ప్రేమకు.. షరతులు వర్తిస్తాయ్‌!!

‘యువకుల్లారా ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండండి!’ - విజయవాడలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రాసిన నోట్‌ సారాంశమది! ప్రాణంగా ప్రేమించాను... నువ్వు వదిలేస్తే... నాకు ప్రాణం ఎందుకు? - హైదరాబాద్‌లో ఓ యువతి చివరి మాట..వీరి బలవన్మరణానికి ప్రేమే కారణమైతే.. * వీరు ఎదుర్కొన్న కారణాలేంటి? * ఏ రకమైన మానసిక సంఘర్షణకు గురై ఉంటారు? * ఆకర్షణే ప్రేమనుకుని తనే తొందరపడ్డారా? * నిజమైన ప్రేమని గెలుచుకోవడంలో ఓడిపోయారా?.. ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు మదిలోకి రాక మానవు. కానీ, ఆ వ్యక్తి లేఖలో రాసిన ‘ప్రేమ విషయంలో జాగ్రత్త’ అనే వాక్యం మాత్రం పదే పదే ఓ హెచ్చరికలా యువతని తట్టి లేపేదే! ఎవరికి వారిని ప్రశ్నించుకునేలా చేసేదే! డియర్‌..

Published : 14 Jul 2018 02:07 IST

ప్రేమకు.. షరతులు వర్తిస్తాయ్‌!!

‘యువకుల్లారా ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండండి!’

- విజయవాడలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రాసిన నోట్‌ సారాంశమది!

ప్రాణంగా ప్రేమించాను... నువ్వు వదిలేస్తే... నాకు ప్రాణం ఎందుకు?

- హైదరాబాద్‌లో ఓ యువతి చివరి మాట.

వీరి బలవన్మరణానికి ప్రేమే కారణమైతే..
* వీరు ఎదుర్కొన్న కారణాలేంటి?
* ఏ రకమైన మానసిక సంఘర్షణకు గురై ఉంటారు?
* ఆకర్షణే ప్రేమనుకుని తనే తొందరపడ్డారా?
* నిజమైన ప్రేమని గెలుచుకోవడంలో ఓడిపోయారా?..
లా ఎన్నో రకాల ప్రశ్నలు మదిలోకి రాక మానవు. కానీ, ఆ వ్యక్తి లేఖలో రాసిన ‘ప్రేమ విషయంలో జాగ్రత్త’ అనే వాక్యం మాత్రం పదే పదే ఓ హెచ్చరికలా యువతని తట్టి లేపేదే! ఎవరికి వారిని ప్రశ్నించుకునేలా చేసేదే! డియర్‌... బాయ్స్‌ అండ్‌ గర్ల్స్‌.. జరసోచో! మీరు ఇప్పటికే పీకల్లోతు ప్రేమలో ఉన్నారా? లేదంటే... ప్రేమికులుగా మారేందుకు సిద్ధం అవుతున్నారా? కాస్తాగండి.. ఉడుకు వయసు తొందరలో ప్రేమ ప్యాకేజీ కిందున్న చిన్న అక్షరాల ‘కండీషన్స్‌ అప్లై’ ట్యాగ్‌లైన్‌ని చదివి ఉండకపోవచ్చు. ఒక్కసారి తరచి చూసుకోండి. ఆ కండిషన్స్‌ ఏంటో నిశితంగా చదివాకే అడుగు ముందుకేయండి!

1 లక్ష్యం ఉండాలి

‘లైఫ్‌ లాంగ్‌ నా చెయ్యి వదలను అన్నావ్‌. నీ వెంటే నేనని ప్రేమని ప్రజోజ్‌ చేశావు. కలిసి గంట కూడా కాలేదు. ఇప్పుడే వేరు చేసి మాట్లాడుతున్నావ్‌. ఇదేనా నీ ప్రేమ. నిన్ను ఎలా నమ్మేది?’ ఇలాంటి సందర్భం వచ్చిందంటే మీరు కేవలం ఆ గంట లేదంటే.. ఆ రోజు గురించి మాత్రమే ఆలోచిస్తున్నట్టు. ఇలా ఉంటే ఇరువురికీ ఓ లక్ష్యం లేనట్టే. దీంతో ఒకరిపై మరొకరు చీటికి.. మాటికీ కంప్లైంట్‌ చేసుకుంటూ జీవితాన్ని కాంప్లికేట్‌ చేసుకుంటారు. ఎవరెలాంటి వారు? అతని-ఆమె మనస్తత్వం ఏంటి? గతంలోనూ ఇలా చాలా సందర్భాల్లో జరిగిందా? అనే ప్రశ్నలు వేసుకొని సమాధానాలు వెదుక్కున్నాక ఒక నిర్ణయానికి రండి. ఇరువురి లక్ష్యం నుంచి ప్రేమ పుడితే మీ దృష్టంతా సుదూరంగా ఉన్న లక్ష్యంపైనే ఉంటుంది. లక్ష్యాన్ని చేరుకునేందుకు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగుతారు.

2 ఆధారపడకూడదు

‘ఇంట్లో నన్నెవరూ అర్థం చేసుకోరు. చివరికి నువ్వు కూడానా? ఇంట్లో వాళ్లకంటే ఎక్కువ నిన్నే ఎంతో నమ్మాను. నువ్వే నా ప్రపంచం అనుకున్నా. నువ్వేమో నన్ను సరిగా పట్టించుకోవడం లేదు.’ లాంటి మాటలు పదే పదే వస్తున్నాయంటే మీది ఆధారపడే మనస్తత్వం. మీకు ప్రేమ ప్రమాదకరమైందే. ప్రేమించిన వ్యక్తిపై పూర్తిగా ఆధారపడే మనస్తత్వం మీది. చిన్న మనస్పర్థ ఎదురైనా తట్టుకోలేరు. అనుక్షణం అభద్రతా భావంతో ప్రేమని కొలవడం అలవాటు చేసుకుంటారు. మీరెప్పటికీ ప్రేమలో సంతోషంగా ఉండలేరు. అవతలి వ్యక్తి పరిస్థితులు అర్థం చేసుకొని, మీరు ఇండూడ్యువాలిటీ నేర్చుకోవాలి. ప్రేమికులు ఒకరిపై మరొకరు ఆధారపడడం మానుకోవాలి.

3 అర్థం చేసుకోవాలి

‘ఎంత నమ్మాను. చివరికి మోసపోయా. ప్రాణంగా ప్రేమిస్తే ఎలా మోసం చేయాలనిపిస్తుంది. నాకేం సంబంధం అని నడి సముద్రంలో వదిలేస్తే ఎలా? తీరాన్ని చేరడం ఎంత కష్టం...’ అంటూ మదన పడిపోతారు కొందరు. ప్రేమలో మోసం చేయడం... మోసపోవడం లాంటివి ఉండవనే విషయాన్ని అర్థం చేసుకునే శక్తి మీకుండాలి. దగ్గరవ్వడం... విడిపోవడం అనేది ఇద్దరు వ్యక్తుల చుట్టూ ఉన్న పరిస్థితులు... వాటి ప్రభావం కారణంగానే జరుగుతుందన్న వాస్తవాన్ని గ్రహించాలి. చిన్నప్పటి నుంచీ గుండెలపై ఆడిస్తూ అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రుల్ని కాదని ప్రేమించిన వ్యక్తికి ఎలా దగ్గరయ్యాం అనే వాస్తవాన్ని అర్థం చేసుకున్ననాడు... అదే ప్రేమంచిన వ్యక్తి ఒకవేళ మిమ్మల్ని ప్రేమ పేరుతో మోసం చేసినా అర్థం చేసుకుని నిలబడే శక్తి మీకొస్తుంది. అప్పుడు పగ తీర్చుకోవడాలు, కుంగిపోవడాలు ఉండవు.

4 వద్దంటే వద్దనే!

‘నువ్వంటే అప్పుడు చాలా ఇష్టంగా అనిపించింది. ఇప్పుడు లేదు. ఎందుకు అంటే కారణాలు చెప్పలేను. మన మధ్య ప్రేమ చిగురించేటప్పుడు ఎందుకిలా? అని ఇద్దరం ఎప్పుడూ ప్రశ్నించుకోలేదు. ఇప్పుడు నువ్వు నన్ను ప్రశ్నిస్తుంటే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఏమో మన మధ్య ఉన్నది ప్రేమ కాదని నా కనిపిస్తోంది!’.. ప్రేమికులకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే స్వీకరించే శక్తి మీకుందా? కచ్చితంగా ఉండి తీరాలి. ఇరువురిలో ఎవరైనా వద్దంటే వద్దనే? ప్రేమ ఎప్పుడూ బలవంతంగా కుమ్మరించేది కాదు. అవసరం ఉన్నచోటే పంచేది. దీన్ని అర్థం చేసుకుంటే ప్రేమ సాగరంలో హింస తుపానుకు చోటుండదు.

5 ఓడిపోయే ధైర్యం

‘నా ప్రేమ సముద్రమంత అనుకున్నా... నా తీరాల్లో నువ్వో తారవు అనుకున్నా... ఒడ్డున నువ్వు ఆడుతుంటే.. నా కలల్ని అలలతో ముద్దాడా.. ఇప్పుడు అలలు అలసిపోయాయి... తీరాన్ని దాటలేకపోయాయి... అంటే, నేను ప్రేమలో ఓడియానా?..’ అనుకుంటే పొరబాటే. మీరు నమ్మారంతే.. మోస పోలేదు. ఓడిపోలేదు... కూలబడ్డారంతే... అనుకున్న నాడు ప్రేమలో ఓడిపోయినా జీవితాన్ని గెలిచే ధైర్యం కొత్త శక్తితో పుట్టుకొస్తుంది. సో... ప్రేమనే సంద్రంలో అలలు సహజం. వెనక్కీ.. ముందుకీ... వస్తుంటాయ్‌.. పోతుంటాయ్‌. కానీ, అలసిపోవు. సముద్రమంత లోతు జీవితానికి ఉంటుంది. తొంగి చూడండి. ఓడిపోయామనే బాధకంటే.. నేర్చుకున్నవి చాలానే ఉన్నాయ్‌ అనిపిస్తుంది. ఆ అనుభవం మీకే కాదు... మీ తోటి వారిని రక్షిస్తుంది.

ప్రశ్నతో మొదలవ్వాలి

ది నేర్చుకోవాలన్నా.. ప్రశ్న నుంచే ప్రయాణం మొదలవుతుంది. ప్రేమించాలనుకున్నప్పుడు కొన్ని ప్రశ్నలతోనే ‘లవ్‌ జర్నీ’ని ప్రారంభించాలి. నాది ప్రేమించే వయసేనా? ప్రేమని ఇవ్వడం.. తీసుకోవడంలో నాకంత పరిపక్వత ఉందా? నాకున్నది ఇష్టమా... ఆకర్షణా? ఎదుటి వ్యక్తి ఆశించేలా నేను ఉండగలనా? మార్పుని త్వరగా స్వీకరించగలనా? ఆకర్షణకీ.. ప్రేమకి ఏంటి తేడా? ప్రేమలో నేను నిజాయితీగా ఉన్నానా?...  లాంటి ప్రాథమికమైన ప్రశ్నలు.. వాటిని సమాధానాల్ని వెతుక్కునే ప్రయత్నం చేయాలి. పరిచయం ప్రేమగా మారడానికి ఎక్కువ సమయం పట్టదు. కానీ, పుట్టిన ప్రేమని ప్రేమగానే ఉంచుకోవడంలోనే ఎన్నో తడబాట్లు ఎదురవుతాయి. ముఖ్యంగా ఆశించడం. ఒకరి నుంచి మరొకరు ఆశించడం మొదలైన రోజు సమస్యలు మొదలవుతాయి. అక్కడే ప్రేమలో అవగాహనా లోపం బయటపడుతుంది. ఒకరి కోసం మరొకరు మార్పుల్ని స్వీకరించలేరు. మారాలనుకోరు. అక్కడే ప్రేమ ద్వేషంగా మారుతుంది. ఆ దశలోనే కొందరు చంపేందుకు వెనకాడరు. ఇంకొందరు చనిపోవడానికి సంకోచించరు. ప్రేమలో ఎదురయ్యే అలజడుల్ని తట్టుకునేందుకు ‘పంచుకోవడం’ అనేది ప్రాథమిక చికిత్స. బెస్ట్‌ ఫ్రెండ్స్‌తోనో... కుటుంబ సభ్యులతోనో వారి మానసిక సంఘర్షణని పంచుకోవాలి. కౌన్సెలింగ్‌ అవసరమైతే నిపుణుల్ని సంప్రదించేందుకు వెనకాడొద్దు.

- డాక్టర్‌.టీఎస్‌ రావు, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌

అదొక్కటే ప్రేమా?

  ప్రేమలో సైన్‌ఇన్‌ అవుతున్నారంటే కచ్చితంగా ‘టెర్మ్స్‌ అండ్‌ కండీషన్స్‌’ చదవాల్సిందే. తర్వాత చూద్దాంలే అని సైన్‌ఇన్‌ అయితే అనివార్యమైనప్పుడు సైన్‌అవుట్‌ అయ్యేందుకు ఎంతో సంఘర్షణకి గురవుతారు. ప్రేమంటే ప్రేమికుల ప్రేమే కాదు. ఇరువైపులా కుటుంబం ప్రేమ ఉంటుంది. ఇంట్లో ఎవరికైనా కావాల్సినంత ప్రేమ దొరికినప్పుడు.. ప్రేమ అవసరంగా మారదు. ఆకర్షణని ప్రేమ అనుకోరు. ఒకవేళ ప్రేమ విఫలమైనా... తిరిగి కుటుంబ ప్రేమ హత్తుకుంటుంది. సో... ఫ్యామిలితో కనెక్ట్‌గా ఉండడం ఎంతో అవసరం. ఆనందం వచ్చినా.. సంతోషంగా అనిపించిన అతిగా స్పందించే మనస్తత్వం ఉన్నవారికి ప్రేమ తీవ్రమైన గాయాలు చేస్తుంది. టేక్‌కేర్‌. ఇంకా చెప్పాలంటే... ఇష్టమైన వాటిని వదుకోవాల్సివస్తుంది.. ఇష్టం లేని వాటిని తీసుకోవాల్సివస్తుంది. అందుకు సిద్ధంగా ఉండాలి. ఇద్దరి మధ్య ఏదైన గ్యాప్‌ వస్తే ఎదుటివారి కోణంలోనూ నుంచి ఆలోచించగలగాలి. కలిసి క్లోజ్‌గా మాట్లాడినంత మాత్రన ఏదేదో ఊహించుకోవద్దు. ప్రేమ అనుకుని ఊహల్లో విహరించొద్దు. బీ ప్రాక్టికల్‌.. బీ బోల్డ్‌ ఇన్‌ లవ్‌!!

- మహమ్మద్‌ కనీజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని