వీరిదో కొత్త బంగారు లోకం

వాళ్లో నలుగురు... జంట నెలవంకలుండే నింగినేమో వారు కోరుకునేది... ఆ వెండి వెన్నెల్లోనే దేశం కలలు పండాలనుకుంటున్నారేమో... ఎందుకంటే వారు కోరుకునేదో కొత్త బంగారు లోకం... ‘మేక్‌ ద వరల్డ్‌ వండర్‌ఫుల్‌’ నినాదంతో దాన్ని నిజం చేస్తున్నారు... ఆ ప్రపంచంలో అందరూ ఒకరి కోసం మరొకరుగా మెలుగుతారు... విభేదాలు లేని విలువలెరిగిన కొత్త జనరేషన్‌గా రూపుదిద్దుకుంటారు...

Published : 12 May 2018 01:50 IST

మిలీనియల్‌ మంత్ర
వీరిదో కొత్త బంగారు లోకం

వాళ్లో నలుగురు... జంట నెలవంకలుండే నింగినేమో వారు కోరుకునేది... ఆ వెండి వెన్నెల్లోనే దేశం కలలు పండాలనుకుంటున్నారేమో... ఎందుకంటే వారు కోరుకునేదో కొత్త బంగారు లోకం... ‘మేక్‌ ద వరల్డ్‌ వండర్‌ఫుల్‌’ నినాదంతో దాన్ని నిజం చేస్తున్నారు... ఆ ప్రపంచంలో అందరూ ఒకరి కోసం మరొకరుగా మెలుగుతారు... విభేదాలు లేని విలువలెరిగిన కొత్త జనరేషన్‌గా రూపుదిద్దుకుంటారు... ఇంతలా మరో ప్రపంచం కోసం ముందుకు రావడం అంటే... ఎంత వయసుండాలి? ఇంకెంత అనుభవం ఉండాలి? కానీ, వీరి వయసెంతంటే... ఇరవైలు నిండని అరవైలంత! అనుభవం ఎంతంటే... డిగ్రీల కందని పీహెచ్‌డీలంత! అతి చిన్న వయసులోనే అంత పెద్ద కల కనడంలో వెనకున్న ఆలోచనల్నీ...  ఆచరణతో అవి ఇస్తున్న ఫలితాన్నీ ‘ఈతరం’తో పంచుకున్నారు...  సౌమ్య.. ఖ్యాతి.. మేఘన.. ప్రణీతపద్నాలుగేళ్ల అమ్మాయి గ్యాడ్జెట్‌లు... ఐమ్యాక్స్‌లో షోలు... గప్‌చుప్‌లు అడిగితే అదేం భాగ్యంలే అంటూ ఎప్పుడోకప్పుడు ఇప్పిస్తారు. దాంతో పాటు అడక్కపోయినా ఎప్పటికప్పుడు ఎన్నో జాగ్రత్తలూ చెబుతారు. కానీ, మేఘన ఇల్లు, పెంపకం దీనికి భిన్నం. చిన్నప్పటి నుంచి అమ్మ చెప్పిన బెడ్‌టైమ్‌ స్టోరీస్‌ వింటూ పెరిగింది. ఆ కథల్లోని పాత్రలకీ... నిజ జీవితంలో ఎదురైన మనుషులకీ పొంతన లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఆలోచనలో పడింది. తనేం చేయాలో నిర్ణయించుకుంది. పద్నాలుగేళ్ల వయసులోనే ప్రపంచాన్ని అందంగా చూడాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇంట్లో వాళ్లతో తనేం చేయాలనుకునేది వివరించింది. విలువలు నేర్పిన అమ్మా, నాన్న వెన్నుతట్టారు. ఇలా భిన్నమైన ఆలోచనలతో బెటర్‌ వరల్డ్‌ కోసం ముందుకొచ్చే యువతని వెన్నుతడుతున్న ‘ఐబీ హబ్స్‌’ మేఘన ఆలోచనల్ని సాన పెట్టేందుకు తోడ్పడింది. అందుకు తగిన శిక్షణ, టెక్నికల్‌ సపోర్ట్‌ను అందించింది. ఐబీ హబ్స్‌ శిక్షణలో భాగంగానే ఖ్యాతి, సౌమ్య, ప్రణీత తోడయ్యారు. టీమ్‌గా కలిసి పని చేశారు. ‘మేక్‌ ద వరల్డ్‌ వండర్‌ఫుల్‌’ ప్రాజెక్టుని సిద్ధం చేశారు. హైదరాబాద్‌లోని మేడ్చెల్‌లో స్వచ్ఛంద సంస్థని ప్రారంభించారు. 50 మందికి పైనే పిల్లలకు అన్నీ తామై ఈ మిలీనియల్స్‌ ఓ కొత్త జనరేషన్‌ను తీర్చిదిద్దుతున్నారు. వారిలో ఆరేళ్ల వయసు నుంచి పదహారేళ్ల టీనేజర్లు కూడా ఉన్నారు. అక్కడి చదువుల సిలబస్‌ వేరు... తరగతుల తీరు వేరు... మానసిక పరిపక్వత వేరు. అక్కడ ఎవ్వరిలోనూ నాదీ.. నీదీ అనే భావన కనిపించదు.     మనదీ.. మనందరిదీ అన్నతీరే. ‘ఇది మేం వేసిన తొలి అడుగు మాత్రమే. 2023కల్లా దేశ  వ్యాప్తంగా 2,500 సెంటర్లతో విస్తరించాలనుకుంటున్నాం’ అని ఈ నలుగురు చెబుతున్నారు. 


ప్రపంచంతో అనుసంధానం

నేర్చుకున్న స్కిల్‌ని ప్రదర్శించడంలోనే గుర్తింపు వస్తుంది. గుర్తింపు ఉత్సాహాన్నిస్తుంది. హోమ్‌లో పిల్లలకు యోగా, కుంగ్‌ఫూ, ఇతర స్పోర్ట్స్‌ని నేర్పుతాం. నగరంలో జరిగే పోటీలకు పంపుతాం. దీంతో పిల్లలు బయటి ప్రపంచంతో కనెక్ట్‌ అవడం మొదలువుతుంది. ఇక్కడే మేము హోమ్‌లో చెప్పే విద్యాబుద్ధులు, విలువలు ఎలా పాటిస్తున్నారో పరిశీలిస్తాం. ఈ మధ్యే పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లేప్పుడు రైల్వే స్టేషన్‌లో పిల్లల్ని పరిశీలించాం. అదేంటంటే... స్టేషన్‌లో చిన్న బోర్డుపై ఇలా రాసుంది. ‘స్టేషన్‌లో మీరేదైనా రిపేర్‌ని గమనిస్తే స్టేషన్‌ మాస్టర్‌కి తెలుపగలరు’ అని. దాన్ని పిల్లలు చూశారు. వెళ్తుండగా ఒకచోట పైపు నుంచి నీళ్లు పోవడాన్ని గమనించారు. వెంటనే స్టేషన్‌ మాస్టర్‌ దగ్గరికి వెళ్లి తెలిపారు. అటుగా చాలా మందే వెళ్తున్నారుగానీ.. ఎవ్వరూ ఆ విషయాన్ని పట్టించుకోలేదు. పిల్లలు ఇలా చేయడం స్టేషన్‌ మాస్టర్‌ దృష్టిని ఆకర్షించింది. తగిన చర్యలు తీసుకున్నారు. కృతజ్ఞతలు తెలుపుతూ పిల్లలు మాస్టరుకి ఉత్తరం రాశారు. ఆయన పిల్లలకు పంచిన బిస్కెట్‌లకు కూడా థ్యాంక్స్‌ తెలిపారు లెటర్‌లో... అదీ మొత్తం ‘మేక్‌ ద వరల్డ్‌ వండర్‌ఫుల్‌’ హోమ్‌ తరుపున. దీంతో మేం కోరుకునే కొత్త బంగారు లోకాన్ని ఆవిష్కరించడం పెద్ద కష్టమేం కాదు అనిపించింది.

- సౌమ్య కాటూరి

పలు దృష్టికోణాల్లో చూడాలి

ప్రస్తుతం హోమ్‌లో రెండు రకాల ప్రోగ్రామ్స్‌ని అమలు చేస్తున్నాం. ‘పెర్సెప్షన్‌, చైల్డ్‌ అడాప్షన్‌’. జీవితంపై సరైన అవగాహన కల్పించడం పెర్సెప్షన్‌ ప్రొగ్రామ్‌ ముఖ్య ఉద్దేశం. పిల్లలు ఎదుగుతున్న క్రమంలో లైఫ్‌ని పలు దృష్టికోణాల్లో చూడడం ద్వారా వారి మనసుల్లో విశాలత్వం పెరుగుతుంది. దీంతో మనసులో ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావుండదు. ఈ రకమైన ఆలోచనా శక్తిని పిల్లల్లో పెంపొందించేందుకు చాలా మంది నిపుణులతో చర్చించి ఒక పాఠ్యాంశంగా పెర్సెప్షన్స్‌ని బోధిస్తున్నాం. ఉదాహరణకు వారంలో ఒక రోజు పిల్లల్ని గ్రూపులుగా చేసి నాటక ప్రదర్శన ఏర్పాటు చేస్తాం. చిన్న కథాంశాన్ని తీసుకుని వారే నటించి చూపించాలి. అయితే, ఒకే కథని పలు రకాలుగా ప్రదర్శించాలి. కథలోని క్యారెక్టర్‌ ఆలోచన.. స్వభావాన్ని అర్థం చేసుకుని నటించాలి. క్యారెక్టర్లు మారుతున్న కొద్దీ పిల్లలు ఆయా క్యారెక్టర్ల దృష్టికోణాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీంతో వారి ఆలోచనలో విశాలత్వం మొదలవుతుంది. ఎంతలా అంటే... హోమ్‌లో చిన్న పాపకి వాళ్ల ఆంటీ వచ్చినప్పుడు ఒక బిస్కెట్‌ ప్యాకట్‌ ఇవ్వబోయింది. పాప వద్దంది. ఎందుకని అడిగితే... నేను తీసుకోవాలంటే హోమ్‌లో వాళ్లందరికీ ఇవ్వాలంది.

- సాయి ఖ్యాతి చోడగిరి

మాది ఒక్కటే లక్ష్యం

చదువు, లక్ష్యం సమాంతరంగా కొనసాగాలనుకున్నాం. ఇంటర్‌ నుంచి దూరవిద్యలోనే చదువుతున్నాం. నలుగురం ఇప్పుడు బీబీఏ సెకండ్‌ ఇయర్‌. దీంతో సంస్థలో ఎక్కువ సమయం గడిపేందుకు వీలుంటుంది. ఖ్యాతీ, నేను ఇక్కడి వారమే. తనది హైదరాబాద్‌. నాది అనంతపూర్‌ దగ్గర గుంతకల్‌. ప్రణీత, సౌమ్య ఇద్దరూ అమెరికా నుంచి వచ్చారు. అక్కడే పుట్టి పెరిగారు. వాళ్ల ముగ్గురికీ నాలాంటి ఆలోచనలే ఉండడంతో ఐబీ హబ్‌ ద్వారా నలుగురం ఒక్కటయ్యాం. మాకున్నది ఒక్కటే లక్ష్యం. చదువుతో పాటు పిల్లల్లో చక్కని సామరస్య పూర్వకమైన వాతావరణాన్ని వచ్చేలా చూడడం. దీంతో చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన... మేం ఊహించుకున్న అందమైన ప్రపంచాన్ని ఆవిష్కరించడం పెద్ద కష్టమేం కాలేదు. అందుకు తగిన ‘సిలబస్‌, యాక్టివిటీస్‌’ అన్నీ మేమే క్రియేట్‌ చేస్తాం! ఏదైతే మార్పుని మేము కోరుతున్నామో అందుకు తగినట్టుగానే పిల్లలకు సిలబస్‌ని తీర్చిదిద్దాం. స్టడీ స్కిల్స్‌తో పాటు లైఫ్‌ స్కిల్స్‌ సమాంతరంగా ఉండాలనేది మా అభిప్రాయం. ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌’లో (ఎన్‌ఐఓఎస్‌) పిల్లల చదువులు కొనసాగేలా చూస్తాం. ఎందుకంటే మొదట్నుంచి వారి ఆసక్తుల్ని గమనించే వారికి తగిన పాఠ్యాశాల్ని సెలెక్ట్‌ చేసుకుని చక్కని ప్రతిభ కనబరచడానికి దాంట్లో వీలుంది. నేనూ ఇంటర్‌ ఎన్‌ఐఓఎస్‌లోనే పూర్తిచేశాను. నాకు ఇష్టమైన సైకాలజీ, సామాజిక శాస్త్రం, బిజినెస్‌... ఇలా పాఠ్యాంశాల్ని ఎంపిక చేసుకుని చదువుకున్నా.

- మేఘన దబ్బర

బాధ్యతతో మెలగాలి

మేమంతా ఓ ఫ్యామిలీ. మా నలుగురి ఆలోచనలు ఒకేలా ఉంటాయి. చైల్డ్‌ అడాప్షన్‌ ప్రోగ్రామ్‌తో 6 నుంచి 10 ఏళ్ల పిల్లల్ని అడాప్ట్‌ చేసుకున్నాం. పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా అనాథలు, నిరుపేదలైన పిల్లలకు ప్రాధాన్యతనిస్తూ 50 మందికి పైనే ప్రస్తుతం హోమ్‌లో ఉన్నారు. హోమ్‌లో అందరూ ఓ నిర్ధిష్టమైన వ్యక్తిత్వంతో మసులుకునేలా జాగ్రత్త తీసుకుంటాం. ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత. హోమ్‌ గార్డెన్‌లో ఒక్కో మొక్కకు ఒక్కొక్కరు జవాబుదారీ. ఎవరి మొక్కను వారే సంరక్షించాలి. నేను పెంచే మొక్కకి నేనే బాధ్యత వహించాలనే వ్యక్తిత్వాన్ని పిల్లల్లో కలిగించడం దీని ప్రధాన ఉద్దేశం. అలాగే, గ్రాటిట్యూడ్‌. కృతజ్ఞతా పూర్వకంగా మెసులుకోవడం ఎలాగో చెబుతాం. అదీ ‘మ్యాజిక్‌ స్టోన్స్‌’ రూపంలో... నిద్రపోయే ముందు  పిల్లలకు ఈ స్టోన్స్‌ని ఇస్తాం. వాటిని పట్టుకుని రోజు మొత్తంలో వారు సంతృప్తిగా ఫీలైన వాటిని పంచుకోవాలి. మంచి భోజనం, నీరు, స్వచ్ఛమైన గాలీ... ఇలా ఏదైనా ఉన్నవాటిలోనే సంతృప్తిని వెతుక్కోవడం... కృతజ్ఞతను తెలుపడం అలవాటు చేస్తాం. ఎందుకంటే... పిల్లలు కలిసి మెలిసి ఎదిగే క్రమంలో ఒకరి పట్ల మరొకరు గ్రాటిట్యూడ్‌ని చూపిండం ఎంతైనా అవసరం.

- ప్రణీత గరిమెల్ల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని