WhatsApp: అలా చేయాలని చెబితే.. భారత్‌ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్‌

WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్‌ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్‌ చేయాలని చెబితే తాము భారత్‌ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది.

Published : 26 Apr 2024 12:40 IST

దిల్లీ: కొత్త ఐటీ నిబంధనలు-2021లోని 4(2) సెక్షన్‌ చట్టబద్ధతను సవాలు చేస్తూ వాట్సప్‌, ఫేస్‌బుక్‌ (ఇప్పుడు మెటా) సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా వాట్సప్‌ (WhatsApp) కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాధ్యమంలో మెసేజ్‌లకు ఉన్న ఎన్‌క్రిప్షన్‌ విధానాన్ని తొలగించాలని చెబితే తాము భారత్‌లో సేవలను నిలిపివేస్తామని వెల్లడించింది.

ఐటీ నిబంధనల్లోని 4(2) సెక్షన్‌.. వ్యక్తుల భావ ప్రకటన స్వేచ్ఛకు, వినియోగదారుల గోప్యత హక్కుకు భంగం కలిగిస్తుందని ఆ సంస్థలు ఆరోపించాయి. ముఖ్యంగా సందేశ సృష్టికర్త జాడను బహిర్గతం చేసే (ట్రేసబిలిటీ) విధానానికి సంబంధించిన నిబంధనను సవరించాలని డిమాండ్‌ చేశాయి. ఈ క్రమంలోనే ఈ సెక్షన్‌ను సవాల్‌ చేస్తూ వాట్సప్‌, ఫేస్‌బుక్‌ సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి.

దీనిపై దిల్లీ హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా వాట్సప్‌ తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. ‘‘మా ప్లాట్‌ఫామ్‌లో సందేశాల భద్రత కోసం ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ (end-to-end encryption) విధానాన్ని అవలంబిస్తున్నారు. ఆ గోప్యత హామీ ఉన్నందువల్లే కోట్లాది మంది యూజర్లు దీన్ని వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఈ రూల్‌తో మేం బలవంతంగా ఆ ఎన్‌క్రిప్షన్‌ను బ్రేక్‌ చేయాల్సి ఉంటుంది. అలా చేయాలని మీరు చెబితే మేం భారత్‌ నుంచి వెళ్లిపోతాం’’ అని కోర్టుకు తెలిపారు.

100% వీవీప్యాట్‌ స్లిప్‌ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం

‘‘ఈ 4(2) సెక్షన్‌ రూల్‌ వ్యక్తుల గోప్యతకు వ్యతిరేకం. రాజ్యాంగ విరుద్ధం. సామాజిక మాధ్యమ సంస్థలతో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే దీన్ని ప్రవేశపెట్టారు. దీని వల్ల మేం కోట్లాది మెసేజ్‌లను కొన్నేళ్ల పాటు భద్రపర్చాల్సి ఉంటుంది. ఇలాంటి నిబంధన ప్రపంచంలో ఎక్కడా లేదు’’ అని వాట్సప్‌ తరఫు కౌన్సిల్‌ వాదించింది. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఆగస్టు 14వ తేదీకి వాయిదా వేసింది.

2021 ఫిబ్రవరిలో కేంద్రం ఈ నూతన ఐటీ నిబంధనలను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌, ట్విటర్‌ (ఎక్స్‌) వంటి సంస్థలు వీటిని తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. అయితే.. వీటిని సామాజిక మాధ్యమ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో పలు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల వీటన్నింటిని సుప్రీంకోర్టు.. దిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని