తండా కుర్రాడు... విశ్వవేదిక చేరాడు!

మారుమూల తండాలో పుట్టాడు... డబ్బుల్లేక కిలోమీటర్లు నడిచి బడికెళ్లాడు... తిండిలేక పస్తులున్న రోజులున్నా.. చదువులో ఎప్పుడూ ర్యాంకరే... కష్టాలతో సావాసం చేస్తూనే పరిశోధనలో తలమునకలయ్యాడు... నేపథ్యం పేదరికమైనా ప్రఖ్యాత ఎంఐటీ నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక సమ్మేళనానికి ఆహ్వానం అందుకున్నాడు...

Published : 05 Aug 2017 01:50 IST

తండా కుర్రాడు... విశ్వవేదిక చేరాడు!

మారుమూల తండాలో పుట్టాడు... డబ్బుల్లేక కిలోమీటర్లు నడిచి బడికెళ్లాడు... తిండిలేక పస్తులున్న రోజులున్నా.. చదువులో ఎప్పుడూ ర్యాంకరే... కష్టాలతో సావాసం చేస్తూనే పరిశోధనలో తలమునకలయ్యాడు... నేపథ్యం పేదరికమైనా ప్రఖ్యాత ఎంఐటీ నిర్వహిస్తున్న ప్రతిష్ఠాత్మక సమ్మేళనానికి ఆహ్వానం అందుకున్నాడు... ఈ ఘనత దక్కించుకున్న ఒకే ఒక్కడు బానోతు శ్రీనివాస్‌ నాయక్‌... ఈ స్థాయికి చేరడంలో అతడు పడ్డ కష్టం.. ఎదిగిన క్రమం అతడి మాటల్లోనే.
నగామ జిల్లాలోని జఫర్‌గఢ్‌ ఏబీ తండాలో పుట్టిపెరిగాణ్నేను. మారుమూల ప్రాంతం నుంచి వచ్చి మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) నుంచి పిలుపు అందుకుంటానని వూహించలేదు.
అవకాశమిలా
ఎంఐటీలో చదవడం.. ఈ విద్యాసంస్థలో పరిశోధనలు చేయడం చాలామంది కల. ఇందులో ప్రవేశం పొందడం సామాన్యమైన విషయేం కాదు. ఇక్కడ పరిశోధనలకు కేటాయించే మొత్తం మనదేశంలో ఒక్కో రాష్ట్ర బడ్జెట్‌కి సమానం. ఈ విశ్వవిద్యాలయం నుంచి వందల మంది పరిశోధకులు తయారయ్యారు. పదుల మంది నోబెల్‌ బహుమతి అందుకున్నారు. ఏదో ఒక అంశంపై తరచూ ప్రపంచస్థాయి సమ్మేళనాలు జరుగుతూనే ఉంటాయి. ఈసారి కూడా ‘అండర్‌వాటర్‌ వెహికిల్స్‌’పై ఆగస్టు ఒకటి, రెండు తేదీల్లో సమ్మేళనం జరిగింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రెజిల్‌లు సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహించాయి. సముద్ర అంతర్భాగంలో మినరల్స్‌ జాడ కనుక్కోవడం.. అరుదైన జీవజాలం ఉనికి, మనుగడలకు సంబంధించి పరిశోధనలు చేయడానికి సబ్‌మెరీన్‌లాంటి చిన్నచిన్న వాహనాల రూపకల్పనపై చర్చించడం ఈ సమ్మేళనం ఉద్దేశం. ప్రఖ్యాత పరిశోధకులు, మేటి విశ్వవిద్యాలయాల్లోని ప్రొఫెసర్లు, కంపెనీల అధిపతులు, కొద్దిమంది పరిశోధక విద్యార్థులు.. మొత్తం ఎనభైమంది పాల్గొన్నారు. వారిలో నేనూ ఉండటం అరుదైన అవకాశం. సముద్ర అంతర్భాగాల్లో ప్రయాణం చేసే వాహనాల్ని తేలికైన బరువుతో రూపొందించడం.. వాటికి నానో టెక్నాలజీ.. అడ్వాన్స్డ్‌ నావిగేషన్‌ పద్ధతులు ఉపయోగించడంపై చర్చించా. నా ఆలోచనలు చాలామందికి నచ్చాయి. పరిశోధనకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. గతంలో నేను చేసిన పరిశోధనలు, స్కైప్‌ ద్వారా గంటపాటు నిర్వహించిన ముఖాముఖి ఆధారంగా ఎంపికయ్యాను.
ఆటంకాలు దాటి..
ఎన్నో అవాంతరాలు, కష్టాలు దాటితేగానీ నేనీ స్థాయికి చేరలేకపోయా. జఫర్‌గఢ్‌ దగ్గర్లోని ఏబీ తండా మాది. ఆటోలో వెళ్లడానికి డబ్బుల్లేక మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే బడికి రోజూ నడుచుకుంటూ వెళ్లొచ్చేవాణ్ని. ఉన్న కొద్దిపాటి పొలమే మా ఆస్తి. బాగా చదివితేనే బాగుపడతారు అనేవారు నాన్న. అన్నయ్య యఖిల్‌చంద్‌ చదువుల్లో మేటి. తనకి ఐటీడీఏ ద్వారా హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో సీటొచ్చింది. అప్పట్నుంచి తనే మార్గదర్శిలా మారాడు. నేనూ మొదట్నుంచీ స్కూల్‌ఫస్టే. టెన్త్‌లో మండలంలో మూడోర్యాంక్‌ సాధించా. ఓ కార్పొరేట్‌ కళాశాల ఇంటర్లో ఉచితంగా సీటిచ్చింది. అదేసమయంలో నాన్న అకస్మాత్తుగా చనిపోయారు. దహనసంస్కారాలకూ డబ్బుల్లేని దుస్థితి. పైగా రూ.డెబ్భైవేల అప్పు మీద పడింది. బంధువులెవరూ ఆదరించలేదు. తినడానికి సైతం తిండి ఉండేది కాదు. నాన్న లేకపోవడం మా జీవితాలకు పెద్ద లోటుగా మారింది. అమ్మకి తోడుండాలని ఇంటికి తిరిగొచ్చా. పూట గడవడానికి అమ్మ చిన్న కిరాణా కొట్టు నడిపేది. తను పస్తులుండి నాకు అన్నం పెట్టేది. నా చదువు ఆగిపోయిన విషయం తెలుసుకొని మంచి మనసున్న ఓ ప్రిన్సిపల్‌ నా కెరీర్‌ పాడవకూడదని ఆయన కాలేజీలో సీటిచ్చారు. టాపర్‌గా ఇంటర్‌ పూర్తి చేశా. ఏఐఈఈఈ రాస్తే ఎన్‌ఐటీ నాగపుర్‌లో సీటొచ్చింది. దూరమని వెళ్లలేదు. మళ్లీ ఏడాది ప్రిపేరైతే ఈసారి ఏకంగా ఐఐటీ మద్రాసులో సీటొచ్చింది. నావల్‌ ఆర్కిటెక్చర్‌ బీటెక్‌లో చేరాను. అప్పటికీ మా కష్టాలు తీరకపోవడంతో కేవలం రెండు జతల దుస్తులతోనే సర్దుకుపోయేవాణ్ని. ఈలోపు అన్నయ్య ఐఆర్‌ఎస్‌కి ఎంపిక కావడంతో మా పరిస్థితి మెరుగైంది. ఆపై ఐఐటీ మద్రాసులోనే ఓషియన్‌ ఇంజినీరింగ్‌లో పీజీ పూర్తి చేశా.

పరిశోధనపై మమకారం
ఓసారి మా విశ్వవిద్యాలయంలో ‘పునరుత్పాదక శక్తి’ మీద ఓ సదస్సు జరిగింది. పెద్దపెద్ద శాస్త్రవేత్తలంతా హాజరయ్యారు. ఈ రంగంపై విస్తృత పరిశోధనలు చేయాల్సిన అవసరం గురించి చెప్పారు. ఆ మాట నాలో ఆలోచన రేకెత్తించింది. ఎంటెక్‌ తర్వాత సివిల్స్‌ ప్రయత్నించాలనుకున్న నా మనసు మారింది. దేశానికి ఉపయోగపడే పరిశోధనల వైపు వెళ్లాలని డిసైడయ్యా. పవనశక్తిపై ప్రైవేటుగా ఓ కోర్సు చేశా. గతంలో ఫ్లోరిడా అట్లాంటిస్‌ యూనివర్సిటీలో పనిచేసి ఇక్కడికొచ్చిన ప్రొఫెసర్‌ రిఫర్‌ చేయడంతో ఎంటెక్‌ రీసెర్చ్‌ ఇంటర్న్‌షిప్‌ కోసం ఫ్లోరిడా వెళ్లి గ్లోబల్‌ వార్మింగ్‌ మీద ప్రాజెక్ట్‌వర్క్‌ చేశా. సముద్రాల్లోని జీవులు విడుదల చేసే కార్బన్‌డై ఆక్సైడ్‌.. మనుషులు, ఇతర వాహకనౌకల ద్వారా వెలువడే కాలుష్యాలు కొన్ని రసాయన చర్యల అనంతరం సముద్ర అంతర్భాగంలో రాళ్లు, కొండల్లా ఏర్పడతాయి. అయితే ఇది దీర్ఘకాలిక చర్య. కానీ కలుషితాలు ఎక్కువవడంతో పరిస్థితి సమతౌల్యత దెబ్బతిని గ్లోబల్‌వార్మింగ్‌కి కారణమవుతోంది. దీంతో రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వంద దీవులు కనుమరుగవుతాయి. భారత్‌లో సైతం కొన్ని ప్రాంతాలు మునిగిపోతాయి. దీన్నే ఒక పరిశోధక నివేదికగా రూపొందించాను. తర్వాత హైడ్రో కైనెటిక్‌ ఎనర్జీపై పరిశోధన చేశాను. అక్కడ నాకు గైడ్‌గా వ్యవహరించిన ప్రొఫెసర్‌ నాకు తెలియకుండానే ఈ వివరాలన్నీ ఎంఐటీకి పంపించారు. దాంతో వాళ్లు ఏడాదిపాటు పరిశోధక కోర్సు చేయడానికి అనుమతించారు. అయితే మెరైన్‌ రిన్యూయేబుల్‌ ఎనర్జీ మీద పూర్తిస్థాయిలో పీహెచ్‌డీ చేయడం కోసం ఆ అవకాశం వదులుకున్నా. నా పరిశోధనలు, ఆసక్తి, ఇంటర్వ్యూ ఆధారంగానే తర్వాత ప్రతిష్ఠాత్మక సెమినార్‌కి పిలుపందింది.

కనీస సదుపాయాలు కూడా లేని స్థితిలోంచి వచ్చిన నేను ప్రపంచస్థాయి విద్యాసంస్థ ఆహ్వానం అందుకున్నా. కష్టపడితే నాలాంటి పేద, తండాల్లోని యువతరం సైతం ఏదైనా సాధించగలరు అనడానికి నేనే ఒక ఉదాహరణ.

- సహకారం: జి.పాండురంగశర్మ, ఈనాడు, వరంగల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు