మస్తానీ మెరుపుల మతలబులు!

బాజీరావు మస్తానీ వసూళ్లు రికార్డులు బద్ధలు కొడుతున్నాయి. అంతకుమించి మస్తానీ దీపికా పదుకొనే.....

Published : 03 Feb 2016 17:09 IST

మస్తానీ మెరుపుల మతలబులు!

 బాజీరావు మస్తానీ వసూళ్లు రికార్డులు బద్ధలు కొడుతున్నాయి. అంతకుమించి మస్తానీ దీపికా పదుకొనే ధరించిన నగలు, దుస్తులు కుర్రకారు గుండెల్ని పిండేస్తున్నాయి. ఆమె వగల్ని రెట్టింపు చేసిన ఆ వస్త్రాభరణాల తయారీకి పెద్ద కసరత్తే జరిగింది. తన మేనికి వన్నెతెచ్చిన ఆభరణాలు తయారు చేసింది ముంబయిలోని శ్రీహరి డయాజెమ్స్‌. కథకు అనుగుణంగా హిందూ, ముస్లిం సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఈ నగలు ఉండాలని దర్శకుడు భన్సాలీ ముందే డిజైనర్లకు చెప్పేశాడు. మొత్తం పన్నెండు రకాల ఆభరణాలు ఒక్కోటి డిజైన్‌ చేయడానికి మూణ్నెళ్ల సమయం పట్టింది. దాదాపు వందమంది నిపుణులు రాత్రింబవళ్లు కష్టించి పనిచేశారు. మొఘల్‌, మరాఠా కాలం నాటి రోజుల్ని గుర్తుకు తెచ్చేలా మలిచారు. చెవిరింగులు, టిక్కాలు, ఝామర్‌లు, నాథ్‌లు.. ఇలా ప్రతి ఆభరణంలో బర్మా కెంపులు, కొలంబియన్‌ పచ్చలు, మేలిమి వజ్రాలతో కూడిన 200 రాళ్లను 24 క్యారట్ల కుందన్‌లలో పొదిగారు. మస్తానీతోపాటు పీష్వా బాజీరావు, కాశీబాయి పాత్రధారి ప్రియాంకాలు ధరించిన ఆభరణల విలువ అక్షరాలా రూ.మూడుకోట్లు. షూటింగ్‌ జరిగినన్నాళ్లు వీటికి ప్రత్యేక భద్రతతో సెట్‌లోకి తీసుకొచ్చేవారు. 

దుస్తుల తళుకులు: ఇక రాజసం ఉట్టిపడే దీపికా దుస్తులు రూపొందించింది దిల్లీ డిజైనర్‌ అంజూ మోదీ. గతంలో రామ్‌-లీలాకు కూడా తనే దుస్తుల రూపకర్త. ఈ డిజైన్‌ల కోసం చాలానే కసరత్తులే చేసింది అంజూ. ఎంబ్రాయిడరీ అనార్కలీ డిజైన్‌కి తోడు కాటన్‌ కుర్తీ, బ్రోకెడ్‌ దుపట్టాలతో దీపికా కుర్రాళ్ల మనసు దోచేసింది. ఫ్లోరల్‌ మోతిఫ్‌లు, ఇరానియన్‌ ప్రింట్లు మరింత నిండుదనాన్నిచ్చాయి. కృత్రిమ రంగులకు బదులు కూరగాయలు, మొక్కల్లోంచి తీసిన సహజమైన రంగుల్ని ఖాదీ, చండేరీ, మాల్‌మాల్‌ ఫాబ్రిక్‌లకు పులిమారు. ఈ డిజైన్స్‌ కోసం మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాలు, అజంతా, ఎల్లోరా, హైదరాబాద్‌లు సందర్శించింది అంజూ. హైదరాబాద్‌ నిజాం నగలు, రాణులు ధరించిన వస్త్రాభరణాలపై పరిశోధనలు చేసింది. ఇంత కష్టానికి ప్రతిఫలంగా తెరపై ధగధగలాడింది దీపికా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని