Travis Head: ట్రావిస్‌ హెడ్‌ బలహీనతను పట్టిన బెంగళూరు..!

ఉప్పల్‌లో హైదరాబాద్‌-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ట్రావిస్‌ హెడ్‌ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్‌ ఫాఫ్‌ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు.

Updated : 26 Apr 2024 12:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హైదరాబాద్‌ తరఫున తొలిసారి ఆడుతున్న ట్రావిస్‌ హెడ్‌ (Travis Head) పెను సంచలనాలకు బెంగళూరు బ్రేకులు వేసింది. అతడిని తొలి ఓవర్‌లోనే పెవిలియన్‌కు పంపి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బతీసింది. హెడ్‌ బలహీనతను జాగ్రత్తగా అధ్యయనం చేసిన బెంగళూరు ఈ సారి వ్యూహాత్మకంగా బౌలింగ్‌లో పావులను కదిపింది. ఆఫ్‌ స్పిన్నర్‌ విల్‌ జాక్స్‌ను అనూహ్యంగా రంగంలోకి దింపి ఫలితం సాధించింది. అతడు వేసిన తొలి ఓవర్‌ చివరి బంతి హెడ్‌ బ్యాట్‌ అంచును తాకి కర్ణ్‌ శర్మ చేతిలోకి వెళ్లడంతో హైదరాబాద్‌ ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.

ఈ ఆస్ట్రేలియా సంచలన బ్యాటర్‌ గణాంకాలను నిశితంగా పరిశీలిస్తే ఓ విషయం స్పష్టంగా తెలుస్తోంది. అతడు స్పిన్నర్లను ఎదుర్కోవడంలో అవస్థలు పడుతున్నట్లు అర్థమవుతోంది. ఈ సీజన్లో అతడు స్పిన్నర్లను ఆడి 15.75 సగటుతో 63 పరుగులు చేశాడు. ఆ సమయంలో స్ట్రైక్‌ రేట్‌ 150. ఇక సీమర్లను ఎదుర్కొని అతడు ఏకంగా 262 పరుగులు సాధించాడు. ఆ సమయంలో కళ్లు చెదిరేలా 236 స్ట్రైక్‌ రేటుతో 87.33 సగటున పరుగులు సాధించాడు. ఓపెనర్‌ కావడంతో సీమర్లకు మూడు సార్లు వికెట్‌ సమర్పించుకున్నా.. వేగంగా వచ్చే బంతులను అద్భుతంగా ఆడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో  బెంగళూరు సారథి ఫాఫ్‌ ఆఫ్‌ బ్రేక్‌ స్పిన్నర్‌ జాక్స్‌ చేతికి బంతిని ఇచ్చి ఆరంభ ఓవర్‌ వేయించి ఫలితం సాధించాడు.

ఈ సిరీస్‌లో హెడ్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. మొత్తం 46.42 సగటుతో 325 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్‌ రేట్‌ 212. వీటిల్లో ఒక శతకం.. రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో టాప్‌ 5లో కొనసాగుతున్నాడు.

2018లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన హెడ్‌ ఆసీస్‌ జట్టులో మంచి మార్కులు కొట్టేశాడు. తొలుత మిడిల్‌ ఆర్డర్‌లో ఆడిన అతడు సీమర్లు, స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటాడనే పేరు తెచ్చుకున్నాడు. కానీ, 2020లో అతడు భారత స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను ఎదుర్కోవడంలో తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. నాడు ఆసీస్‌ మాజీ ఇయాన్‌ ఛాపెల్‌ కూడా హెడ్‌ ఆట తీరును విమర్శించాడు. 2022లో పాకిస్థాన్‌, శ్రీలంక సిరీసుల్లోనూ స్పిన్‌ బౌలింగ్‌లో తడబడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని