ఆత్మీయత వండే యూట్యూబ్‌ ఛానల్‌

వెరైటీ వంటల ఛానళ్లు చాలానే ఉన్నాయ్‌ ‘నవాబ్స్‌ కిచెన్‌’ వాటన్నిటికీ భిన్నం ఎందుకంటే... ఆ కిచెన్‌లో వంటలకి ఆకలి కేకలు తెలుసు! అందుకే ఘుమఘుమలు వెదజల్లుతూ గూడులేని చిన్నారుల్ని వెతుక్కుంటూ వెళ్తాయి ఆత్మీయ పలకరింపుతో ఆకలి తీరుస్తాయి...

Published : 16 Jun 2018 02:04 IST

ఛా‘నల్‌ భీమపాకం’
ఆత్మీయత వండే యూట్యూబ్‌ ఛానల్‌

వెరైటీ వంటల ఛానళ్లు చాలానే ఉన్నాయ్‌ ‘నవాబ్స్‌ కిచెన్‌’ వాటన్నిటికీ భిన్నం ఎందుకంటే... ఆ కిచెన్‌లో వంటలకి  ఆకలి కేకలు తెలుసు! అందుకే ఘుమఘుమలు వెదజల్లుతూ గూడులేని చిన్నారుల్ని వెతుక్కుంటూ వెళ్తాయి. ఆత్మీయ పలకరింపుతో ఆకలి తీరుస్తాయి. అదెలా? శ్రీనాథ్‌రెడ్డి, భగత్‌రెడ్డి, కాజా మొయినుద్దీన్‌లే ఆ వంటలు వండే చేతులు.. ‘నవాబ్స్‌ కిచెన్‌ ఫుడ్‌ ఫర్‌ ఆల్‌ ఆర్ఫాన్స్‌’ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టి వినూత్నంగా ముందుకొచ్చారు. రెండులక్షల మందికి పైనే వీక్షకులకు చేరువయ్యారు. వీరిని ఈ-తరం పలకరించింది..

ముగ్గురివీ వేర్వేరు ప్రాంతాలు.. భిన్న నేపథ్యాలు.. విభిన్న విద్యార్హతలు!  లక్ష్యం, ఆసక్తీ, అభిరుచులు మాత్రం ఒకటే! అందుకే ఉద్యోగాలకు రాజీనామా చేశారు. యూట్యూట్‌లో కొత్త వంటల్ని పరిచయం చేస్తూ.. ఆనాథలకి ఆకలి తీరుస్తున్నారు. ‘నవాబ్స్‌ కిచెన్‌ ఫుడ్‌ ఫర్‌ ఆల్‌ ఆర్ఫాన్స్‌’ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టి రెండులక్షల మందికి పైనే వీక్షకులకు చేరువయ్యారు. సరికొత్తగా  సేవ చేస్తూ.. ఆదాయం పొందుతున్న వీరి గురించి మీకోసం..
సత్తెనపల్లికి చెందిన శ్రీనాథ్‌రెడ్డి, అనంతపురానికి చెందిన భగత్‌రెడ్డి, వరంగల్‌కి చెందిన మొయినుద్దీన్‌.. ఇంతకు ముందు ఎవరికి ఎవరు తెలియదు. వీళ్లు ముగ్గురు గ్రాడ్యుయేషన్‌ చేసి.. ఉద్యోగం కోసం హైదరాబాద్‌ వచ్చారు. ఓ సంస్థలో ఎడిటింగ్‌, కెమెరా డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాల్లో చేరారు. అలా కలిసి పనిచేస్తున్నప్పుడు స్నేహితులయ్యారు. సమాజం కోసం మనం ఏం చేస్తున్నాం అన్నదానికీ వారికి సమాధానం దొరకలేదు. ఉద్యోగానికి రాజీనామా చేశారు.
వీరికి వంటలంటే ఆసక్తి. దాంతోపాటు అనాథాశ్రమాల్లో ఉండే వారికి రకరకాలు ఆహారపదార్థాలు, సరకులు ఇస్తుండేవారు. దాంతో ఈ రెండు అభిరుచులను కలగలిపితే  బాగుంటుందని ఆలోచించారు. అలా ‘నవాబ్స్‌ కిచెన్‌ ఫుడ్‌ ఫర్‌ ఆల్‌ ఆర్ఫాన్స్‌’ యూట్యూబ్‌ ఛానల్‌. కొత్త వంటకాన్ని ఎక్కువ మొత్తంలో చేసి.. దాన్ని అనాథాశ్రమాల్లోని చిన్నారులకు పంచడమే లక్ష్యం. ఇలా వారికి కొత్త రుచులను పరిచయం చేసినట్టు ఉంటుందని భావించారు.   దాదాపు లక్షరూపాయలు పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. ఖర్చులతో పాటు, పనినీ ముగ్గురూ పంచుకున్నారు.

ఆరుబయట వంట: నాలుగు గోడల మధ్య లైట్ల వెలుతురులో వంట చేస్తే ఏం ఉంటుంది. ఆరు బయట పల్లెటూరి నేపథ్యంలో చెట్టు కింద చేస్తే బాగుంటుందని  ఆలోచించారు. హైదరాబాద్‌కు దగ్గరలోని నార్సింగ్‌ పచ్చని చెట్లూ, మొక్కలతో కళకళలాడుతుంటుంది. ఆ వాతావరణంలో వంటలు చేస్తే బాగుంటుందని అనుకున్నారు.  ఈ ముగ్గురిలో మొయినుద్దీన్‌ వంటలు బాగా చేస్తాడు. దాంతో వీడియోలో వంటలు చేసే చెఫ్‌ బాధ్యతలు తనే తీసుకున్నాడు. భగత్‌ వీడియోలు తీస్తాడు. శ్రీనాథ్‌ ఎడిటింగ్‌ చేస్తాడు.  ‘ఎనిమిది నెలల క్రితం..ఎగ్‌ ఫ్రైడ్‌ చేసి ఇరవై అనాథాశ్రమాల్లో  ఉండే చిన్నారులకు వడ్డించాం. ఆ రోజు ఆ పిల్లలు ఎంతో సంతృప్తిగా తిన్నారు. కన్నీళ్లతో నిండిన వాళ్ల కళ్లలో ఆనందం  ఈరోజుకీ గుర్తుంది. మా నంబర్లు తీసుకుని  తరచూ ఫోన్‌ చేస్తుంటారు. అన్నయ్యా అంటూ వరసలు కలిపి ఆప్యాయంగా ఆహ్వానిస్తుంటారు’ అంటూ శ్రీనాథ్‌రెడ్డి ఆనందాన్ని పంచుకున్నారు. వంట వండే  విధానం.. పిల్లలు తింటూ ఆస్వాదిస్తూ.. ఆనందిస్తున్న భావోద్వేగాలనూ కెమెరాలో బంధిస్తారు.

దాతల ఆసక్తి : ఇరవై వీడియోలను సొంత ఖర్చులతో చేశారు. వీటిని చూసి విదేశాల్లో ఉన్నవారు చాలామంది స్పందించారు. పుట్టిన రోజులూ, పెళ్లిరోజులూ, ఇతర సందర్భాలప్పుడు విరాళం ఇచ్చి తమ వంతుగా ఏదో ఒక ప్రత్యేక వంట వండి అనాథలకు పెట్టమని అడగడం మొదలుపెట్టారు. ప్రవాసులూ, విదేశీయులు సైతం స్పందించారు. అలా ఆరునెలల నుంచీ విరాళాలతోనే కొత్త వంటకాలను తయారు చేస్తున్నారు. ఖర్చు గురించి ఏ మాత్రం ఆలోచించరు. ఈ మధ్య లిచీతో జ్యూస్‌ చేశారు. అవి చాలా ఖరీదు అయినా పట్టించుకోలేదు. ఇప్పటి వరకూ 105 వీడియోలు చేశారు.  వారంలో మూడు కచ్చితంగా చేస్తూ... నెలకు పన్నెండు నుంచి పదిహేను వీడియోలు పోస్ట్‌ చేస్తారు.

‘‘ఇది రంజాన్‌ నెల కాబట్టి దాతలు ఎక్కువగా వస్తున్నారు. ఇప్పటి వరకూ మా సబ్‌స్క్రైబర్స్‌ రెండు లక్షల ఏడు వేలు దాటారు. దాంతో మాకు గూగుల్‌ లక్షరూపాయలు అందిస్తుంది. ఆ డబ్బును మేం ముగ్గురం పంచుకుంటాం. అనాథాశ్రమాలకు ఆహారం అందించే ముందు వాళ్ల గురించి ఆరా తీస్తాం. వాళ్ల అభిరుచులూ కనుక్కుంటాం.  అదే విధంగా వంటకం కొత్తగా ఉండేలా చేస్తాం. హైదరాబాద్‌లోనే కాదు.. గుంటూరు, హన్మకొండ, ఇతర ప్రాంతాల్లోనూ చేశాం. మొయినుద్దీన్‌ వంట చేయడానికి ముందే  ఇంట్లో తక్కువ మొత్తంలో ఒకసారి ప్రయత్నిస్తాడు. తయారైన పదార్థాలను రాత్రిపూట పిల్లలకు వడ్డిస్తాం. ఈ మధ్య ఒక చిన్న కుర్రాడు టీ కొట్లో పని చేస్తున్నాడు. ఆ  బాలుడితో మాట్లాడితే తండ్రికి పెరాలసిస్‌ వచ్చిందని, తల్లి పనులు చేయకపోతోందని బాధపడ్డాడు. మేం ముగ్గరం ఆ కుర్రాణ్ని బడికి పంపుతున్నాం. నలభై వేల రూపాయలతో వాళ్లమ్మ చేత ఓ  చిన్న కిరాణా దుకాణం పెట్టించాం.

- పద్మ వడ్డె

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని