో ఖాతా తెరవాలి.
2. లాగిన్ కాగానే ట్రెండింగ్, డిస్కవర్, మై సౌండ్స్ అనే మూడు విభాగాలు కనిపిస్తాయి. అందులోనూ యాక్షన్, యానిమల్, థ్రిల్లర్, హాలీవుడ్, బాలీవుడ్.. ఇలా నలభై రకాల కేటగిరీలు కనిపిస్తాయి. వాటిలోంచి నచ్చిన సౌండ్ క్లిప్, డైలాగ్ ఎంపిక చేసుకోవాలి.
3. ఎంపిక చేసుకున్న క్లిప్‌కి అనుగుణంగా పెదాలు కదుపుతూ, భావోద్వేగాలు పలికిస్తూ స్మార్ట్‌ఫోన్‌తో వీడియో తీయాలి. వాటికి రంగులు, ఇతర ఎఫెక్టులు జత చేసి వీడియోని స్నేహితులకు పంపొచ్చు. వాట్సాప్, ఫేస్‌బుక్ మెసేంజర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలా ఏ సోషల్‌మీడియాకైనా లింక్ చేయొచ్చు. నిడివి పదిహేను సెకన్లకు మించొద్దు.

ఇందుకే హిట్
పదిహేను సెకన్ల వీడియోలో ఏం చేయొచ్చు? ఈమాటే యూత్‌నడిగితే చాలానే చూపించొచ్చు అంటారు. నచ్చిన హిట్ డైలాగుకి పెదవి కదపొచ్చు. మెచ్చిన పాట పల్లవి అందుకోవచ్చు. జంతువుల అరుపులకు అరువీయొచ్చు. తాజా ట్రెండింగ్ క్లిప్స్ జత చేయొచ్చు. ఏవీ నచ్చకపోతే ఏకంగా సెల్ఫీ వీడియోలు తీసి ముఖాన్ని ముప్పై వంకర్లు తిప్పుతూ క్లిప్‌లను అంతర్జాలంలో వదలొచ్చు. సరదాకి స్కోప్ ఎక్కువ. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. ఒక్క క్లిక్‌తో ప్రపంచానికి కనెక్ట్ అయిపోవచ్చు. మన ప్రతిభని దునియా ముందు కుమ్మరించేయొచ్చు. వీడియో స్నేహితుడికి షేర్ చేయాలా? ప్రపంచం ముందుంచాలా? అన్నది మన ఇష్టం. ఒక్కసారి ట్రెండ్ అందుకున్నామా.. మన మాట మనమే వినం. అంతలా హత్తుకుపోతాం. సరుకు బాగుంటే లైక్‌లు, మెచ్చుకోళ్లు. మనక్కావాల్సిందీ అదేగా! ఇన్ని సానుకూలతలు ఉన్నాయి గనకే అంతర్జాలంలో ముప్ఫైలక్షల యాప్స్‌ని అందుబాటులో ఉన్నా కొన్నాళ్లకే టాప్ పొజిషన్‌కి చేరుకుంది డబ్స్‌మాష్.

ప్రచారానికీ ఇదే
అభిమానులను ఆకట్టుకోవడానికో, తమ టాలెంట్ చూపించుకోడానికో కాదు.. సినిమా ప్రచారానికీ డబ్స్‌మాష్ వేదికే. ప్రియాంకాచోప్రా, రణ్‌వీర్‌సింగ్ 'దిల్ దడ్కనే దో'లో ఒకరి డైలాగులు మరొకరు పలుకుతూ వీడియోలు విడుదల చేశారు. రిచాచద్దా 'గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ 2'లో సహనటుడి డైలాగుల్ని బట్టీ పట్టేసింది. భజరంగీ భాయీజాన్ సల్మాన్ కో-స్టార్ నవాజుద్దీన్ సిద్దిఖీతో చేసిన బ్రొమాన్స్‌ని పంచుకున్నాడు. అక్షయ్‌కుమార్ అయితే ఏకంగా తన 'గబ్బర్ ఈజ్ బ్యాక్'లో నచ్చిన సంభాషణల్ని డబ్స్ చేసి పంపితే విజేతల్ని ఎంపిక చేసి కలుస్తానని బంపర్ ఆఫర్ ప్రకటించాడు. ఇలా యాప్‌ని నచ్చినట్టు ఎడాపెడా వాడేసుకుంటున్నారు.
ఎన్ని సానుకూలతలున్నా ఇక్కడా కొన్ని న్యాయపరమైన చిక్కులున్నాయి. సినిమాల్లోని క్లిప్స్, పాటలు ఎడాపెడా వాడేస్తే కాపీరైట్ తలనొప్పులు తప్పవు. అసభ్య, పోర్న్ సంభాషణలు అప్‌లోడ్ చేస్తే ప్రమాదమే. వీడియోలు ఏవైనా ఒకరికొకరు పంపుకోవడం న్యాయబద్ధమే కానీ ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లాంటి సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటేనే చట్టపరమైన ఇబ్బందులు తప్పవంటాడు మేధోసంపత్తి హక్కుల న్యాయవాది వైల్డ్ బీగర్ సోల్మేకే.  మొదలైన వారంలోనే జర్మనీలో నెంబర్‌వన్ సోషల్‌మీడియా యాప్‌గా నిలిచింది .
 ఇప్పటికి 5.5 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు
 192 దేశాల్లో డబ్స్‌మాష్ వాడుకలో ఉంది
 బ్రిటన్, ఫ్రాన్స్, హాలెండ్‌తో సహా 32 దేశాల్లో డబ్స్‌మాష్ నెంబర్‌వన్
 ఈ యాప్ ఉపయోగిస్తున్నవాళ్లలో ఎనభైశాతం ముప్ఫైఏళ్లు లోపు వారే అంటోంది బీబీసీ ట్రెండింగ్ రిపోర్టు
 టాప్ డబ్స్‌మాష్ వీడియోల్ని www.topdubsmash.com, bestdubsmash.net, bestdubsmash.tumblr.com లలో చూడొచ్చు.
అంతా ఫిదాలే...
హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్.. అంతా డబ్స్‌మాష్‌కి అభిమానులే. జెన్నిఫర్ లోపెజ్, కారా డెలెవింగ్, లీనా డన్హమ్, హ్యూ జాక్‌మన్‌లాంటి హాలీవుడ్ తారలు వెరైటీ డబ్స్‌తో యాప్‌ని ఎక్కడికో తీసుకెళ్లారు. మనోళ్లెతే బెడ్ ఎక్కేలోపు అంతర్జాలంలో ఒక్క వీడియోనైనా వదులుతున్నారు. లేత పరువాల ఆలియభట్ నుంచి దబాంగ్ హీరో సల్మాన్ దాకా ఇప్పటికే ఒక్కొక్కరు నాలుగైదు క్లిప్స్ అప్‌లోడ్ చేసేశారు. సోనాక్షీసిన్హా అయితే మేకప్ వేసుకొని మరీ మేటి డైలాగులు పలికేస్తూ రోజుకో క్లిప్ చేస్తూ డబ్స్‌మాష్ క్వీన్‌గా కిరీటం తొడిగేసుకుంది. ఆలియా పాతకాలపు వాణిజ్య ప్రకటనతో మిమిక్రీ చేస్తే ఇరవై వేల లైకులొచ్చాయి. సానియా భర్త షోయబ్ 'పార్టీ షురూ హుయీ హై' అంటూ సానియాతో స్టెప్పులేస్తూ అంతర్జాలానికి అతికించేశాడు. టాలీవుడ్ హీరోలు రామ్‌చరణ్, రానాలు జట్టుగా 'ఒక్కొక్కర్ని కాదు వందమందిని ఒకేసారి పంపు..' డైలాగుని డబ్స్‌మాష్ చేశారు. బ్యాడ్మింటన్ రాణి సైనానెహ్వాల్ సైతం ఈ సరదా వీడియోకి సై అంది. ఇలా చెప్పుకుంటూ పోతే డబ్స్‌మాష్‌పై మనసు పారేసుకోని సెలెబ్రెటీలే అరుదు. 

మనకూ ఉన్నాయ్
ఎవరో సృష్టించడం.. మనం వాడటం అని ఉసూరుమనకండి. మనకూ తీసిపోనివి ఉన్నాయ్. ఇవిగో.
 డబ్స్‌మాష్‌లా వీడియోల్ని వాట్సాప్, ఫేస్‌బుక్ మెసేంజర్, హైక్, లైన్‌లలో వెల్ఫీ  (Velfie) లో పంచుకోవచ్చు. అంకుశ్ జోహార్, రామ్మోహన్ సుందరం సృష్టికర్తలు. పాపులర్ సినిమాల సంభాషణలు, కోట్స్‌కి మన హావభావాలు జోడించి వీడియోలు తీయొచ్చు. రోజుకు పన్నెండు వేల డౌన్‌లోడ్లు నమోదవుతున్నాయి. భారత్‌తోపాటు బ్రెజిల్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, సౌదీఅరేబియా, టర్కీల్లోనూ టాప్ సోషల్‌మీడియా యాప్‌లో ఒకటిగా నిలుస్తోంది.
frankly.me నెటిజన్లు రాజకీయనాయకులు, క్రీడాకారులు, సెలెబ్రెటీలకు వీడియోల రూపంలో ప్రశ్నలు పంపొచ్చు. సమాధానాలు పొందొచ్చు. నికూజ్ జైన్ ఫౌండర్. ఆమ్ ఆద్మీ పార్టీ మొదలుపెట్టి ఎన్నికలకు వెళ్లినపుడు అరవింద్ కేజ్రీవాల్‌తో సహా ఇతర ఆప్ నేతలంతా నలభైవేల ప్రశ్నలకు జవాలిచ్చారు.
మూడోసారి మురిశారు
యువతని వూపేస్తున్న సృష్టికర్తల గురించి చెప్పుకోకపోతే ఎలా? ఈ పెదాలు కలిపే పేరడీ వీడియోల యాప్ రూపకర్తలు జర్మనీ వాసులు రోలాండ్ గ్రెంకే, జోనాస్ డ్రుప్పల్, డేనియల్ టష్చిక్‌లు. పట్టుమని పాతికేళ్లు దాటని కుర్రాళ్లు. ఎప్పటికైనా ఫేస్‌బుక్‌ని తలదన్నే సోషల్‌మీడియా యాప్ సృష్టించాలనే కసి ఉన్నోళ్లు. అయితే ఈ సూపర్ సక్సెస్ వెనకాల రెండున్నరేళ్ల కష్టముంది. ముగ్గురూ 2013లో 'మొబైల్ మోషన్ జీఎంబీహెచ్' అనే కంపెనీ ప్రారంభించారు. మొదట్లో స్టార్‌లైజ్ అనే మ్యూజిక్ యాప్ తయారు చేశారు. నిలబడలేకపోయింది. తర్వాత 'సౌండ్‌బోర్డ్' తెచ్చారు. ఇందులో ఫీచర్లు బాగున్నా వాడకం కఠినంగా ఉండటంతో ఆకట్టుకోలేకపోయింది. ఈ రెండు అనుభవాల నుంచి ఆరితేరి నవంబరు 2014లో డబ్స్‌మాష్‌కి వూపిరిపోశారు. సక్సెస్ కొట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని