ఇంటర్‌ దాటని ఇంటర్‌నెట్‌ గురు

కటౌట్‌ లేకున్నా ఫర్లేదు కంటెంట్‌ ఉంటే చాలు.. యూట్యూబ్‌ దునియాలో దున్నేయచ్చు. తెలంగాణలోని రామగుండం...

Published : 06 Jan 2018 02:21 IST

స్ఫూర్తి ఛానల్‌
ఇంటర్‌ దాటని ఇంటర్‌నెట్‌ గురు

తెలుగు టెక్ ట్యూట్స్‌
వీడియోల సంఖ్య : 2,300
స‌బ్‌స్క్రైబ‌ర్స్ సంఖ్య‌: 5,17,000
వీక్ష‌ణ‌ల సంఖ్య : 5,01,75,128

కటౌట్‌ లేకున్నా ఫర్లేదు కంటెంట్‌ ఉంటే చాలు.. యూట్యూబ్‌ దునియాలో దున్నేయచ్చు. తెలంగాణలోని రామగుండం ప్రాంతం (యైటింక్లయిన్‌ కాలనీ)లో ఉండే హఫీజ్‌కు సరిగ్గా ఈ మాటలు సరిపోతాయి. ఇంటర్మీడియట్‌తో చదువు ఆపేసిన కుర్రాడు తెలుగు టెక్‌ ప్రపంచంలో ఐదులక్షలకి పైగా సబ్‌స్కైబర్స్‌తో దూసుకెళ్తున్నాడు. ఇటీవలే ‘నంబర్‌వన్‌ తెలుగు టెక్‌ కంటెంట్‌ క్రియేటర్‌’ అవార్డు అందుకొని తెలుగు కుర్రాళ్ల సత్తా చాటాడు. ఈ క్రెడిట్‌ అంతా యూట్యూబ్‌లో వీడియో చూసినంత సులువుగా.. ఫేస్‌బుక్‌లో లైక్‌ కొట్టినంత హాయిగా రాలేదా కుర్రోడికి. ఆ కష్టం... ఆ తపన... ఆ విజయం గురించి... అతని మాటల్లోనే...
ఇంటర్మీడియేట్‌లో చదువు ఆపేసిన నేను పేపర్‌బాయ్‌గా, ఎస్టీడీబూత్‌లో పనిచేశాను. అక్కడనుంచి ఓ కంప్యూటర్‌ శిక్షణాసంస్థలో ఐదువందల జీతానికి పనిలో చేరాను. కంప్యూటర్స్‌ను చూసుకునే బాధ్యత నాదే. ఖాళీ సమయంలో ఎమ్‌.ఎస్‌.ఆఫీస్‌, ఎమ్‌ఎస్‌డాస్‌ నేర్చుకున్నాను. నేర్చుకున్న అంశాలను మిగతా శిక్షణార్థులకు అర్థమయ్యే విధంగా చెప్పేవాణ్ని. ఇది గమనించిన మరో శిక్షణాసంస్థ పిలిచి మరీ ఫ్యాకల్టీగా ఉద్యోగం ఇచ్చింది. ఐదు నెలల్లోనే ట్యూటర్‌గా నిలదొక్కుకున్నాను. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడమనే ఆసక్తే నన్ను నడిపించింది.
అలా యూట్యూబ్‌లో పాపులర్‌..
2012లో ఇంటర్నెట్‌ వూళ్లొకి వచ్చింది. గూగుల్‌లో ‘హౌ టు లెర్న్‌ టాలీ’ అని టైప్‌ చేసి టాలీ నేర్చుకున్నాను. అలానే ‘సి’ లాంగ్వేజ్‌. ఓ రోజు అడ్వాన్స్‌ ఎక్స్‌ఎల్‌ వీడియోలకోసం యూట్యూబ్‌లో వెతికితే.. ఒక్కటే కనిపించింది. దీంతో కంప్యూటర్‌ కోర్సులపై వీడియోలు చేస్తే బావుందనుకున్నా. స్క్రీన్‌రికార్డింగ్‌ సాఫ్ట్‌వేర్‌ నేర్చుకుని వీడియోలు యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశా. నాలుగునెలల్లో వందమంది సబ్‌స్క్రయిబర్స్‌ వచ్చారు. ఫొటోషాప్‌లో తెలుగు టైప్‌ చేయటమెలా? యాంటీవైరస్‌ను ఎలా కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి? ఆన్‌లైన్‌లో డ్రైవింగ్‌ లైసెన్స్‌ దరఖాస్తు చేయటం.. ఆధార్‌కార్డులో పేరు మార్పు చేయటంలాంటి ఉపయోగకరమైనవి చెప్పేవాడిని. నెలకు ఆరువేలు వచ్చేవి. 4 జీ విప్లవంతో ‘మొబైల్‌ సీక్రెట్‌ సెట్టింగ్‌ టిప్స్‌’ వీడియో వైరలైంది. రెండు నెలల్లో ఇరవై లక్షల మంది చూశారు. దీంతో ఐదువేలుండే ఛానల్‌ సబ్‌స్రైబర్స్‌ సంఖ్య.. చూస్తుండగానే లక్ష దాటింది. ‘తెలుగులో లక్ష సబ్‌స్క్రయిబర్స్‌ ఫీట్‌ సాధించిన తొలి టెక్‌ ఛానెల్‌ నాదే. ఈ ఫీట్‌కి యూట్యూబ్‌ 2017 ఫిబ్రవరిలో సిల్వర్‌ ప్లేట్‌ బటన్‌ పంపించింది. అప్పట్లో నెలకు లక్షన్నర ఆదాయం వచ్చేది. ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌కు ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?.. లాంటి ఎన్నో ఉపయోగకరమైన వీడియోలు చేశాను. క్లిష్టంగా ఉండే ‘సి’ లాంగ్వేజ్‌ని విద్యార్థులకోసం సరళంగా చెప్పే పాఠాలు నా ఛానల్‌ కన్పిస్తాయి.
అదే నా కల..
‘ఆరేళ్ల క్రితం ఎక్కువ గంటలపాటు కంప్యూటర్‌ కోర్సులను సాధన చేసేవాడ్ని. అది చూసి నవ్విన వాళ్లున్నారు. దుస్తులు సరిగా ఉండవని.. నువ్వు మా పెళ్లికి రావద్దన్న బంధువులూ ఉన్నారు. నాలాంటి పేద వాడికి యూట్యూబ్‌ ఆసరా ఇచ్చింది. ఆదుకుంది. నెట్టింట్లో గూగులమ్మ నా గురువు. ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లల దగ్గరికి వెళ్లి నెట్‌లో చురుగ్గా ఉండటం ఎలాగో తెలియజేయాలనేదే నా కల.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని